Share News

Ycp Leader: పేదల ప్లాట్లతో దందా..!

ABN , Publish Date - Mar 12 , 2025 | 01:10 AM

నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లను ఓ వైసీపీ నాయకుడు యథేచ్ఛగా విక్రయించేస్తున్నాడు. గతంలో పేదలకు ప్రభుత్వం ప్లాట్లు కేటాయించింది. ఆర్థిక ఇబ్బందులతో కొందరు ఇళ్లు కట్టుకోలేకపోయారు. అలా ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి ఆ నాయకుడు వాటికి నకిలీ పట్టాలు సృష్టిస్తున్నాడు. అప్పటి తహసీల్దార్‌ సంతకాలను ఫోర్జరీ చేసి అమాయకులకు ...

Ycp Leader: పేదల ప్లాట్లతో దందా..!
Vengam Naidu Colony

రిటైర్డ్‌ తహసీల్దార్‌ ఫోర్జరీ సంతకంతో పట్టాలు

బోగస్‌ పట్టాలతో పేదల ఇంటి స్థలాలు కబ్జా

మితిమీరిన వైసీపీ నాయకుడి ఆగడాలు

పట్టించుకోని రెవెన్యూ అధికారులు

నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లను ఓ వైసీపీ నాయకుడు యథేచ్ఛగా విక్రయించేస్తున్నాడు. గతంలో పేదలకు ప్రభుత్వం ప్లాట్లు కేటాయించింది. ఆర్థిక ఇబ్బందులతో కొందరు ఇళ్లు కట్టుకోలేకపోయారు. అలా ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి ఆ నాయకుడు వాటికి నకిలీ పట్టాలు సృష్టిస్తున్నాడు. అప్పటి తహసీల్దార్‌ సంతకాలను ఫోర్జరీ చేసి అమాయకులకు అమ్మేస్తున్నాడు. అసలు లబ్ధిదారులు అక్కడికి వచ్చి తమ ప్లాట్లను కబ్జా చేశారని రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోలేదు.

పామిడి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): పేదలకు కేటాయించిన ప్లాట్లను ఓ వైసీపీ నాయకుడు ఇష్టారాజ్యంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు. రూ.10వేలు ఇచ్చుకో.. పట్టా పుచ్చుకో.. అంటూ కొత్తదందాకు శ్రీకారం చుట్టాడు. రెవెన్యూ శాఖలోని కిందిస్థాయి సిబ్బంది సహకారంతో ఓ రిటైర్డ్‌ తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇష్టారాజ్యంగా కరపత్రాలు పంచినట్లు ఇంటి పట్టాలు పంచేస్తున్నాడు. ప్రభుత్వ స్థలాలతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. నకిలీ పట్టాలతో నిరుపేదల స్థలాలను దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఆక్రమించిన స్థలాలను


అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నాడు. వైసీపీ నాయకుడు, అతడి అనుచరుల వ్యవహారంపై ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. పట్టణంలోని 44వ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న చైతన్య కాలనీ, వెంగమనాయుడు కాలనీలలో నిరుపేదలకు రెవెన్యూ అధికారులు నివేశన స్థలాలను మంజూరు చేశారు. ఆ స్థలాలను కొందరు ఆక్రమించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. నకిలీ పట్టాలు సృష్టించి నిరుపేదలకు తెలియకుండానే ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో పనిచేసి బదిలీ అయిన ఇద్దరు వీఆర్వోలు ఆక్రమణదారులకు అండగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది వైసీపీ నాయకుడికి, అతడి అనుచర గణానికి కాసుల వర్షం కురిపిస్తోంది.

ఖాళీగా కనిపిస్తే కబ్జానే..

చైతన్య కాలనీ, వెంగమనాయుడు కాలనీలలో ఖాళీగా కనిపించే స్థలాలను దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. ఆగమేఘాల మీద నకిలీ పట్టా సృష్టించి తమదేనంటూ అమ్మేస్తున్నారు. వైసీపీ నాయకుడు విశ్రాంత తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ పట్టాలను సృష్టించి రూ. 10వేలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఒకే ప్లాటును ఇద్దరు వ్యక్తులకు వేరు వేరుగా విక్రయించి సొమ్ము చేసుకున్న ఘటనలు ఉన్నాయి. ఈ కాలనీలలో కొన్నేళ్ల క్రితం నిరుపేద కుటుంబాలకు మంజూరు చేసిన నివేశన స్థలాలు ఖాళీగా ఉన్నాయి. గతంలో రెవెన్యూ అధికారులు ఏయే ఫ్లాటు ఖాళీగా ఉన్నాయో సర్వే చేపట్టి జాబితా తయారు చేశారు. ఆ జాబితా కొందరు ఆక్రమణదారుల చేతికి చేరింది. దీంతో ఏయే ప్లాటు ఖాళీగా ఉందో తెలుసుకొని వైసీపీ హయాంలో కొందరు రాజకీయ అండదండలతో ఆక్రమించుకొని నకిలీ పట్టాలతో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో రెవెన్యూ అధికారులు ఇచ్చిన పట్టాలను రద్దు పరచకుండానే ఇతరులకు పట్టాలిస్తున్నారని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని వాపోతున్నారు.

కూటమి వైపు ఆ నేత చూపు

ఇటీవల వైసీపీ నాయకుడి అక్రమాలు ఒకటొకటిగా బయటపడుతుండడంతో భయం పట్టుకుంది. నిరుపేదల ప్లాట్ల కబ్జా, నకిలీ పట్టాల వ్యవహారం తెలిసిపోయింది. ఇప్పుడు ఆ వైసీపీ నాయకుడితో పాటు అనుచరుల చూపు టీడీపీ వైపు మ ల్లింది. ఎలాగైనా టీడీపీ గూటికి చేరాలని పావులు కదుపుతున్నా రు. ఇప్పటికే కొందరు ఎన్డీయే కూటమిలో చేరిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. టీడీపీలోకి చేరలేని పక్షంలో కూటమి మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనలోకైనా తన అనుచర గణంతో చేరేందుకు సిద్ధంగా ఉన్నాడు. గత కొద్ది రోజులుగా నాయకులతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

కబ్జా చేసి.. అమ్మేశారు

్చవెంగమనాయుడు కాలనీలో చాలా ప్లాట్లను కబ్జా చేసి అమ్మేశారు. సర్వేనెంబర్‌ 429/3లో నాకు 145వ ప్లాటు కేటాయించి పట్టా ఇచ్చారు. నా ప్లాటుకు నకిలీ పట్టా సృష్టించి విక్రయించేశారు. ఆక్రమణదారుడికి ఓ మాజీ వీ ఆర్వో అండదండలు ఉన్నాయి. అప్పట్లో ఆర్థిక స్థోమత లేకపోవడంతో పాటు కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఇళ్లు నిర్మించుకోలేకపోయా. ఈ స్థలం మాదని అన్ని ఆధారాలతో రెవెన్యూ అధికారుల వద్ద ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథులే లేరు.

ఆక్రమణలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు

పామిడి పట్టణంలోని నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన నివేశన స్థలాలను, వాగులు, వంకలను ఆక్రమిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తాం. ప్రభుత్వ స్థలాల క్రమ విక్రయాలు చట్టవిరుద్ధం. అలాంటి వాటికి ఎలాంటి పత్రాలు జారీ చేయబోం. ఆక్రమణదారులకు అండగా నిలిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు. బాధితులకు న్యాయం చేకూరేలా తగిన చర్యలు తీసుకుంటాం.

-శ్రీధరమూర్తి, తహసీల్దార్‌, పామిడి


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 12 , 2025 | 01:10 AM