CROP: నత్తల దండు
ABN , Publish Date - Oct 22 , 2025 | 11:55 PM
నత్త అంటే ఎక్కడో ఒకటో, రెండో కనిపిస్తుంటాయి. అలాంటి నత్తలు లక్షలాదిగా దండుగా ఏర్పడి, పంటలను నాశనం చేస్తున్నాయి. రైతులు లక్షలు పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంటలను మొక్క దశలోనే దెబ్బతీస్తున్నాయి. మండలంలోని మహమ్మదాబాద్ పంచాయతీ పరిధి గొల్లపల్లి ప్రాంతంలో లక్షలాది నత్తలు పంటల్లో సంచరిస్తున్నాయి.
లక్షలాదిగా పంటలపై దాడి
మొక్క దశలోనే నాశనం చేస్తున్న వైనం
తీవ్రంగా నష్టపోతున్న రైతులు
అమడగూరు, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): నత్త అంటే ఎక్కడో ఒకటో, రెండో కనిపిస్తుంటాయి. అలాంటి నత్తలు లక్షలాదిగా దండుగా ఏర్పడి, పంటలను నాశనం చేస్తున్నాయి. రైతులు లక్షలు పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంటలను మొక్క దశలోనే దెబ్బతీస్తున్నాయి. మండలంలోని మహమ్మదాబాద్ పంచాయతీ పరిధి గొల్లపల్లి ప్రాంతంలో లక్షలాది నత్తలు పంటల్లో సంచరిస్తున్నాయి. గ్రామ పరిధిలో 200 ఎకరాలదాకా సజ్జ, మొక్కజొన్న, టమోటా, మిరప, వంకాయ తదితర పంటలు సాగుచేశారు. అన్ని పంటలపైనా నత్తలు ప్రభావం చూపుతున్నాయి. మొక్క దశలో పూర్తిగా తినేస్తున్నాయి. వీటి బారి నుంచి పంటలను ఎలా కాపాడుకోవాలో అర్థంకాక రైతులు దిక్కులు చూస్తున్నారు. ఏడాదిన్నరగా వాటితో నష్టపోతూనే ఉన్నారు. పగలు పంటల్లో ఉంటూ, రాత్రిళ్లు ఇళ్లల్లోకి చొరబడి నిద్రలేకుండా చేస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు నత్తల బెడద తప్పించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.
రెండు పద్ధతుల్లో నివారణ - వెంకటరమణాచారి, ఏఓ, అమడగూరు
నత్తలు పొలాల్లోకి చొరబడి పంటలను నాశనం చేస్తున్నది వాస్తవమే. వీటి నివారణకు రెండు పద్ధతులున్నాయి. లీటరు నీటికి 100 గ్రాముల ఉప్పు కలిపి పంటపై కాకుండా నత్తలపై పిచికారీ చేయాలి. రెండో విధానంలో ఎకరాకు 250 గ్రాముల కాపర్ సల్ఫేట్, 250 గ్రాముల పెరస్ సల్ఫేట్ డ్రిప్పు ద్వారా కానీ, పిచికారీ చేసినా నత్తల బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....