Share News

Ananthapuram News: రప్పా.. రప్పా.. స్టేషన్‌కు రాండప్పా..!

ABN , Publish Date - Dec 23 , 2025 | 11:40 AM

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‏రెడ్డి పుట్టిన రోజు వేడుకలు అనంతపురం జిల్లాలో కొత్త వివాదానికి తెరలేపాయి. మూగజీవాలను బలి ఇచ్చి, ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసిన వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మొత్తం 26 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో 13 మందిని అరెస్టు చేసి, స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపించారు.

Ananthapuram News: రప్పా.. రప్పా..  స్టేషన్‌కు రాండప్పా..!

- అనంతలో 26 మందిపై కేసులు.. 13 మంది అరెస్టు

- మరో ముగ్గురు బైండోవర్‌

అనంతపురం: వైసీపీ అధినేత జగన్‌(Jagan) పుట్టినరోజు వేడుకలలో మూగజీవాలను బలి ఇచ్చి, ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసిన వైసీపీ నాయకులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. డీఐజీ షిమోషి ఆదేశాలతో ఉమ్మడి అనంతపురం(Ananthapuram) జిల్లాలో మొత్తం 26 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో 13 మందిని అరెస్టు చేసి, స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపించారు. మరో ముగ్గురిని తహసీల్దారు వద్ద బైండోవర్‌ చేశారు.


pandu2.jpg

- అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లిలో వైఎస్‌ జగన్‌ ఫ్లెక్సీకు ఆదివారం రక్తాభిషేకం చేశారు. సర్పంచ్‌ ఆదినారాయణరెడ్డి ఆధ్వర్యంలో జగన్‌ ఫ్లెక్సీ ముందు ఐదు పొట్టేళ్లను వేటకొడవళ్లతో నరికి బలి ఇచ్చారని ఎస్‌ఐ నరేంద్ర కుమార్‌ తెలిపారు. వాటి రక్తంతో జగన్‌ ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేశారని, రఫ్పా రఫ్పా అనే పాటను జోడించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారని తెలిపారు. బొమ్మగానపల్లి సర్పంచ్‌ ఆదినారాయణరెడ్డితో ఆరుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.


pandu2.2.jpg

కోర్టు ఆదేశాల మేరకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపించారు. ఈ క్రమంలో పోలీస్‏స్టేషన్‌ ముందు ధర్నా చేస్తామని వైసీపీ నాయకులు సోమవారం ఉదయం సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో డీఎస్పీ రవిబాబు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా గ్రామాల్లో ఇటువంటి వాటిని ప్రోత్సహించరాదన్న ఉద్దేశంతో ఎస్పీ జగదీష్‌ ఆదేశాల మేరకు కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


- విడపనకల్లు మండల కేంద్రంలో పొట్టేళ్లను నరికి, జగన్‌ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసిన ఆరుగురిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ ఖాజా హుస్సేన్‌ సోమవారం తెలిపారు. బస్టాండు ప్రాంతంలో భయానక వాతావరణం సృష్టించిన వైసీపీ నాయకులు రుద్ర, దస్తగిరితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితులు వేట కొడవళ్లు చేత పట్టుకుని, తప్పెట్లు కొట్టిస్తూ, చిందులు వేశారు. ప్లెక్సిలపై ‘2029లో రప్పా రప్పా’ అని రాయించారు.


pandu2.3.jpg

- శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోట గ్రామంలో మూగ జీవాలను బలి ఇచ్చి, జగన్‌ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసిన 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఏడుగురిని అరెస్టు చేశామని ఎస్‌ఐ మహమ్మద్‌ రిజ్వాన్‌ సోమవారం తెలిపారు. మిగిలినవారిని అరెస్టు చేస్తామని తెలిపారు.

- రామగిరి మండలం పోలేపల్లికి చెందిన ముగ్గురు వైసీపీ సానుభూతిపరులను పోలీసులు తహసీల్దార్‌ ఎదుట సోమవారం బైండోవర్‌ చేశారు. సొంత పూచీకత్తుపై వదిలేశారు. జగన్‌ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి గ్రామంలో కేక్‌కట్‌ చేశారు. ‘రప్పా రప్పా..’ అంటూ కేకలు వేశారు. గ్రామస్థులు ఇబ్బందిపడేలా వ్యవహరించారు. దీంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని హెచ్చరించారు.


బహిరంగ జంతుబలి నేరం

ధర్మవరం: బహిరంగంగా జంతుబలి ఇవ్వడం నేరమని దర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్‌ సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. బహిరంగంగా జంతు బలి ఇచ్చి, రక్త సంతర్పణ చేయడం కక్షలు పెంచుతాయన్నారు. మాజీ సీఎం జగన్‌ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం కనగానపల్లి మండలం బానుకోట గ్రామంలో కొందరు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పొట్టేళ్లను బలి ఇచ్చి, తమ అధినేత ఫ్లెక్సీకి రక్త తర్పణం చేశారన్నారు. దీనిపై కేసు నమోదు చేసి, ఏడుగురిని అరెస్టు చేశారన్నారు. ఇలాంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తామనీ, రౌడీ షీట్లు తెరుస్తాని డీఎస్పీ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇచ్చంపల్లి నుంచి తరలిస్తే మహారాష్ట్రకు ముంపు!

ఈశాన్య రుతుపవనాలు బలహీనం

Read Latest Telangana News and National News

Updated Date - Dec 23 , 2025 | 11:40 AM