Share News

Flowers: ప్రపంచంలో మరెక్కడా దొరకని పూలు ఆ మార్కెట్‌లో...

ABN , Publish Date - Nov 09 , 2025 | 10:00 AM

సాయంకాలం కాగానే పూల ట్రక్కులు మార్కెట్‌కు క్యూ కడతాయి. రాత్రి పదికల్లా మార్కెట్‌లోని గిడ్డంగులన్నీ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన పూలతో నిండిపోతాయి. పూలు పాడవ్వకుండా రాత్రంతా చల్లటి గిడ్డంగులలో ఉంచుతారు.

Flowers: ప్రపంచంలో మరెక్కడా దొరకని పూలు ఆ మార్కెట్‌లో...

- లక్షల పూలు... రోజూ వేలం...

ప్రతిరోజూ ప్రపంచం నలుమూలల నుంచి ఆ మార్కెట్‌ను పూలు ముంచెత్తుతాయి. ప్రపంచంలో మరెక్కడా దొరకని పూలు ఆ మార్కెట్‌లో వేలంలోకి వస్తాయి. అక్కడ జరిగే వేలం పాటలో పూలను దక్కించుకోవడానికి వ్యాపారులు పోటీపడతారు. అమ్‌స్టర్‌డ్యామ్‌కు దగ్గరలో ఉన్న ఆల్స్‌మీర్‌... పూల వేలంలో ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్‌గా గుర్తింపు ఉంది.

సాయంకాలం కాగానే పూల ట్రక్కులు మార్కెట్‌కు క్యూ కడతాయి. రాత్రి పదికల్లా మార్కెట్‌లోని గిడ్డంగులన్నీ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన పూలతో నిండిపోతాయి. పూలు పాడవ్వకుండా రాత్రంతా చల్లటి గిడ్డంగులలో ఉంచుతారు. ఉదయం వేలం పాట ప్రారంభంతోనే పూలను వరుసగా ట్రాలీలలో షెడ్డుల్లోకి తరలిస్తారు. నెదర్లాండ్స్‌లోని అమ్‌స్టర్‌డ్యామ్‌కు సమీపంలో ఉన్న ‘ఆల్స్‌మీర్‌ ఫ్లవర్‌ ఆక్షన్‌’ మార్కెట్‌లో రోజూ కనిపించే దృశ్యం ఇది. ఈ మార్కెట్లో పూలను స్టోర్‌ చేసేందుకు 243 ఎకరాల్లో వేర్‌హౌజ్‌ను నిర్మించారు. దీనికి ప్రపంచంలోనే అతిపెద్ద వేర్‌హౌజ్‌ భవనంగా గుర్తింపు ఉంది. ప్రతిరోజూ ఈ మార్కెట్‌కి 2 కోట్ల పూలు వస్తాయని అంచనా. ప్రపంచంలోనే అతి పెద్ద పూల మార్కెట్‌ ఇది. అత్యంత రద్దీగా ఉండే మార్కెట్‌గానూ దీనికి పేరుంది.


book6.2.jpg

వంద సెకన్లలో వేలం

ఆల్స్‌మీర్‌ మార్కెట్‌ 1910లో ప్రారంభమయింది. ఈ మార్కెట్‌కి ఈక్వెడార్‌, కొలంబియా, ఇథియోపియా, కెన్యా వంటి దేశాల నుంచి ఎక్కువగా పూలు వస్తుంటాయి. అయితే నెదర్లాండ్స్‌ నుంచి వచ్చే పూలే ఎక్కువగా మార్కెట్లో అమ్ముడుపోతూ ఉంటాయి. వేలం ప్రక్రియ ప్రారంభమయ్యే ముందు పూలను ట్రాలీలలో షెడ్డుల్లోకి తీసుకొస్తారు. వ్యాపారులు వాక్‌వేలో నుంచి పూలను చూసి వేలం పాటలో పాల్గొనవచ్చు. వేలం పాటకు 100 సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. గడియారం ముల్లు 100 నుంచి ప్రారంభమై వెనక్కి వస్తుంది.


book6.3.jpg

జీరో రాగానే వేలం ప్రక్రియ పూర్తవుతుంది. వేలం ప్రక్రియ వేగంగా పూర్తి కావడం కోసం 17వ శతాబ్దంలో ప్రారంభించిన ఈ వేలం ప్రక్రియ విధానాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. వేలంలో అమ్ముడుపోయిన పూలను వెంటనే డిస్ట్రిబ్యూట్‌ చేస్తుంటారు. సాయంత్రం 4 నుంచి 6 కల్లా పూలు మొత్తం మార్కెట్‌ నుంచి డిస్ట్రిబ్యూట్‌ అయిపోతాయి. బిడ్డింగ్‌ విధానాన్ని ఆక్షన్‌ రూమ్‌లో కూర్చుని పెద్ద పెద్ద తెరలపై చూడొచ్చు. జర్మనీ, యూకే, ఫ్రాన్స్‌, ఇటలీ, బెల్జియం వంటి దేశాలకు పూలు ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. గులాబీలు, తులిప్స్‌, చామంతి వంటి వాటికి డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది.


30 వేల రకాల పూలు, మొక్కలను వేలంలో అందుబాటులో ఉంచుతారు. ఏటా 1200 నుంచి 1500 కొత్త రకాల పూల జాతి మొక్కలు మార్కెట్‌ క్యాటలాగ్‌లో చేరుతున్నాయి. ఇక మార్కెట్‌లో 44 దేశాలకు చెందిన 2600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే పూల వ్యాపారంలో 60 శాతం డచ్‌ ఆక్షన్‌ ద్వారానే జరుగుతూ ఉంటుంది. ఈ మార్కెట్‌లో ఫైర్‌ఇంజన్ల నుంచి సైకిల్‌ రిపేర్‌ వరకు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఎక్కువ మంది ఉద్యోగులు సైకిళ్లు ఉపయోగిస్తుంటారు. అత్యంత రద్దీగా ఉండే ఈ మార్కెట్‌ను పర్యాటకులు సైతం సందర్శిస్తుంటారు.

Updated Date - Nov 09 , 2025 | 10:00 AM