High Court: గ్రూప్-1 మెయిన్స్ ఎంపిక సబబే
ABN , Publish Date - Dec 27 , 2024 | 04:39 AM
గ్రూప్-1 మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేసిన విధానం సబబేనని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. జీవో 55 స్థానంలో జీవో 29 అమలును.. మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థుల ఎంపికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.

స్పష్టం చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్
జీవో 29పై దాఖలైన పిటిషన్ల కొట్టివేత
గ్రూప్-1 పోస్టుల భర్తీకి తొలగిన అడ్డంకి
ఆ లెక్కన ఇప్పుడు మరింత ఆలస్యమైంది
అదే అంశంపై మళ్లీ విచారణ సబబు కాదు
హైదరాబాద్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేసిన విధానం సబబేనని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. జీవో 55 స్థానంలో జీవో 29 అమలును.. మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థుల ఎంపికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. గ్రూప్-1 చుట్టూ అలుముకున్న వివాదాలకు ముగింపు పలికి.. ఎంపిక ప్రక్రియకు అడ్డంకులను తొలగించింది. జీవో 29 అమలు, జీవో 96, తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1996లోని రూల్ 22(2)(ఏ), (బీ) చట్టబద్ధతను సవాల్ చేస్తూ.. దాఖలైన ఎనిమిది వేర్వేరు పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ జి.రాధారాణిల డివిజన్ బెంచ్ గురువారం తుది తీర్పునిచ్చింది. పిటిషన్ దాఖలులో ‘ఆలస్యం’ కారణంగా హైకోర్టు సింగిల్ జడ్జి, డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టు కొట్టివేసిన అంశంపై మళ్లీ విచారణ జరపడం సబబు కాదని వ్యాఖ్యానించింది. ‘‘2024 ఫిబ్రవరి 19న కొత్త నోటిఫికేషన్ జారీ అయ్యాక.. దాదాపు ఆర్నెల్ల తర్వాత సింగిల్ జడ్జి వద్ద పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని సింగిల్ జడ్జి ధర్మాసనం అక్టోబరు 15న కొట్టివేసింది. వాటిపై అప్పీళ్లను అక్టోబరు 18న డివిజన్ బెంచ్ కొట్టివేసింది.
పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఈ నెల 6న కొట్టివేసింది. సింగిల్‌బెంచ్ ‘ఆలస్యం’ అనే కారణాన్ని స్పష్టంగా పేర్కొన్నాక.. ఇప్పుడు మరింత ఆలస్యం జరిగింది. ఒకసారి తీవ్ర ఆలస్యంపై నిర్ధారణ జరిగాక.. మళ్లీ అదే అంశంపై విచారణ సబబు కాదు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పదిరోజుల క్రితం వాదనల సందర్భంగా.. ‘‘గతంలో హైకోర్టు ప్రాథమిక పరీక్షను మళ్లీ నిర్వహించాలని చెప్పిందే తప్ప.. పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పలేదు. పాత దాన్ని రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా పోస్టులను 503 నుంచి 563కు పెంచారు. గేమ్ రూల్స్‌ను మధ్యలో మారుస్తూ.. చట్టవిరుద్ధంగా జీవో 29ను తీసుకొచ్చారు. గతంలో జీవో 55ని సమర్థించిన ప్రభుత్వం.. ఇప్పుడు జీవో 29ను అమలు చేయడం చెల్లదు. రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థికి ఎక్కువ మార్కులు వస్తే జనరల్ కోటాలో బెర్త్ దక్కాలి. మధ్యలో రూల్స్‌ను మార్చడం వల్ల 1:50 నిష్పత్తికి విరుద్ధంగా ఎక్కువ మంది అభ్యర్థులు మెయిన్స్‌కి ఎంపికయ్యారు’’ అని పేర్కొన్నారు.
ప్రభుత్వం, టీజీపీఎస్సీ తరఫున న్యాయవాదులు తమ వాదనలను వినిపిస్తూ.. కొత్త ప్రభుత్వం ఇచ్చిన కొత్త నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లను హైకోర్టు సింగిల్, డివిజన్ బెంచ్‌లు, సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత.. మళ్లీ వివాదానికి తావులేదని పేర్కొన్నారు. ‘‘కొత్త ప్రభుత్వం జారీచేసిన జీవో 29.. సుప్రీంకోర్టు ‘బాలోజీ బదావత్’ కేసులో ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా.. చట్టానికి లోబడి ఉంది. కోర్టు తీర్పులకు అనుగుణంగానే 1967 నుంచి కొత్త జీవోలు వస్తున్నాయి. జనరల్ విభాగంలో ఎంపికైన చిట్టచివరి వ్యక్తి కంటే.. రిజర్వుడు అభ్యర్థికి ఎక్కువ మార్కులు వస్తే.. సదరు అభ్యర్థికి కచ్చితంగా జనరల్ విభాగంలోనే బెర్త్ దక్కుతుంది’’ అని స్పష్టంచేశారు. వాదనలను విన్న ధర్మాసనం.. ‘‘ఇంతకుముందు రౌండ్ లిటిగేషన్‌లో పిటిషన్ల దాఖలులో తీవ్ర ఆలస్యం, అశ్రద్ధ జరిగిందని ఇదే కోర్టు స్పష్టంచేసిన తర్వాత.. అంతకంటే ఆలస్యంగా దాఖలైన ప్రస్తుత పిటిషన్లను అనుమతించడంలో అర్థంలేదు. కొత్త నోటిఫికేషన్‌ను రద్దు చేసి, 2022 నాటి పాత నోటిఫికేషన్‌ను పునరుద్ధరించడం.. అందులో పేర్కొన్న ఎంపిక ప్రక్రియను అనుసరించాలని ఆదేశించడం కుదరనే కుదరదు. ఈ తరహా స్వభావం ఉన్న కేసుల్లో ఒక్క రోజు ఆలస్యం కూడా లెక్కలోకి వస్తుంది. ఎందుకు ఆలస్యం జరిగింది? అనేదానికి పిటిషనర్లు సరైన వివరణ ఇవ్వలేదు’’ అని వ్యాఖ్యానించింది. పిటిషన్‌లను కొట్టివేస్తూ.. తుది తీర్పు వెలువరించింది.
త్వరలో ఫలితాలు?
కేసుఅడ్డంకి తొలగిపోయిన నేపథ్యంలో టీజీపీఎస్సీ త్వరలో ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. భారీ సంఖ్యలో అభ్యర్థులు పరీక్షకు హాజరైన నేపథ్యంలో.. వాల్యుయేషన్‌కు నెలల సమయం పడుతుంది. అయితే.. టీజీపీఎస్సీ ఆగమేఘాల మీద ఆ ప్రక్రియను పూర్తిచేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఫిబ్రవరి లేదా మార్చిలో మెయిన్స్ ఫలితాలు వస్తాయనే అంచనాలున్నా.. త్వరలో వాటిని విడుదల చేసే దిశలో టీజీపీఎస్సీ అడుగులు వేస్తున్నట్లు తెలిసింది.
గ్రూప్-1 కేసు సాగిందిలా..
బీఆర్‌ఎస్ హయాంలో 2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమ్స్ నిర్వహణ. ఆ తర్వాత లీకేజీ కారణంతో పరీక్షల రద్దు
2023 జూన్‌లో రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహణ. బయోమెట్రిక్ తీసుకోలేదనే కారణంతో.. రద్దు చేసిన హైకోర్టు. తర్వాత ప్రభుత్వం మార్పు
2024 ఫిబ్రవరి 19న ప్రభుత్వం పాత నోటిఫికేషన్‌ను రద్దుచేసి.. మరో 63 పోస్టులను చేరుస్తూ.. 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది
ఈ ఏడాది జూన్ 9న ప్రిలిమ్స్ నిర్వహణ. మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక. అక్టోబరు 21 నుంచి 27 వరకు మెయిన్స్ షెడ్యూల్ ఖరారు
కొత్త నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ జూలై 31న హైకోర్టు సింగిల్ బెంచ్ వద్ద పిటిషన్ల దాఖలు. అక్టోబరు 15న ఆ పిటిషన్లను కొట్టివేసిన ధర్మాసనం
ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లను అక్టోబరు 18న కొట్టివేసిన డివిజన్ బెంచ్. డివిజన్ బెంచ్‌లో ఎనిమిది పిటిషన్లు
సుప్రీంకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు.. ఈ నెల 6న కొట్టేసిన ధర్మాసనం
ఈ నెల 26న జీవో 29, ఇతర అంశాలపై దాఖలైన 8 పిటిషన్ల కొట్టివేతతో.. ఫలితాల విడుదలకు మార్గం సుగమం