Agros: ఆగ్రోస్ లొసుగులు ఎవరివి
ABN , Publish Date - Jun 28 , 2025 | 04:29 AM
వాటర్ షెడ్ పథకం కింద రైతులకు అందించాల్సిన వ్యవసాయ పరికరాల టెండర్ల వివాదంలో తమ తప్పేమీ లేదని పంచాయతీరాజ్, ఆగ్రోస్ వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ ఒకరిపై ఒకరు చెప్పుకొంటున్నారు.
తమ తప్పులేవీ లేవంటూ ఆగ్రోస్, పంచాయతీరాజ్ ప్రకటన
రైతులకు స్వేచ్ఛ ఇవ్వాలి: నిపుణులు
జూలై 2 నుంచి టెండర్లు ప్రారంభం
అమరావతి, జూన్ 27(ఆంధ్రజ్యోతి): వాటర్ షెడ్ పథకం కింద రైతులకు అందించాల్సిన వ్యవసాయ పరికరాల టెండర్ల వివాదంలో తమ తప్పేమీ లేదని పంచాయతీరాజ్, ఆగ్రోస్ (వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్) ఒకరిపై ఒకరు చెప్పుకొంటున్నారు. దీంతో అసలు ఈ అవకతవకల వెనుక ఉన్నదెవరు? రాజకీయశక్తులేమైనా ఉన్నాయా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గత ఏడాది వైసీపీ హయాంలో ఎల్1 విధానంలో టెండర్లు నిర్వహిస్తే అది పూర్తిగా విఫలమైంది. పరికరాలకు సంబంధించి రైతుల నుంచి డబ్బులు తీసుకోవడానికి కూడా ఆ కంపెనీలు సాహసించడం లేదు. దీనిని బట్టి ఆ విధానం ఎంత వైఫల్యమైందో అర్థమవుతుంది. ఈ పథకాన్ని ఏపీ పొరుగురాష్ట్రాలతో పాటు, మిగతా రాష్ట్రాలన్నీ ఎంప్యానెల్‌మెంట్ విధానంలోనే నిర్వహిస్తున్నాయి. కర్ణాటకలో వచ్చే వారం ఎంప్యానెల్‌మెంట్ విధానంలో టెండర్లు పిలవబోతున్నారు. మరి రాష్ట్రంలోనే ఎల్1 టెండర్లకు ఎందుకు వెళ్తున్నారు? అన్న ప్రశ్నకు పంచాయతీరాజ్ శాఖ, ఆగ్రోస్ రెండూ రెండు వేర్వేరు సమాధానాలు చెప్పాయి.
ఆయన చెప్తేనే చేశాం
ఏప్రిల్‌లో పిలిచిన ఎంప్యానెల్‌మెంట్ టెండర్లను పంచాయతీరాజ్ కమిషనర్ నిలిపివేయమంటేనే నిలిపేశామని ఆగ్రోస్ జీఎం రాజమోహన్ తెలిపారు. కమిషనర్ చెబితేనే ఎల్1 టెండర్లకు వెళ్లామన్నారు. ఈ నిర్ణయానికి కారణమేంటో కమిషనర్ తమకు చెప్పలేదని, ఎక్కువ కంపెనీలు ఉంటే రైతులు గందరగోళపడతారనేది కారణం కావచ్చని పేర్కొన్నారు. కంపెనీలు ఎక్కువ ఉండడం వల్ల గందరగోళానికి గురవుతున్నట్టు రైతుల నుంచి తమకు ఫిర్యాదులేమీ అందలేదన్నారు. ఈ పరికరాల ధరల్లో రైతులు 10 నుంచి 20 శాతం ధరలు చెల్లిస్తారని తెలిపారు. రైతులకు కూడా ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలని, ప్రీబిడ్ సమావేశంలో పాల్గొన్న కంపెనీలు కూడా ఎంప్యానెల్‌మెంట్ కోరాయని చెప్పారు. తాము మరోసారి పంచాయతీరాజ్ కమిషనర్‌కి లేఖ రాశామని, ఆయన రెండోసారి కూడా ఎల్1 విధానంలోనే వెళ్లమన్నారని తెలిపారు. ఎల్1 విధానంలో పిలిచిన టెండర్ల నిబంధనలు తామే రూపొందించామన్నారు.
ధరల్లో భారీ వ్యత్యాసం
ఏప్రిల్‌లో టెండర్లు పిలవడం ద్వారా ఎంప్యానెల్ అయి న కంపెనీలకు నిర్ణయించిన ధరల్లో భారీ వ్యత్యాసం ఉండడం వల్లే ఏపీ ఫైనాన్స్ రూల్స్ పాటించమని ఆగ్రోస్ కి చెప్పినట్టు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ తెలిపారు. ఎంప్యానెల్‌మెంట్ రద్దు చేయమని గానీ.. ఎల్1 టెండర్లకు వెళ్లమని గానీ చెప్పలేదన్నారు. ఎంప్యానెల్‌మెంట్ అయిన కంపెనీల ధరల్లో వ్యత్యాసం 30ు వరకు ఉందన్నారు. దీని వల్ల రైతులకు నష్టం జరుగుతుందని, ధరల్లో వ్యత్యాసం ఉండకూడదని భావించామని తెలిపారు.
విఫలమైన ఎల్1 విధానం
వైసీపీ హయాంలో వాటర్‌షెడ్ పథకం కింద రైతులకు పైపుల సరఫరా కోసం 4 కంపెనీలను ఎంపిక చేసి అన్నింటికీ ఎల్1 ఇచ్చారు. దీంతో పరికరాల్లో నాణ్యత లేకుండా పోయింది. పైగా, సమయానికి సరఫరా చేయలేదు. మరమ్మతుల కోసం ఫిర్యాదులు రావడంతో కంపెనీలు ముందుకు రాలేదు.
కంపెనీల ఎంపిక పూర్తి కాలేదు
‘లిక్కర్ బాసులకే ఆగ్రోస్ టెండర్లు’ శీర్షికన శుక్రవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై వ్యవసాయ శాఖ కమిషనర్, ఆగ్రోస్ వీసీ, ఎండీ డిల్లీరావు స్పందించారు. సరఫరాదారుల ఎంపిక పూర్తికాకముందే కొన్ని సరఫరాదారుల పేర్లను కథనంలో ప్రచురించడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ముందు ఎంప్యానెల్‌మెంట్ ప్రక్రియలో టెండర్లు పిలిచినప్పటికీ తర్వాత రైతులకు మేలు చేయడం కోసం ఎల్1 విధానంలో టెండర్లు పిలిచినట్టు చెప్పారు. సీవీసీ మార్గదర్శకాలు, జీఎ్‌ఫఆర్ నియమాలు, ఈ-ప్రొక్యూర్‌మెంట్ నిబంధనల ప్రకారం పారదర్శకంగా టెండర్లు పిలిచామని తెలిపారు. తాము ఏ సంస్థకూ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వలేదని, సీనియర్ అధికారి చక్రం తిప్పుతున్నారంటూ వచ్చిన కథనం నిరాధారమని పేర్కొన్నారు.
రైతులకు స్వేచ్ఛ
ఎంప్యానెల్‌మెంట్ విధానంలో నచ్చిన కంపెనీని ఎంచుకునే అవకాశం రైతులకు ఉంటుంది. వారు ధర, నాణ్యత చూసి నచ్చిన కంపెనీని ఎంచుకుంటే ఆ కంపెనీ పరికరాలే రైతులకు సరఫరా అవుతాయి. రైతులకు కూడా దీనిలో 10 నుంచి 20 శాతం వాటా ఉంటుంది. కాబట్టి వారికి కూడా ఎంచుకునే అవకాశం కల్పించాలి. అలా కాకుండా ఎల్1 టెండర్లకు వెళ్లడమంటే కంపెనీల ఎంపికలో రైతులకు ఉన్న అవకాశాన్ని తొలగించినట్టే అవుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.