Share News

Uttam: 2026 డిసెంబరు నాటికి పాలమూరు-రంగారెడ్డి పనులు పూర్తి: ఉత్తమ్‌

ABN , Publish Date - Dec 19 , 2024 | 04:28 AM

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ పనులను 2026 డిసెంబరు చివరినాటికి పూర్తి చేయనున్నట్టు సాగు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు.

Uttam: 2026  డిసెంబరు నాటికి పాలమూరు-రంగారెడ్డి పనులు పూర్తి: ఉత్తమ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ పనులను 2026 డిసెంబరు చివరినాటికి పూర్తి చేయనున్నట్టు సాగు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు రూ.32,305 కోట్లు ఖర్చయిందని, మరో రూ.33,201 కోట్ల నిధులు అవసరమన్నారు. శాసనమండలిలో బుధవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్‌ సమాధానమిచ్చారు. 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు మొదటి దశ పంపింగ్‌ యూనిట్‌ను గత ఏడాది సెప్టెంబరు 16న ప్రారంభించినట్టు గుర్తు చేశారు. 18 ప్యాకేజీలుగా ప్రాజెక్టు పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు.


గత ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టునకు ఎలాంటి అనుమతులు పొందకుండానే పనులు ప్రారంభించిందని, రూ.27,500 కోట్ల నిధులు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు సాగునీళ్లు ఇవ్వలేకపోయిందన్నారు. మహాలక్ష్మి పథకం కింద42,90,246 తెల్లరేషన్‌ కార్డులున్న కుటుంబాలకు రూ.500కే సబ్సిడీపై ఎల్పీజీ సిలిండర్లను సరఫరా చేస్తున్నట్టు మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. సబ్సిడీ సిలిండర్ల కోసం 91.5 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసినట్టు చెప్పారు. సబ్సిడీ సిలిండర్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియగా పేర్కొన్నారు.

Updated Date - Dec 19 , 2024 | 04:28 AM