Farmers : అయోమయం..!
ABN , Publish Date - Aug 13 , 2025 | 01:10 AM
పంట నష్టపోయిన రైతులకు ఎప్పటిలోగా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పరిహారం అందుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈనెల 11న కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన రాజస్థానలోని జుంజును నుంచి దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి ఫసల్ బీమా ...
జిల్లాకు ఫసల్ బీమా రూ.77.49 కోట్లు విడుదల
ఆధార్‌తో బ్యాంక్ ఖాతా లింక్ కాలేదంటూ సమాచారం
ఎప్పటిలోగా జమ అవుతుందో తెలియక రైతుల ఆందోళన
అనంతపురం అర్బన, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): పంట నష్టపోయిన రైతులకు ఎప్పటిలోగా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పరిహారం అందుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈనెల 11న కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన రాజస్థానలోని జుంజును నుంచి దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి ఫసల్ బీమా సొమ్మును విడుదల చేశారు. దీంతో తమకు ఫసల్ బీమా సొమ్ము జమ అవుతుందని జిల్లా రైతులు ఆశపడ్డారు. అయితే ఇప్పటి దాకా ఏ ఒక్క రైతుకు సొమ్ము జమ కాలేదు. జిల్లాలోని అనేక మంది రైతుల ఫోన్లకు 2024 ఫసల్ బీమా కింద జమ అయ్యే డబ్బుల వివరాలతో సంక్షిప్త సమాచారం మాత్రమే పంపారు. అందులో మీ ఆధార్, బ్యాంక్ ఖాతా నెంబర్‌తో లింక్ కాకపోవడంతో ఫసల్ బీమా సొమ్ము జమ కాలేదంటూ సమాచారం వచ్చింది. అన్నదాత సుఖీభవ డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాకు జమ అయినప్పుడు ఫసల్ బీమా ఎందుకు జమ కాదంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై వ్యవసాయ శాఖ
అధికారులు సైతం సరైన సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నారు.
జిల్లాకు రూ.77.49 కోట్లు విడుదల
ప్రఽధాన మంత్రి ఫసల్ బీమా ద్వారా 2023 ఖరీఫ్, రబీ, 2024 ఖరీఫ్ సీజన్లకు సంబంధించి జిల్లాకు రూ.77.49 కోట్లను విడుదల చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయ అధికారులకు ఫసల్ బీమా విడు దలకు సంబంధించిన పూర్తి వివరాలు మంగళవారం సాయంత్రానికి కూడా కమిషనరేట్ ఉన్నతాధికారులు పంపలేదు. సాయంత్రం 5.30 గంటలకు జిల్లాకు పంటల వారిగా ఎంత ఫసల్ బీమా సొమ్ము విడుదలైందన్న వివరాలు మాత్రమే పంపారు. మరో పది రోజుల్లోగా ఫసల్ బీమా సొమ్ము జమ అయ్యే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయ అధికారులు ప్రకటన విడుదల చేశారు. అయితే జిల్లాలో రైతుల వారిగా ఏఏ పంటలకు ఎంత విస్తీర్ణానికి ఎంత ఫసల్ బీమా విడుదలైందన్న వివరాలు లేకపోవడం గమనార్హం. దిగుబడి ఆధారంగా ప్యూచర్ జనరిక్ ఇన్సూరెన్స కంపెనీ ద్వారా ఫసల్ బీమాను వర్తింపజేశారు. 2023 రబీ సీజన వరకు ప్రభుత్వమే రైతుల తరపున ప్రీమియం చెల్లించేలా నిర్ణయించారు. అప్పట్లో ఈ విధానాన్ని గత ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదన్న కారణంతో 2024 రబీ సీజన నుంచి రైతుల ద్వారా ప్రీమియం చెల్లించేలా నిర్ణయించారు.
ఫసల్ బీమా విడుదల ఇలా..
2023 ఖరీ్‌ఫలో కంది రైతులకు రూ.1,59,73,932లు, 2023 ఖరీఫ్‌లో ఎండు మిరప రైతుకు రూ.1,33,72,251, 2023 ఖరీ్‌ఫలో జొన్న రైతులకు రూ.45,70,041లు విడుదలైంది. 2023 ఖరీ్‌ఫలో మూడు పంటలకు మొత్తం రూ.3,39,16,224లు విడుదలైంది. 2023 రబీ సీజనలో పప్పుశనగ రైతులకు రూ.14,97,59,866లు, వేరుశనగ రైతులకు రూ.29,19,301లు విడుదలైంది. 2023 రబీలో రెండు పంటలకు మొత్తం రూ.15,26,79,168లు విడుదల చేశారు. 2024 ఖరీ్‌ఫలో కంది రైతులకు రూ.56,55,43,578లు, జొన్న రైతులకు రూ.2,28,41,233లు విడుదలైంది.
డబ్బులు జమ కాలేదు
ఫసల్ బీమా డబ్బులు ఇంకా జమ కాలేదు. పోయిన సంవత్సరం 10 ఎకరాల్లో కంది పంట వేశాం. వానలు సరిగా రాకపోవడంతో దిగుబడి రాలేదు. నా సెల్ ఫోనకు 2024 ఫసల్ బీమా డబ్బులు రూ.7457లు వచ్చాయని, అయితే ఆధార్‌కు బ్యాంక్ ఖాతాను లింక్ కాలేదని మెసేజ్ వచ్చింది. ఎప్పుడు డబ్బులు జమ అవుతాయో అర్థం కావడం లేదు.
- మహిళా రైతు లక్ష్మీనారాయణమ్మ, రామరాజుపల్లి, పామిడి మండలం
మెసేజ్ వచ్చింది
గత ఏడాది నాలుగు ఎకరాల్లో కంది పంట సాగు చేశా. పంట పూత సమయంలో మేఘావృతం కావడంతో పూత డ్రాప్‌అవుట్ అయ్యింది. అలాగే సకాలంలో వర్షాలు పడకపోవడంతో దిగుబడి రాకపోవడంతో నష్టపోయా. రూ.14958లు ఆధార్‌కు బ్యాంక్ ఖాతా లింక్ లేకపోవడంతో జమ కాలేదని సెల్ ఫోనకు మెజేస్ వచ్చింది. జిల్లాలోని అనేక మందికి ఇలాంటి సమాచారమే వచ్చింది. అన్నదాత సుఖీభవ డబ్బులు జమైనప్పుడు ఫసల్ బీమా ఎందుకు జమ కావడం లేదో అర్థం కావడం లేదు. దీనిపై వ్యవసాయ అధికారుల వద్ద సరైన సమాచారం లేదు. రైతుల వారిగా జాబితాను విడుదల చేసి, ఫసల్ బీమా ఎందుకు జమ కాలేదో సరైన సమాధానం చెబితే బాగుంటుంది.
- రైతు వలి, మర్తాడు, గార్లదిన్నె మండలం