CM Chandrababu: శాంతికి బ్రాండ్ అంబాసిడర్‌లా సత్యసాయి బాబా: చంద్రబాబు
ABN , Publish Date - Nov 22 , 2025 | 01:26 PM
మానవ సేవే.. మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని సత్యసాయి బాబా ట్రస్టు అమలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 7.50 లక్షల మంది వాలంటీర్లు సత్యసాయి బాబా ట్రస్టు ద్వారా సేవలందించారని... ఏ వ్యవస్థకు ఇంతటి శక్తి లేదన్నారు.
శ్రీసత్యసాయి జిల్లా, నవంబర్ 22: లవ్ ఆల్.. సర్వ్ ఆల్, ఎప్పుడూ సేవ చేస్తూనే ఉండాలని... ఎవ్వరినీ నొప్పించకూడదు అనేది సత్యసాయి బాబా సిద్ధాంతమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల్లో సీఎం పాల్గొని ప్రసంగించారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసా అనే ఈ ఐదు సూత్రాలను సత్యసాయి బాబా చెప్పేవారని గుర్తు చేశారు. సత్యసాయి బాబా చెప్పిన సిద్ధాంతాలు.. సూత్రాలను పాటిస్తే ప్రపంచం శాంతిగా ఉంటుందన్నారు. ఆంధ్రా, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో తాగు నీటి సౌకర్యాన్ని కల్పించారని తెలిపారు.
తాగు నీటి ప్రాజెక్టు కోసం అవసరమైతే ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టాలని సత్యసాయి బాబా భావించారన్నారు. కానీ ఆయన అభిప్రాయాన్ని తెలుసుకున్న భక్తులు... పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి తాగు నీటి ప్రాజెక్టులకు నిధులను సమకూర్చారని ఆనాటి సంగతులను గుర్తుచేశారు. ఇప్పటికీ అదే స్పూర్తిని సత్యసాయి బాబా భక్తులు కొనసాగించడం తనకు సంతోషాన్ని ఇస్తోందన్నారు. సత్యసాయి బాబాతో తనకు మంచి అనుబంధం ఉందని సీఎం గుర్తుచేశారు.
వివిధ ప్రాణాంతక రోగాల బారిన పడిన వారిని సత్యసాయి బాబా ట్రస్టు ఆదుకుంటోందని సీఎం పేర్కొన్నారు. మానవ సేవే... మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని సత్యసాయి బాబా ట్రస్టు అమలు చేసి చూపిస్తోందన్నారు. శాంతికి బ్రాండ్ అంబాసిడర్ లాగా సత్యసాయి బాబా నిలుస్తారని చెప్పుకొచ్చారు. 7.50 లక్షల మంది వాలంటీర్లు సత్యసాయి బాబా ట్రస్టు ద్వారా సేవలందించారని... ఏ వ్యవస్థకు ఇంతటి శక్తి లేదన్నారు. ఇవాళ సత్యసాయి ట్రైబల్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రొగ్రాం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.
ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే సత్యసాయి బాబా స్పూర్తితో సేవలందిస్తారన్నారు. ధనవంతులు, పెద్ద ఉన్నతాధికారుల కుటుంబాలకు చెందిన పిల్లలను ప్రశాంతి నిలయానికి పంపి సేవా కార్యక్రమాలు చేయిస్తారన్నారు. 140 దేశాల్లో 2 వేలకు పైగా బ్రాంచ్‌లు సత్యసాయి బాబా ట్రస్టుకు ఉన్నాయన్నారు. భగవాన్ సత్యసాయి బాబా భక్తులు శాంతికి అంబాసిడర్లుగా నిలవాలని కోరారు. సత్యసాయి సాయిబాబా సిద్ధాంతాన్ని సర్వత్రా వ్యాపించేలా కృషి చేయాలన్నారు. రాష్ట్రపతి ముర్ము జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
రూ.6 లక్షలకు శిశువు విక్రయం.. కరీంనగర్‌లో దారుణం
అపోహలు నమ్మొద్దు.. ఆరు నెలల్లో పరిష్కరిస్తాం: కేంద్రమంత్రి
Read Latest AP News And Telugu News