AP Police: పోసానిపై వరుసగా పీటీ వారెంట్లు
ABN , Publish Date - Mar 04 , 2025 | 03:43 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లపై జుగుప్సాకర విమర్శలు చేసిన సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై విచారణ పరంపర కొనసాగుతోంది.
రాజంపేట నుంచి తొలుత నరసరావుపేటకు
తమకూ అనుమతివ్వాలంటూ అనంతపురం, అల్లూరి పోలీసుల పిటిషన్లు
మరికొన్ని జిల్లాల పోలీసులూ క్యూలో
నరసరావుపేట కోర్టులో హాజరు
ఈనెల 13 వరకు రిమాండ్
గుంటూరు జిల్లా జైలుకు తరలింపు
గుండెనొప్పి అంటూ రాజంపేటలో మళ్లీ హడావిడి
నరసరావుపేట లీగల్/రాజంపేట/అనంతపురం క్రైం/అమరావతి, మార్చి 3, (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లపై జుగుప్సాకర విమర్శలు చేసిన సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై విచారణ పరంపర కొనసాగుతోంది. పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టులో ఆయన్ని హాజరుపరిచేందుకు అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్‌జైలు నుంచి పీటీ వారెంట్‌పై సోమవారం తరలించారు. నరసరావుపేట టూటౌన్ పరిధిలో నమోదైన కేసులో ఆయనను నరసరావుపేట మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో రాత్రి 7.15 సమయంలో హాజరు పరిచారు. ఈ సందర్భంగా జరిగిన విచారణలో ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ లక్ష్మీ రామ్ నాయక్, పోసాని తరఫున న్యాయవాది రోళ్ల మాధవి వాదనలను వినిపించారు. నిందితుడిపై మోపిన నేరాలకు ఏడు సంవత్సరాలు లోపే జైలు శిక్ష ఉందని రోళ్ల మాధవి వాదించారు. 41 ఏ నోటీసులు జారీ చేయలేదన్నారు. పీటీ వారెంట్‌పై ప్రవేశపెట్టే సమయంలో ఆ నోటీసు ఎలా ఇస్తారని న్యాయాధికారి ప్రశ్నించారు. నిందితునికి 60 ఏళ్లు దాటాయని, అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, వాటిని పరిగణనలోకి తీసుకొని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయవలసిందిగా న్యాయవాది మాధవి అభ్యర్థించారు. పోలీసులు తరఫున ఏపీపీ లక్ష్మీ రామ్ నాయక్ వాదనలు వినిపిస్తూ.. పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 15 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వారం రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా తాను రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నానని, గొంతుకు ఆపరేషన్ చేయించుకున్నానని పోసాని చెప్పారు.
అయితే వాటికి సంబంధించి ధ్రువీకరణ పత్రాలు ఏమీ లేకపోవడంతో తక్షణ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని న్యాయాధికారి ప్రశ్నించారు. అటువంటిదేమీ లేదని పోసాని బదులులిచ్చారు. దీంతో పోసానికి ఈ నెల 13 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి రెడ్డి ఆశీర్వాదం పాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు పోసానిని రాత్రి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. కాగా, పోసానిని తరలించేందుకు నరసరావుపేట సీఐ హైమారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం సోమవారం ఉదయం రాజంపేట సబ్‌జైలుకు చేరుకున్న సమయంలో ఆయన మళ్లీ డ్రామాలు మొదలుపెట్టారు. తనకు గుండెనొప్పి వస్తోందని చెప్పడంతో వెంటనే రాజంపేటలో డాక్టర్ వికాస్ ఆధ్వర్యంలో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనకు గుండెకు సంబంధించిన ఎటువంటి సమస్యలు లేవని గుర్తించిన తర్వాత ప్రత్యేక వాహనంలో నరసరావుపేటకు తరలించారు. నరసరావుపేటలో టీడీపీ ప్రధాన కార్యదర్శి కొట్టా కిరణ్ కుమార్ 2024 నవంబరు 14న రెండో పట్టణ పోలీస్ ేస్టషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఐసీపీ 153ఏ, 504, 67ఐటీఏ-2000-2008 కింద పోసానిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో న్యాయాధికారి ఎదుట పోసానిని హాజరు పరిచారు. సినీ నటుడు, వైసీపీ నాయకుడు పోసాని చుట్టూ వారెంట్ల ఉచ్చు బిగుస్తోంది. పోసానిని అదుపులోకి తీసుకోవడానికి పలు జిల్లాల పోలీసులు క్యూ కడుతున్నారు. అనంతపురం రూరల్ పోలీసులు కూడా సోమవారం పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఆయన్ని అదుపులోకి తీసుకునేందుకు అల్లూరి జిల్లా పోలీసులు కూడా పీటీ వారెంట్ కోసం కోర్టు అనుమతి కోరారు.
పోలీస్ స్టేషన్ల చుట్టూ పోసాని
పోసాని చుట్టూ వారెంట్ల ఉచ్చు బిగుస్తోంది. ఇటీవలే అన్నమయ్య జిల్లా ఓబుళవారి పల్లె పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసి రాజంపేట కోర్టులో ప్రవేశ పెట్టారు. న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల్లో రాజమహేంద్రవరంలో ఒక్కటి మాత్రమే క్లోజ్ అయింది. మరో పదమూడు కేసులకు గానూ బాపట్ల టౌన్, ఆదోని త్రీ టౌన్, నర్సీపట్నం టౌన్ పోలీసు స్టేషన్లలోని మూడు విచారణ దశలో ఉండగా మరో పది దర్యాప్తు దశలో ఉన్నాయి. ఒక కేసులో బెయిల్ పిటిషన్ వేయగానే మరో స్టేషన్ నుంచి పీటీ వారెంట్‌తో పోలీసులు సిద్ధం అవుతున్నారు.