Share News

Gandipet: రిజిస్ట్రేషన్ల శాఖలో.. ‘గండిపేట’ రహస్యం

ABN , Publish Date - Dec 22 , 2024 | 03:24 AM

గండిపేట రిజిస్ట్రేషన్ల కార్యాలయంలో సబ్‌-రిజిస్ట్రార్‌ల పరిస్థితి ‘ఆయారాం.. గయారాం’ అన్నట్లుగా తయారైంది. ఇక్కడకు బదిలీపై వస్తున్న సబ్‌-రిజిస్ట్రార్లెవ్వరూ పట్టుమని రెండు నెలలు కూడా పనిచేయడం లేదు.

Gandipet: రిజిస్ట్రేషన్ల శాఖలో.. ‘గండిపేట’ రహస్యం

నాలుగు నెలల్లో.. ముగ్గురు సబ్‌-రిజిస్ట్రార్ల బదిలీ.. ఆన్‌డ్యూటీ పేరుతో స్థానచలనాలు

  • గతంలో డీఐజీ స్థాయిలో ఉత్తర్వులు

  • ఇప్పుడు నేరుగా సర్కారు నుంచే బదిలీలు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): గండిపేట రిజిస్ట్రేషన్ల కార్యాలయంలో సబ్‌-రిజిస్ట్రార్‌ల పరిస్థితి ‘ఆయారాం.. గయారాం’ అన్నట్లుగా తయారైంది. ఇక్కడకు బదిలీపై వస్తున్న సబ్‌-రిజిస్ట్రార్లెవ్వరూ పట్టుమని రెండు నెలలు కూడా పనిచేయడం లేదు. గడిచిన నాలుగు నెలల కాలంలో ఏకంగా ముగ్గురు సబ్‌-రిజిస్ట్రార్లు బదిలీ కావడంతో.. ఇప్పుడు రిజిస్ట్రేషన్ల శాఖలో గండిపేట కార్యాలయం చర్చనీయాంశంగా మారింది.


కారణాలే తెలియదు..!

సాధారణంగా ప్రభుత్వ అధికారుల బదిలీలకు ఒక లెక్క ఉంటుంది. అయితే దీర్ఘకాలం ఒకే చోట పనిచేయకూడదనే నిబంధనలు.. లేదంటే ఏవైనా ఆరోపణలే ప్రధాన కారణాలు. గండిపేట సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయం విషయంలో మాత్రం ఇవేమీ కారణాలుగా కనిపించడం లేదు. నిజానికి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త జోనల్‌ వ్యవస్థ(జీవో 317) ఏడాది కాలంగా ఉల్లంఘనలకు గురవుతోంది. గండిపేట విషయంలో ఈ వ్యవహారం స్పష్టంగా కనిపిస్తోంది. సబ్‌-రిజిస్ట్రార్‌ పోస్టు అనేది జోనల్‌ పరిధిలో ఉంటుంది. అయితే.. గత ఏడాది రాజన్న-సిరిసిల్ల జోన్‌కు చెందిన సబ్‌-రిజిస్ట్రార్‌ను ఏకంగా చార్మినార్‌ జోన్‌లోని గండిపేటకు బదిలీ చేశారు. బదిలీలపై నిషేధం ఉన్నా.. జోన్‌ పరిధిని దాటించి, ఒక గ్రేడ్‌-2 సబ్‌-రిజిస్ట్రార్‌ను బదిలీ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఏకంగా గండిపేటలో సబ్‌-రిజిస్ట్రార్లను ఎందుకు బదిలీ చేస్తున్నారు? కారణాలేమిటి? అనేది తెలియరావడం లేదనే చర్చ రిజిస్ట్రేషన్ల శాఖలో జోరందుకుంది. ఆన్‌డ్యూటీల పేరుతో, సాధారణ బదిలీల పేరుతో యథేచ్ఛగా స్థానచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ఆగస్టు నెలలో సాధారణ బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేయడంతో.. ఇక్కడి సబ్‌-రిజిస్ట్రార్‌ను జహీరాబాద్‌కు.. కుత్బుల్లాపూర్‌ ఎస్‌ఆర్‌ను ఇక్కడికి బదిలీ చేశారు. ఆ తర్వాత బదిలీలపై నిషేధం ఉన్నా.. అక్టోబరు 15న మరోమారు బదిలీ జరిగింది. ఈ సారి ఏకంగా కాళేశ్వరం జోన్‌లోని రామగుండం సబ్‌-రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న వ్యక్తిని.. ఆన్‌డ్యూటీ కింద ఇక్కడ నియమించారు. ఆయన వచ్చి రెండు నెలలు గడవక ముందే.. ఈ నెల 12న మహబూబ్‌నగర్‌లో పనిచేస్తున్న వ్యక్తికి ఇక్కడ పోస్టింగ్‌ ఇస్తూ.. ఏకంగా ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం..! అయితే.. ఉన్నఫళంగా సబ్‌-రిజిస్ట్రార్లను ఎందుకు బదిలీ చేస్తున్నారనే కారణాలు మాత్రం రిజిస్ట్రేషన్ల శాఖలో ‘రహస్యం’గానే ఉన్నాయి.


డీఐజీ ఉత్తర్వులు కాకుండా..

వాస్తవానికి రిజిస్ట్రేషన్ల శాఖలో సబ్‌-రిజిస్ట్రార్‌ స్థాయి అధికారుల బదిలీ లేదా డిప్యూటేషన్‌ లేదా ఆన్‌డ్యూటీ ఉత్తర్వులు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(డీఐజీ) స్థాయిలో విడుదలవుతాయి. కానీ, గండిపేట విషయంలో మాత్రం రెవెన్యూ శాఖ కార్యదర్శి స్థాయిలో ఉత్తర్వులు వస్తుండడంపై రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


ఆదాయంపై ప్రభావం?

గండిపేట సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయం రెవెన్యూ శాఖ ఆదాయంలో కీలకమైనదని రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. ముఖ్యంగా.. ఇక్కడ జీవో-111ను ఎత్తివేశాక భూలావాదేవీలు ఊపందుకున్నాయి. ఐటీ కారిడార్‌కు అత్యంత సమీపంలో ఉండడం.. కేంద్రీయ, రాష్ట్రీయ సంస్థలు, విద్యాలయాలకు నెలవు కావడం, ఇంజనీరింగ్‌ కాలేజీలకు కేరా్‌ఫగా ఉండడంతో ఈ ప్రాంతంలో భూములకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. పట్టణాల్లోనే కాకుండా, గ్రామాల్లోనూ భూముల విలువ రూ.కోట్లలో ఉంటోంది. 111 జీవోను ఎత్తివేశాక ఇక్కడ రియల్‌ఎస్టేట్‌ ఊపందుకోగా.. సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయం మాత్రం బదిలీలతో చర్చనీయాంశమవుతోంది.

Updated Date - Dec 22 , 2024 | 03:24 AM