Share News

AP News: పండుగ అయిపోయి వారం రోజులైనా.. దసరా మామూళ్ల గోల తగ్గడం లేదుగా..

ABN , Publish Date - Oct 09 , 2025 | 03:31 PM

పండుగ అయిపోయి దాదాపు వారం రోజులవుతున్నా దసరా మామూళ్ల గోల తగ్గడం లేదు. జిల్లాలో రేషన్‌ షాపులకు నిత్యావసర సరుకులు సరఫరా చేసే మండల లెవల్‌ స్టాక్‌ పాయింట్‌(ఎంఎల్‌ఎస్)లకు ఇంకా దసరా మామూళ్లు అందలేదట. దీంతో త్వరగా పంపాలంటూ తెగ ఫోన్లు కొడుతున్నట్లు సమాచారం.

AP News: పండుగ అయిపోయి వారం రోజులైనా.. దసరా మామూళ్ల గోల తగ్గడం లేదుగా..

- దసరా మామూళ్ల టార్గెట్‌ రూ.అరకోటి

- ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి ఫోన్‌కాల్స్‌

- ఒక్కో రేషన్‌ డీలర్‌ రూ.3వేలు ఇవ్వాలని డిమాండ్‌

- పేపర్‌ రోల్స్‌ ఇవ్వాలంటే తప్పని మామూళ్లు

అనంతపురం: పండుగ అయిపోయి దాదాపు వారం రోజులవుతున్నా దసరా మామూళ్ల గోల తగ్గడం లేదు. జిల్లాలో రేషన్‌ షాపులకు నిత్యావసర సరుకులు సరఫరా చేసే మండల లెవల్‌ స్టాక్‌ పాయింట్‌(ఎంఎల్‌ఎస్)లకు ఇంకా దసరా మామూళ్లు అందలేదట. దీంతో త్వరగా పంపాలంటూ తెగ ఫోన్లు కొడుతున్నట్లు సమాచారం. ప్రతి రేషన్‌ డీలర్‌ రూ.3వేలు చొప్పున ఇవ్వాలని చెబుతున్నట్లు తెలిసింది. సమయం, సందర్భం లేకుండా మామూళ్లు వసూళ్లు చేస్తుండటంపై రేషన్‌షాపు డీలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


రూ.అరకోటి టార్గెట్‌

జిల్లాలో మొత్తం 1645 రేషన్‌ షాపులున్నాయి. ఒక్కో డీలర్‌ నుంచి రూ. మూడు వేలు ప్రకారం మొత్తం షాపుల నుంచి రూ.49.35లక్షలు వసూలవుతుంది. అదే స్థాయిలో జిల్లాలో ఏడు స్టాక్‌ పాయింట్లున్నాయి. ఒక్కో పాయింట్‌లో డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు ఆరేడు మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో డీటీ కాకుండా మిగిలిన వారి నుంచి గత కొన్ని రోజులుగా రేషన్‌ షాపు డీలర్లకు ఫోన్‌ కాల్స్‌ వెళ్తున్నాయి. దసరా మామూలు కింద రూ.3వేలు పంపండి అంటున్నారట. రూ.1000లు పంపుతామని ఎవరైనా డీలర్‌ అంటే అలా కుదరదబ్బా...మేమేమైనా ప్రతి నెలా అడుగుతున్నామా..? దసరా కొక్కటే కదా అని ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.


దీంతో కొందరు నేరుగా నగదు అందిస్తుండగా మరికొందరు ఫోన్‌పే ద్వారా పంపుతున్నట్లు తెలిసింది. డీలర్లు సరిగా స్పందించకపోతే కొన్ని స్టాక్‌ పాయింట్ల నుంచి నలుగురైదు గురు సిబ్బంది ఒకే డీలర్‌కు ఫోన్‌ చేస్తున్నారట. వసూలు చేసిన మొత్తం అంతా ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలోనే పంచేసుకుంటున్నారా...?లేక ఉన్నతాధికారులకు వాటా ఇస్తున్నారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ మామూళ్ల వ్యవహారంపై కొందరు డీలర్లు ఇదేందబ్బా ఇలా ఎన్ని పేర్లతో వసూలు చేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


తాజాగా అధికారపార్టీకి చెందిన ఓ రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధి వస్తున్నారంటూ ఒక్కో డీలర్‌ నుంచి ఒక్కో పీడీఎస్‌ బియ్యం బస్తా తీసుకెళ్లారట. కానీ ఆ కార్యక్రమం రద్దయింది. కానీ ఆ బస్తాలు వెనక్కు రాలేదు. ఆ బియ్యం బస్తాలు అమ్మేసుకుని వచ్చిన సొమ్ము జేబులోకి వేసుకున్న ఘనులెవరో...? ఈ బస్తాలేమయ్యాయో డీఎ్‌సఓకు, సీఎ్‌సడీటీలకూ తెలిసే ఉంటుందనే విమర్శలున్నాయి. ఇక హమాలీలు దసరా మామూళ్లు రూ.1000ల నుంచి 2వేల వరకు అడుగుతున్నారట. ఇప్పటికే వారు స్టాక్‌ అన్‌లోడ్‌ చేసిన సమయంలో వసూలు చేసినట్లు తెలిసింది.


పేపర్‌ రోల్స్‌ ఇవ్వాలన్నా...

చివరికి పేపర్‌ రోల్స్‌ ఇవ్వాలన్నా దసరా మామాళ్లు ఇవ్వాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నారు. గత నెలలో కొత్తగా స్మార్ట్‌ రైస్‌ కార్డులు రేషన్‌ కార్డు దారులకు పంపిణీ చేశారు. అదే రీతిలో రేషన్‌ డీలర్లకు కొత్త ఈ పోస్‌ మిషన్లు అందజేశారు. తొలుత ఒక పేపర్‌ రోల్‌ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడేమో పేపర్‌ రోల్స్‌ కావాలంటే దసరా మామూలు రూ.500లు ఇవ్వాలంటున్నారట. అనంతపురంలోని డీలర్లు సంబంధిత వీఆర్వోలను పేపర్‌ రోల్స్‌ అడిగితే మా పరిధిలో లేదండి.


అదేదో మామూళ్లంటున్నారట! ఒకసారి అడిగి చూడండి అని చెప్పారట. తహసీల్దార్‌ను అడిగితే సంబంధిత కీలక గుమస్తాను కలవమంటారట. ఆయన ఆ మామూళ్లు ఇస్తేనే రోల్స్‌ ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మామూళ్ల మొత్తం ఇచ్చాక తాపీగా తన స్కూటీలో ఉంచుకున్న పేపర్‌ రోల్స్‌ ఇస్తాడట. వాటిని ఆఫీ్‌సలో కూడా ఉంచకపోవడం ఏంటని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. డీఎ్‌సఓ కార్యాలయం నుంచి సీఎస్ డీటీలకు ఆ పేపర్‌ రోల్స్‌ వెళ్లాలి. కానీ గుమస్తాల చేతిలోకి ఎలా వెళ్లాయో మరి. జిల్లా అంతా ఇదే తంతు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అంతా ఇస్తే కేవలం 10రోల్స్‌ మాత్రమే డీలర్ల చేతిలో పెడుతున్నారట. అదే డబ్బు బయట ఇస్తే 25రోల్స్‌ వస్తాయంటున్నారు.


డీఎంతో మాట్లాడతా: వెంకటేశ్వర్లు, డీఎస్ఓ

పేపర్‌ రోల్స్‌ రెండు నెలలకు సరిపడా ఉంది. పేపర్‌ రోల్స్‌ సీఎస్డీటీలు, అసోసియేషన్‌ నాయకులకు ఇచ్చాం. తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఉండకూడదు. అలా ఎవరో దసరా మామూళ్లు తీసుకుని ఇవ్వడానికి వీల్లేదు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి డీలర్లను అలా ఎలా అడుగుతారు. ఈ విషయంపై సివిల్‌ సప్లయిస్‌ డీఎంతో మాట్లాడతా.

అదంతా ఉత్తిదే..

ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి రేషన్‌షాపు డీలర్లకు ఎవరు ఫోన్‌ చేశారు..? ఎందుకు చేస్తారు..?అలాంటి దేమీ లేదు. అదంతా ఉత్తిదే. అలా ఏమీ జరగదు. ఇవన్ని ఉత్త ఆరోపణలే.

- రమేష్‏రెడ్డి, సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ మేనేజర్‌


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భారత్‌ దాల్‌.. అంతా గోల్‌మాల్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 09 , 2025 | 03:31 PM