Crop Loan: ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. రూ.లక్ష వరకు రుణాలు
ABN , Publish Date - Dec 15 , 2025 | 02:39 PM
ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు రూ. లక్ష వరకూ రుణం మంజూరు చేయబోతోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలైంది. రైతు కౌలు పత్రంలో చూపించిన సాగు భూమి ఎకరాకు తగ్గకుండా ఉండాలి.
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 15: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. సాగు పెట్టుబడి కోసం రూ. లక్ష వరకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. పీఏసీఎస్‌ల ద్వారా ఈ రుణాలు మంజూరు చేయనున్నారు. కౌలు రైతులను మరింత ప్రోత్సహించే ప్రణాళికలో భాగంగా అర్హులైన కౌలు రైతులకు రూ.లక్ష వరకు రుణాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ఆయా ప్రాంతాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల నుంచి రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అధికారులు రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతుల వివరాలు సేకరించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ వివరాల సేకరణ పూర్తయిన వెంటనే అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసే అవకాశం ఉంది.
ఈ రుణాలు విత్తనాలు, ఎరువులు, కూలీ ఖర్చుల వంటి ముఖ్యమైన వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.ఈ రుణ ప్రయోజనం పొందేందుకు లబ్ధిదారులు సంబంధిత అధికారుల నుంచి జారీ చేయబడిన కౌలు పత్రాలు కలిగి ఉండాలి.
సదరు కౌలు రైతులు సహకార సంఘం పరిధిలో నివాసం ఉంటూ ఆ సంఘంలో సభ్యత్వం కలిగి ఉండాలి. ఈ రుణానికి దరఖాస్తు చేసే రైతు కౌలు పత్రంలో చూపించిన సాగు భూమి ఎకరాకు తగ్గకుండా ఉండాలి. అసైన్డ్ భూములు సాగు చేస్తున్న కౌలు పత్రాలు ఉన్నవారు మాత్రం ఈ రుణాలకు అర్హులు కాదు.
సొంత ఇల్లు ఉన్నవారికి లోన్ మంజూరు చేయడంలో అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏరోజైతే లోన్ తీసుకుంటున్నారో అప్పటి నుంచి ఏడాదిలోపు అసలుతోపాటు వడ్డీని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని పెట్టుబడి లేదా వ్యాపార సలహా కాదని పాఠకులు గమనించాలి. మీరు చేసే వ్యాపారాలు లేదా పెట్టుబడుల వల్ల కలిగే లాభనష్టాలకు, సమాచారానికి ఆంధ్రజ్యోతి ఎలాంటి బాధ్యత వహించదు. మీ వ్యాపార, పెట్టుబడి లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు, మీ సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదిస్తే మంచింది.
ఇవీ చదవండి:
అంటార్కిటికాలో జాబ్.. రూ.1.3 కోట్ల జీతం.. వెళ్లాలా? వద్దా? యువకుడి డైలమా!
జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..