Amaravati Construction Delay: మట్టి మేత
ABN , Publish Date - Jun 07 , 2025 | 02:45 AM
గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇసుక కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నేతలకు కాసులు కురిపించే వనరుగా మారి.. సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం ఇసుకతో పాటు మట్టి, బిల్డింగ్ మెటల్, రోడ్ మెటల్, ఇతర సూక్ష్మ ఖనిజాలు సైతం బంగారమైపోయాయి.
ప్రజాప్రతినిధుల గుప్పిట్లో గ్రావెల్
బిల్డింగ్, రోడ్ మెటల్ మైన్ లీజులూ
ఎక్కడికక్కడ సహజ వనరులు బ్లాక్
కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము
సామాన్యులతో పాటు ప్రభుత్వ ప్రాజెక్టులకూ ఇబ్బందులు
ఇలా అయితే అమరావతి పనులెలా?
గ్రావెల్, రోడ్‌మెటల్‌కు గడ్డు పరిస్థితులు
ముందే దృష్టి సారించని సర్కారు
సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు.. రోడ్లు, ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టుల నుంచి అమరావతి నిర్మాణ పనుల వరకు.. ఇసుక, సిమెంట్‌తో పాటు గ్రావెల్, బిల్డింగ్, రోడ్ మెటల్ (రాయి, కంకర) అవసరం. అయితే రాష్ట్రంలో గ్రావెల్, బిల్డింగ్, రోడ్ మెటల్ మైన్ లీజులను కొందరు ప్రజా ప్రతినిధులు, వారి అనుచరులు తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. కృత్రిమ కొరతను సృష్టించి ధరలు అమాంతం పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు.
అమరావతి నిర్మాణ పనులకు అవసరమైనంత గ్రావెల్ గుంటూరు జిల్లాలో లేదు. దీంతో పొరుగున ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వనరులపై ఆధారపడక తప్పని పరిస్థితి. అయితే అక్కడ కొందరు ప్రజాప్రతినిధులు గ్రావెల్ లీజులను హస్తగతం చేసుకున్నారు. వారి ఆజ్ఞ లేకుండా మట్టి రేణువు కూడా కదలని పరిస్థితి.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇసుక కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నేతలకు కాసులు కురిపించే వనరుగా మారి.. సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం ఇసుకతో పాటు మట్టి, బిల్డింగ్ మెటల్, రోడ్ మెటల్, ఇతర సూక్ష్మ ఖనిజాలు సైతం బంగారమైపోయాయి. ఏ నిర్మాణం జరగాలన్నా ఇవి తప్పనిసరి. ముఖ్యంగా రహదారి పనులు, ఇతర మౌలిక వనరుల ప్రాజెక్టుల నిర్మాణానికి ఇవే కీలకం. ప్రభుత్వ ప్రాజెక్టులకు, ప్రజలకు ఏది అవసరమో చూసుకోకుండా ప్రభుత్వం తన పనులు చేసుకుంటూ పోతోంది. డిమాండ్‌ను గుర్తించిన కొందరు ప్రజాప్రతినిధులు వాటిపై కన్నేశారు. అంతే.. గ్రావెల్, బిల్డింగ్, రోడ్ మెటల్ మైన్ లీజులు వారి చేతుల్లోకి వెళ్లిపోయాయి. నిర్మాణ, ఇతర ప్రాజెక్టులకు రోడ్, బిల్డింగ్ మెటల్ దొరకాలంటే వారి దయ ఉండాల్సిందే. దీంతో ప్రజలతో పాటు ప్రభుత్వ ప్రాజెక్టులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి నిర్మాణ పనులు మౌలిక వనరుల కొరతతో వేగం పుంజుకోలేకపోయినా, మధ్యలో ఆటంకాలు ఏర్పడినా ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంద ని అధికార వర్గాలు చెబుతున్నాయి.
జగన్ జమానా నుంచి..
ఇల్లు, ఇతర నిర్మాణాలకు అవసరమైన వనరులను ప్రభుత్వం నిర్దేశించిన వ్యక్తులు లేదా లీజుదారుల నుంచి కొనుగోలు చేసి తెచ్చుకోవాలి. జగన్ జమానా నుంచి పరిస్థితులు మారాయి. ప్రజాప్రతినిధులు, నేతలు ఆ వనరులపై కన్నేశారు. లీజులు ఎవరి పేరు మీదున్నా, కాంట్రాక్ట్ ఎవరికి వచ్చినా తమ కనుసన్నల్లోనే వ్యాపారం నడవాలని శాసించారు. కొందరయితే మరో అడుగు ముందుకేసి లీజులున్న మైన్‌లనే తమ అధీనంలో ఉంచుకుని వ్యాపారాలను సొంతం చేసుకున్నారు. గతంలో ఓ ముఖ్య పోస్టులో ఉన్న ఐఏఎస్ పుత్రరత్నం, అల్లుడు, ఓ ఎంపీ కుమారుడు.. ఇలా అనేక మంది చీకటి దందా చేశారు. విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లోని కొండలు, గుట్టలు, క్వారీలను హస్తగతం చేసుకున్నారు. దీంతో వ్యాపారం ఒకరిది.. సొమ్ము వారిదన్నట్లుగా సాగిపోయింది. ఇక జగన్ సర్కారు చేసిన ఇసుక వ్యాపారం వల్ల రాష్ట్రం, ప్రజలు సకలం నష్టపోయారు. రూ.వేల కోట్ల దోపిడీ జరిగింది.
నేతల కనుసన్నల్లో..
కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఇసుకను ఉచితం చేసింది. వ్యాపార, వాణిజ్య అవసరాలకు నిర్దేశిత ధరకు విక్రయిస్తోంది. జగన్ హయాంలో జరిగిన ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకుంది. అయితే కొందరు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి తెలియకుండా సొంతంగా రీచ్‌లు ఏర్పాటు చేసుకొని దందా సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి హెచ్చరికలను కూడా పట్టించుకోనంతగా చెలరేగిపోతున్నారు. గ్రావెల్ (ఎర్రమట్టి), బిల్డింగ్, రోడ్ మెటల్ (రాయి, కంకర) మైన్ లీజులను కూడా నేతలే దక్కించుకున్నారు. గతంలో ఉన్న లీజుదారులను బెదిరించి తమ నియంత్రణలోకి తీసుకున్నారు. దీంతో వాటి ధరలను బంగారం ధరతో పోటీ పడేలా పరుగులు పెట్టిస్తున్నారు. నియోజకవర్గం, మండలం, గ్రామం వారీగా కొందరు నేత లు సహజ వనరులైన కొండలు, గుట్టలు, మట్టి నిల్వలున్న భూములను చెరపట్టారు. గనుల శాఖ జారీ చేసిన లీజులు, మైనింగ్ పర్మిట్లతో సంబంధం లేదు.. ‘మా వ్యాపారం మాదే’ అన్నట్లుగా బరితెగించి సహజ వనరులను బ్లాక్ చేశారు. కృత్రిమ కొరత సృష్టించడంతో మట్టి, రోడ్, బిల్డింగ్ మెటల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈ భారాన్ని సామాన్యుడు మోయాల్సి వస్తోంది. ప్రభుత్వానికైనా సులువుగానే మట్టి, రోడ్‌మెటల్ లభిస్తోందా అంటే.. లేదనే చెప్పాలి.
ఇలాగైతే అమరావతికి ఎలా?
అమరావతి రాజధాని పనుల కోసం ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని లీజులను ప్రభుత్వం సిద్ధం చేసి పెట్టింది. కోటిన్నర క్యూబిక్ మీటర్ల మేర ఇసుక కావాలని ఇప్పటికే సీఆర్‌డీఏ డిమాండ్ లేఖ ఇచ్చింది. ఇక ఎర్రమట్టి అయితే రాజధాని పనుల కోసం కనీసం 10 కోట్ల క్యూబిక్ మీటర్లపైనే అవసరమని అంచనా వేశారు. ఈ మేరకు ముందుగానే రిజర్వ్ చేసి పెట్టుకోవాలని సూచించారు. ఇదంతా ఒక్క గుంటూరు జిల్లా నుంచే తీసుకోవడం కష్టం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రత్యేకించి సీఆర్‌డీఏ ప్రాంతంలో ఎర్రమట్టికి తీవ్ర కొరత ఉంది. అక్కడ ఉన్నదంతా నల్లమట్టినే. దాన్ని ఇంటి నిర్మాణంతో పాటు మౌలిక వనరుల ప్రాజెక్టులకు అసలు వాడలేరు. కాబట్టి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న వనరులపై ఆధారపడక తప్పదు. గన్నవరం, బాపులపాడు, అగిరిపల్లి, నందిగామ, జగయ్యపేట, కంచికచర్ల, నూజివీడు, విజయవాడ రూరల్ మండలాల్లో ఎర్రమట్టి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఆయా ప్రాంతాల్లో వాటి లీజులను కొందరు ప్రజాప్రతినిధులు సొంతం చేసుకున్నారు. కృష్ణా జిల్లా పరిధిలో నలుగురు ప్రజాప్రతినిధులు గ్రావెల్ లీజులను నియంత్రిస్తున్నారు. వారిలో కొత్తగా ఎన్నికైన ఓ ప్రజాప్రతినిధి కూడా ఉన్నారు. భవన నిర్మాణంతో పాటు రహదారులు, ఇతర కీలక ప్రాజెక్టులకు ఉపయోగపడే రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ వంటివి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో జి.కొండూరు, ఎ.కొండూరు, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, జగయ్యపేట, చందర్లపాడు, మైలవరం తదితర మండలాల పరిధిలో భారీగా లీజులున్నాయి. ఇప్పుడు ఇవి ఎక్కువగా ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. పేరుకే లీజుదారుల పేరిట ఉన్నాయి. కానీ నడిపించేది, వ్యాపారంతో పాటు చీకటి దందా చేస్తోంది కొందరు నేతలే. దీంతో ఈ సూక్ష్మ ఖనిజాల సరఫరా విషయంలో ఇసుకను మించిన కష్టాలు ఇప్పుడు వెంటాడుతున్నాయి. అమరావతి ప్రాజెక్టులకు సీఆర్‌డీఏ పరిధిలోని లీజుల నుంచి రోడ్‌మెటల్‌ను సరఫరా చేయడానికి కొంత ఇబ్బంది లేకున్నా, గ్రావెల్ కొరత తీవ్రంగా వెంటాడనుందని గనుల శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి.
ప్రభుత్వం స్పందించాలి
గ్రావెల్, రోడ్‌మెటల్ విషయంలో ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకొని సానుకూల నిర్ణయం తీసుకోవాలని గనుల శాఖ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ విషయంలో ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని చెబుతోంది. ఇదే అంశంపై గనుల శాఖలో అంతర్గత చర్చ జరుగుతోంది. త్వరలో ఓ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఇటు లీజుదారులు, అటు ప్రజలు, అమరావతి నిర్మాణ సంస్థలు కోరుతున్నాయి.
రెవెన్యూ వర్సెస్ అటవీ
అందుబాటులో పుష్కలమైన వనరులున్నా రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదం కారణంగా వాటిని ఉపయోగించుకోలేని పరిస్థితి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జి.కొండూరు మండలం కడిమిపోతవరం, లోయలోని సర్వే నంబర్ 26-2లోని లీజులే. ఇక్కడ మైనింగ్ లీజులను గనుల శాఖ కొన్ని దశాబ్దాల కిందటే కంపెనీలకు కేటాయించింది. రికార్డుల్లో రెవెన్యూ పోరంబోకు భూమి అని ఉండటంతో గనుల శాఖ లీజులు ఇచ్చింది. అయితే ఆ భూమి తనదని అటవీ శాఖ అభ్యంతరాలు తెలపడంతో మైనింగ్ నిలిచిపోయింది. దీన్ని పరిష్కరించాల్సింది ప్రభుత్వమే. ఆ భూమి రెవెన్యూదా? లేక అటవీ శాఖదా? అన్నది తేల్చి సత్వరమే పరిష్కరించాలి. ఆ పని చేయకపోవడంతో అక్కడున్న విలువైన గ్రావెల్, రోడ్‌మెటల్ లీజులు వృథాగా పడి ఉంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తే అమరావతి రాజధాని నిర్మాణం, కృష్ణా జిల్లా ప్రాజెక్టులకు అవసరమైన గ్రావెల్, రోడ్ మెటల్ అవసరాలను ఈ లీజు తీర్చగలదని గనుల శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం రెవెన్యూ శాఖను ఆదేశిస్తే ఈ సమస్య వారంలో సెటిల్ అవుతుందని గనుల శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే సహజ వనరులున్న ఇలాంటి వివాదాస్పద భూములు 20కి పైగా ఉన్నాయి.