Collector Dinesh Kumar: పీ4లో మార్గదర్శిగా అల్లూరి కలెక్టర్
ABN , Publish Date - Jul 29 , 2025 | 05:24 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పీ4(మార్గదర్శి-బంగారు కుటుంబం) కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా..
బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకున్న దినేశ్‌కుమార్
గిరిజన బాలికను డాక్టర్ చేసేందుకు తోడ్పాటు
ఆమె తండ్రికి వైద్యం.. వ్యాపార నిమిత్తం రుణం కూడా..
అదే బాటలో జేసీ అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్ శౌర్యమన్‌పటేల్
పాడేరు, జూలై 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పీ4(మార్గదర్శి-బంగారు కుటుంబం) కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్ మార్గదర్శిగా మారారు. ఒక బంగారు(పేద) కుటుంబాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పాడేరు మండలం ఐనాడ పంచాయతీ కేంద్రానికి చెందిన గిరిజనుడు వంతినిభ సాంబశివ, ఆయన కుమార్తె మానసలను తాను దత్తత తీసుకున్నట్టు దినేశ్‌కుమార్ తెలిపారు. మానస ఇంటర్‌లో చక్కని ప్రతిభ కనబరిచినప్పటికీ నీట్‌లో ఆశించిన ర్యాంకు రాకపోవడంతో చదువుకు స్వస్తి పలికారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆ బాలిక ఉన్నత చదువుకు తన వంతు సహకారం అందించడంతోపాటు ఆమె డాక్టర్ అయ్యేందుకు కృషిచేస్తానని ప్రకటించారు. ఆమె తండ్రి సాంబశివకు ఆరోగ్య, ఇతర సమస్యలు ఉన్నాయని, ఆయన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకునేందుకు రుణం మంజూరు చేయిస్తానన్నారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్ శౌర్యమన్‌పటేల్ కూడా అదే బాటలో బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు. పాడేరు మండలం గుత్తులపుట్టులోని ఓ కుటుంబాన్ని తాను దత్తత తీసుకుంటున్నట్టు అభిషేక్‌గౌడ ప్రకటించగా, తన కార్యాలయంలో స్వీపర్‌గా పనిచేస్తున్న ఫాతిమా కుటుంబాన్ని దత్తత తీసుకునేందుకు శౌర్యమన్‌పటేల్ ముందుకువచ్చారు.
ఇవి కూడా చదవండి..
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్
పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్
For More National News and Telugu News..