Bandaru Taj Mahal: లవ్‌స్టోరీ 1800
ABN , Publish Date - Jul 20 , 2025 | 01:56 AM
ఆ రోజుల్లో.. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియురాలు ముంతాజ్ కోసం ఆగ్రాలో తాజ్‌మహల్ నిర్మించారు
నేటికీ సాక్షిగా ‘బందరు తాజ్‌మహల్’..
ఓ ఆంగ్లేయ జంట ప్రేమకు చిహ్నం
పీటర్, అరబెల్లా అపురూప ప్రేమగాథ..
పెళ్లి దాకా చేరకుండానే విషాదాంతం
ప్రియురాలికి గుర్తుగా బందరు మహల్
ఇప్పటికీ గాజు పెట్టెలో పదిలంగా అరబెల్లా భౌతికకాయం
ఆ రోజుల్లో.. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియురాలు ముంతాజ్ కోసం ఆగ్రాలో తాజ్‌మహల్ నిర్మించారు. ఇది చాలామందికి తెలిసిన విషయమే. అంత అద్భుతమైన కట్టడం కాకపోయినా ఆంధ్రప్ర దేశ్‌లోనూ ఇలాంటి మహల్ ఒకటి ఉంది. రెండు శతాబ్దాల క్రితం బ్రిటిష్ పాలనలో మేజర్ జనరల్ పీటర్ తన ప్రియురాలు అరబెల్లా కోసం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఒక సుందరమైన మహల్‌ను నిర్మించారు. పీటర్ తమ ప్రేమకు చిహ్నంగా నిర్మించిన ఈ మహల్ ఇప్పుడు ‘బందరు తాజ్‌మహల్’గా భాసిల్లుతోంది. ఆంగ్లేయుల హయాంలో మాసులీపట్నంగా పిలిచే నేటి బందరులో ఈ ఆంగ్లేయ జంట విషాద ప్రేమగాథకు సాక్షిగా ఈ మహల్ నిలిచింది. అరబెల్లా భౌతికకాయం రసాయనాలతో నిక్షిప్తమై ఒక గాజు పెట్టెలో ఇప్పటికీ భూగర్భంలో ఉంది. పీటర్, అరబెల్లా ఇద్దరూ ఆంగ్లేయులే అయినా వీరి ప్రేమ పెళ్లి దాకా వెళ్లలేదు. పెళ్లి చేసుకోవటానికి వీరు చేసిన పోరాటం ఫలించలేదు. చివరకు ఇద్దరూ సహజీవనం చేసినా ఎక్కువ కాలం సాగలేదు. ఆ రోజులలో పెద్దలతో పాటు మతాధిపతులు, ఆంగ్లేయులు కూడా దీన్ని సహించలేదు. తమ ప్రేమ పెళ్లిగా సాకారం కానందుకు ఇద్దరూ ఎంతో మనోవేదన చెందారు. మనోవ్యథతో అనారోగ్యంపాలై అరబెల్లా.. ప్రియురాలి మరణంతో కోలుకోలేకపోయిన పీటర్ కూడా అనారోగ్యంతో మరణించారు. ఇలా ఈ ఆంగ్లేయ జంట ప్రేమ విషాదంగా ముగిసింది.
అరబెల్లా ప్రేమలో పీటర్..
1800ల్లో మచిలీపట్నం (అప్పట్లో మాసులీపట్నం)లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో బందరుకోట కెప్టెన్ రాబిన్‌సన్ ఆధిపత్యంలో ఉండేది. రాబిన్‌సన్ కుమార్తె అరబెల్లా అందగత్తె. కెప్టెన్ రాబిన్‌సన్ దగ్గర మేజర్ జనరల్‌గా పీటర్ పనిచేసేవారు. సౌందర్యవతి అయిన అరబెల్లాను చూసి ముగ్ధ్దుడైన పీటర్ ఆమెను ప్రేమించారు. తన ప్రేమ ప్రతిపాదనను ఆమెకు పంపారు. అప్పటికే బ్రిటిష్ సైన్యంలో మేజర్ జనరల్ పీటర్ శక్తిసామర్థ్యాల గురించి తెలుసుకున్న అరబెల్లా అతడి ప్రేమ సందేశాన్ని కాదన లేదు. అరబెల్లాను వివాహం చేసుకుందామని పీటర్ ప్రయత్నించారు. కానీ అరబెల్లా తండ్రి కెప్టెన్ రాబిన్‌సన్ ఇందుకు అంగీకరించలేదు. మతాధిపతులు కూడా ఈ వివాహానికి అడ్డుతగిలారు.
నెరవేరని అరబెల్లా కోరిక..
అరబెల్లాను వివాహం చేసుకోవాలన్న పీటర్ ఆశ నెరవేరకపోవడంతో ఆమెను తన ఇంటికి ఆహ్వానించారు. ఇద్దరూ భార్యాభర్తలుగా మెలిగారు. సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోకపోవడంతో వీరి ప్రేమను, సహజీవనాన్ని అక్కడివారు ఆమోదించలేదు. పెద్దల సమక్షంలో పీటర్‌ను వివాహం చేసుకోవాలని ఉందని అరబెల్లా ఎన్నోసార్లు తన తల్లిదండ్రులను కోరారు. ఇందుకు వారు అంగీకరించలేదు. కోరుకున్నవిధంగా అందరి సమక్షంలో వివాహం జరగకపోవడం, ప్రియుడు, తండ్రి మధ్య వివాదం ఏర్పడటంతో అరబెల్లా మానసికంగా కుంగిపోయారు. చివరకు అనారోగ్యంతో 1809 నవంబరు 6న తన ప్రేమికుడు పీటర్ చేతిలో ఆమె కన్నుమూశారు.
అరబెల్లా మరణించినా...
బందరుకోట దగ్గర సెయింట్ జాన్స్ స్మశానంలో అరబెల్లా భౌతిక కాయాన్ని సమాధి చేసేందుకు మతపెద్దలు అంగీకరించలేదు. దీంతో అప్పటికప్పుడు పీటర్ ఆనందపేటలో రూ.18 వేలతో 15 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అరబెల్లా భౌతికకాయం పాడవకుండా ఉండటానికి ఈజిప్ట్ దేశం నుంచి కొన్ని రసాయనాలు, సుగంధ ద్రవ్యాలను తెప్పించారు. ఒక గాజు పెట్టెలో రసాయనాలు, సుగంధ ద్రవ్యాలను పోసి అందులో ఆమె భౌతికకాయాన్ని ఉంచారు. అరబెల్లా సమాధి ఉండే ప్రాంగణాన్ని ఒక అద్భుతమైన సుందర భవనంగా తీర్చిదిద్దారు. 1998లో అరబెల్లా సమాధిని శాశ్వతంగా మూసివేయించారు.
ఆ బంధం అపు‘రూపం’
రెండు శతాబ్దాల క్రితమే పీటర్ టెక్నాలజీని వాడారు. మహల్‌లో అరబెల్లా శిలాఫలకం పక్కనే ఒక మీటను ఏర్పాటు చేశారు. ఆ మీటను నొక్కగానే అండర్ గ్రౌండ్‌లో అరబెల్లా భౌతికకాయం ఉంచిన గాజు పెట్టె పైకి వచ్చేది. అలా అరబెల్లాను చూస్తూ ఆమెతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ పీటర్ కన్నీరుమున్నీరయ్యేవారు. కొన్నేళ్లకు పీటర్ మద్రాసుకు బదిలీ అయ్యారు. మద్రాసుకు వెళ్లేటపుడు 1819లో తన ప్రేయసి మహల్‌కు సెయింట్ మేరీస్ చర్చిగా పీటర్ పేరు పెట్టారు. మద్రాసుకు వెళ్లాక తీవ్ర అనారోగ్యంతో 1819లో కన్నుమూశారు. అరబెల్లా, పీటర్‌ల ప్రేమగాఽథ చరిత్రగా మిగిలిపోయింది. ఇప్పటికీ బందరు సెయింట్ మేరీస్ చర్చిలో ప్రతి ఆదివారం సాయంత్రం ప్రార్థనలు జరుగుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News and National News