Share News

రిమోట్‌ సెన్సింగ్‌తో సాగుభూమి గుర్తింపు: తుమ్మల

ABN , Publish Date - Dec 29 , 2024 | 04:59 AM

రిమోట్‌ సెన్సింగ్‌ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని పక్కాగా అంచనా వేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. సంక్రాంతి నుంచి ‘రైతు భరోసా’ పథకం ప్రారంభించనున్న నేపథ్యంలో సచివాలయంలో శనివారం మంత్రి కీలక సమావేశం నిర్వహించారు.

రిమోట్‌ సెన్సింగ్‌తో సాగుభూమి గుర్తింపు: తుమ్మల

హైదరాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రిమోట్‌ సెన్సింగ్‌ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని పక్కాగా అంచనా వేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. సంక్రాంతి నుంచి ‘రైతు భరోసా’ పథకం ప్రారంభించనున్న నేపథ్యంలో సచివాలయంలో శనివారం మంత్రి కీలక సమావేశం నిర్వహించారు. రిమోట్‌ సెన్సింగ్‌ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసే పలు కంపెనీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సాగులో ఉన్న భూమికి మాత్రమే పెట్టుబడి సాయం అందించడం తమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. సాగు చేసిన భూములను వ్యవసాయ విస్తీర్ణాధికారులతో ఎప్పటికప్పుడు రైతు వారీగా నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లోని సర్వే నెంబర్ల వారిగా సాగులో ఉన్న భూముల విస్తీర్ణం, సాగుకు అనువుగా లేని విస్తీర్ణంతో పాటు ప్రస్తుతం ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు అయిందనే మొత్తం వివరాలను పొందుపరచనున్నట్లు వివరించారు.


రైతు భరోసా అమలుతో పాటు, పంటల బీమా అమలు, పంటల ఆరోగ్య స్థితి, ఎదుగుదల, చీడపీడలను ఆరంభములోనే గుర్తించడం, వరదలు, తుఫానుల వల్ల జరిగే పంట నష్టాన్ని అంచనా వేయడంలో నూతన సాంకేతికను అందిపుచ్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఆయన తెలిపారు. సమావేశానికి హాజరైన వివిధ కంపెనీల ప్రతినిధులు ఇంతకు ముందు చేపట్టిన ప్రాజెక్ట్‌ వివరాలతోపాటు, నమూనాగా వాళ్లు చేసిన రెండు మండలాలకు సంబంధించి గ్రామాల వారిగా శనివారం వరకు సాగైన పంటల వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. అదేవిధంగా సాగుకు అనువుగా లేని ప్రాంతాలను డిజిటల్‌ మ్యాప్‌లతో చూపించారు. పంటలలో తలెత్తే చీడపీడలను ఆరంభములో గుర్తించే విధంగా ఆయా కంపెనీలు ఏఐ పరిజ్ఞానంతో తయారు చేసిన అంశాలను వివరించారు. సాంకేతిక కమిటీ వీటన్నిటిని పరిశీలించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం మేరకు క్యాబినెట్‌ ఆమోదానికి పంపుతుందని కంపెనీ ప్రతినిధులకు మంత్రి తుమ్మల వెల్లడించారు.

Updated Date - Dec 29 , 2024 | 04:59 AM