Share News

Alcohol Price Hike : మద్యం ధరలు పెంపు

ABN , Publish Date - Feb 11 , 2025 | 04:18 AM

క్వార్టర్‌ రూ.99 బ్రాండ్లు మినహా అన్ని రకాల లిక్కర్‌ బ్రాండ్లకూ సీసాపై రూ.10 పెరిగింది. ఈమేరకు అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌(ఏఆర్‌ఈటీ)ను సవరిస్తూ ఎక్సైజ్‌ శాఖ...

Alcohol Price Hike : మద్యం ధరలు పెంపు
Liqour Price Hike

  • ఒక్కో బాటిల్‌పై రూ.10

  • ‘క్వార్టర్‌ 99’, బీరు ధరల్లో మార్పు లేదు

  • లైసెన్సీలకు 14 శాతం మార్జిన్‌

  • దాని కోసమే వినియోగదారులపై భారం

  • ఎక్సైజ్‌ అధికారుల పొరపాట్లతో మార్పులు

  • ఏఆర్‌ఈటీని సవరిస్తూ ఉత్తర్వులు జారీ

అమరావతి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. క్వార్టర్‌ రూ.99 బ్రాండ్లు మినహా అన్ని రకాల లిక్కర్‌ బ్రాండ్లకూ సీసాపై రూ.10 పెరిగింది. ఈమేరకు అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌(ఏఆర్‌ఈటీ)ను సవరిస్తూ ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే బీరు ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. మార్జిన్‌ తక్కువ వస్తోందని లైసెన్సీలు గగ్గోలు పెట్టడంతో వారికిచ్చే మార్జిన్‌ పెంపునకు ఇటీవల కేబినెట్‌లో ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అందుకు అనుగుణంగా ఎక్సైజ్‌ శాఖ పన్నుల్లో మార్పులు తీసుకొచ్చింది. లైసెన్సీలకు ఇష్యూ ప్రైస్‌పై మార్జిన్‌ ఇస్తారు. కానీ ఇప్పటివరకూ ఏఆర్‌ఈటీ ఇష్యూ ప్రైస్‌లో లేదు. దీంతో లైసెన్సీలకు అనుకున్నంత మార్జిన్‌ రావట్లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఏఆర్‌ఈటీని రెండు రకాలుగా వర్గీకరిస్తూ తాజా సవరణలు చేశారు. ఏఆర్‌ఈటీ1, ఏఆర్‌ఈటీ2 అని రెండు కాంపోనెంట్‌లు సృష్టించి, ఏఆర్‌ఈటీ1ను ఇష్యూప్రైస్‌ కిందకు తీసుకొచ్చారు. దీంతో ఏఆర్‌ఈటీ1 పన్నులోనూ లైసెన్సీలకు మార్జిన్‌ లభిస్తుంది. కాగా క్వార్టర్‌ రూ.99 లిక్కర్‌ ధరను పెంచలేదు. అవి మినహా అన్ని రకాల లిక్కర్‌ బ్రాండ్లపై లైసెన్సీలకు ఏఆర్‌ఈటీ1లో మార్జిన్‌ లభిస్తుంది. దీని ఫలితంగా ఆ బ్రాండ్ల బాటిళ్లపై రూ.10 పెరిగింది. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇప్పటికే ఉత్పత్తిచేసి గోడౌన్లలో ఉన్న, రవాణాలో ఉన్న మద్యానికి కూడా ఈ పెంపు వర్తిస్తుందని, ఆమేరకు లైసెన్సీలు అదనంగా చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. బార్లు, ఇన్‌హౌస్‌ మద్యం అమ్మకపు కేంద్రాలకు ఏఆర్‌ఈటీ 15శాతం అదనంగా ఉంటుంది.


అధికారుల పొరపాట్లతో తలనొప్పి

ఎక్సైజ్‌ అధికారులు చేసిన పొరపాట్ల వల్ల ఇప్పుడు ధరల పెంచాల్సి వచ్చింది. అక్టోబరులో పాలసీని తీసుకొచ్చిన సమయంలో పన్నులు సవరించారు. కొత్త పాలసీని తీసుకొచ్చే సమయంలో అధికారులు అంచనాల రూపకల్పనలో విఫలయ్యారు. లైసెన్సీలకు 20శాతం మార్జిన్‌ ఇస్తామని పాలసీలో పేర్కొన్నా, వాస్తవంగా 10శాతమే వచ్చేలా పాలసీని తయారు చేశారు. దీనిని గుర్తించని ప్రభుత్వం పాలసీని అమల్లోకి తెచ్చేందుకు అనుమతి ఇచ్చింది. పాలసీ అమల్లోకి వచ్చాక అంచనాల్లో పొరపాట్లు బయటపడ్డాయి. వ్యాపారం తమవల్ల కాదంటూ లైసెన్సీలు గగ్గోలు పెట్టారు. ఈ వ్యవహారం సీఎం వరకూ వెళ్లడంతో పొరపాటును గుర్తించిన ఆయన మార్జిన్‌ పెంచుతామని లైసెన్సీలకు హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. మార్జిన్‌ సవరణ కోసం వినియోగదారులపై స్వల్పంగా అదనపు భారం వేయాల్సి వచ్చింది.


Also Read: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ.. ఎందుకంటే..?

Updated Date - Feb 11 , 2025 | 10:18 AM