Share News

Minister Narayana: మునిసిపాలిటీల్లో ప్రతి ఇంటికీ తాగునీరు

ABN , Publish Date - Jun 29 , 2025 | 05:29 AM

రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో వంద శాతం రక్షిత తాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మధ్యలోనే నిలిచిపోయాయన్నారు.

Minister Narayana: మునిసిపాలిటీల్లో ప్రతి ఇంటికీ తాగునీరు

  • అమృత్‌స్కీం ద్వారా టెండర్లు పిలిచాం: నారాయణ

అమరావతి, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో వంద శాతం రక్షిత తాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మధ్యలోనే నిలిచిపోయాయన్నారు. 2014-19 మధ్య కాలంలో మున్సిపాలిటీ ల్లో అభివృద్ధి పనుల కోసం కేంద్రం నుంచి అనేక నిధులను తీసుకొచ్చామని చెప్పారు. ఏషియన్‌ ఇన్ఫాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంక్‌(ఏఐఐబీ) నుంచి రూ.5800 కోట్లు, స్వచ్ఛ భారత్‌ నుంచి రూ.3000 కోట్ల విడుదలకు ఆమోదం తీసుకున్నామని, అయితే గత ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధు లు విడుదల చేయకపోవడంతో ఆ నిధులు మధ్యలోనే నిలిచిపోయాయన్నారు. ఇప్పటికే అమృత్‌ స్కీం నిధులకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిందని, మంచినీటి పైప్‌లైన్ల కోసం టెండర్లు పిలిచామని చెప్పారు. ఈ పనులు పూర్తయితే 85 శాతం ఇళ్లకు నేరుగా తాగునీరు అందుతుందన్నారు. ఏఐఐబీ నుంచి రూ.5350 కోట్లతో మిగిలిన తాగునీటి పైప్‌లైన్లు, డ్రైనేజీ పైప్‌లైన్లు పూర్తి చేస్తామని తెలిపారు.


ఈ నిధులకు సంబంధించి రాష్ట్ర వాటా ఇచ్చేలా సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. శుద్ధి చేసిన నీటిని డ్రైనేజీలోకి వదిలేలా ఎస్టీపీలను కూడా 2029కి పూర్తి చేస్తామన్నారు. ప్రతి రోజూ రాష్ట్రంలో 8 వేల టన్నుల ఘన వ్యర్థా లు ఉత్పత్తి అవుతున్నాయని, వాటి నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే పది ప్లాంట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ప్రస్తుతం గుంటూరు, విశాఖ లో మాత్రమే రెండు ప్లాంట్‌లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ ప్లాంట్‌లన్నీ అందుబాటులోకి వస్తే ప్రతిరోజూ 7500 టన్నుల చెత్తను విద్యుత్‌గా మారుస్తామని, మరో 500 టన్నుల చెత్తను వివిధ రూపాల్లో నిర్వహిస్తామని చెప్పారు.


గత ప్రభుత్వం వదిలేసి వెళ్లిన 85 లక్షల మెట్రిక్‌ టన్నుల లెగసీ వేస్ట్‌ను వచ్చే అక్టోబరు 2 నాటికి పూర్తిగా తొలగిస్తామన్నారు. మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణ కోసం కాంపాక్టర్లు, స్వీపింగ్‌ మెషిన్ల కొనుగోలుకు రూ.225 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 2014-19 మధ్య కాలం లో 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి పనులు ప్రారంభించగా...గత ప్రభుత్వం వాటిని 2.60 లక్షలకు తగ్గించేసిందన్నారు. మున్సిపాలిటీల్లో ఇంజనీరింగ్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమ్మెపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Updated Date - Jun 29 , 2025 | 05:29 AM