Fire Accident : అక్కాచెల్లెళ్లు సజీవదహనం
ABN , Publish Date - Jan 07 , 2025 | 05:01 AM
అగ్నికీలలకు అక్కాచెల్లెళ్లు సజీవ దహనమైన ఘటన బాపట్ల జిల్లా పర్చూరులో ఆదివారం అర్ధరాత్రి తూర్పువారివీధిలో చోటుచేసుకుంది.

తల్లికి తీవ్రగాయాలు.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం
ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి ఘటన
పర్చూరు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): అగ్నికీలలకు అక్కాచెల్లెళ్లు సజీవ దహనమైన ఘటన బాపట్ల జిల్లా పర్చూరులో ఆదివారం అర్ధరాత్రి తూర్పువారివీధిలో చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగాయి. ఇద్దరు కుమార్తెలు నాగమణి(34), మాధవీలత(30) మంటల్లో చిక్కుకుని మృతిచెందగా, తల్లి లక్ష్మీరాజ్యం తీవ్ర గాయాలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. పర్చూరుకు చెందిన దాసరి వెంకటేశ్వర్లు, లక్ష్మీరాజ్యం దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వెంకటేశ్వర్లు స్థానికంగా లారీ ఆఫీ్‌సలో నైట్ వాచ్‌మన్‌గా ఉంటున్నారు. కుమారుడు లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. కుమార్తె నాగమణి(34) అనారోగ్యంతో మంచంపై ఉంటోంది. రెండో కుమార్తె మాధవీలత(30) ఫిట్స్ వ్యాధితో బాధపడుతోంది. ఆదివారం అర్ధరాత్రి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఇంట్లో నిద్రిస్తున్న తరుణంలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. మొదట నాగమణి మంటల్లో కాలిపోయింది. ఆమె కేకలు విని లేచిన తల్లి వారిని కాపాడే ప్రయత్నం చేసింది. అదేసమయంలో రెండో కుమార్తె మాధవీలతకు మంటలు అంటుకోగా తల్లి ఆర్పే ప్రయత్నం చేసింది. అయితే దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఊపిరి ఆడక మాధవీలత మృతిచెందింది. ఇద్దరు కూతుళ్లను రక్షించే క్రమంలో తల్లికి తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.