Share News

Ralampadu Reservoir: రేలంపాడు రిజర్వాయర్‌కు మరమ్మతులు

ABN , Publish Date - Aug 15 , 2024 | 04:03 AM

జవహర్‌ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన రేలంపాడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వాయర్‌ కట్టలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సీపేజీని కట్టడి చేసేందుకు కర్టయిన్‌ గ్రౌటింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది.

Ralampadu Reservoir: రేలంపాడు రిజర్వాయర్‌కు మరమ్మతులు

  • కట్టలో సీపేజీని కట్టడి చేసేందుకు కర్టయిన్‌ గ్రౌటింగ్‌

  • రూ.153 కోట్లతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): జవహర్‌ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన రేలంపాడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వాయర్‌ కట్టలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సీపేజీని కట్టడి చేసేందుకు కర్టయిన్‌ గ్రౌటింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.153 కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా వేసింది. గ్రౌటింగ్‌ కోసం కట్ట ఎగువ భాగంలో డ్రిల్లింగ్‌ చేసి.. పైపులు లేదా గ్యాలరీ ద్వారా సిమెంట్‌తోపాటు ఇతర మిశ్రమాన్ని లోపలికి ఒత్తిడితో పంపిస్తారు. తద్వారా కట్ట కింద నుంచి సీపేజీ (లీకేజీలు) కాకుండా అడ్డుకుంటారు.


రేలంపాడు రిజర్వాయర్‌ను.. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాల్లో 2లక్షల ఎకరాలకు సాగునీరు, 8 మండలాల్లోని 148 గ్రామాలకు తాగునీరు ఇచ్చేందుకు గుడ్డెందొడ్డి గ్రామంలో నిర్మించారు. తొలుత 2.3 టీఎంసీలతో రిజర్వాయర్‌ నిర్మాణానికి పూనుకున్నారు. మూడు కిలోమీటర్ల మేర మట్టికట్టతో దీనిని నిర్మించారు. కాగా, రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 4 టీఎంసీలకు పెంచుతూ 2014 ఫిబ్రవరిలో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మేరకు 2014-15 నుంచి 2016 దాకా ఇందులో 4 టీఎంసీల దాకా నీటిని నిల్వచే సి విడుదల చేశారు. 2019లో రిజర్వాయర్‌లో భారీగా సీపేజీని గుర్తించారు. డ్యామ్‌సేఫ్టీ కమిటీ కూడా దీనిని పరిశీలించింది.


అనంతరం దీనికి మరమ్మతులు చేసినా ప్రయోజనం కలగలేదు. ఆ తర్వాత 2021-22లో రిజర్వాయర్‌లో 3.450 టీఎంసీల నీటిని నిల్వ చేయగా.. భారీగా సీపేజీ చోటుచేసుకుంది. దాంతో రిజర్వాయర్‌లో నీటిని పంపింగ్‌ చేయకుండా ఆపేశారు. ఈ క్రమంలోనే 2021 ఆగస్టులో అధికారులు రిజర్వాయర్‌ను పరిశీలించి.. 2టీఎంసీల వరకే నీటిని నిల్వ చేయాలని సిఫారసు చేశారు. సీపేజీకి కారణాలు తెలుసుకునేందుకు జియో ఫిజికల్‌, ఎలకో్ట్ర రెసిస్టివిటీ విధానంలో పరీక్షలు చేయాలని సూచించారు. ఈ మేరకు సీపేజీతో దెబ్బతిన్న ప్రాంతంతోపాటు దెబ్బతినని ప్రాంతానికి చెందిన శాంపిళ్లను సేకరించి పరీక్షలు చేశారు. పరీక్షల ఫలితాల అనంతరం సీపేజీ కట్టడికి కర్టయిన్‌ గ్రౌటింగ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.153 కోట్లు అవుతాయని అంచనాలు వేయగా.. ఆమోదం తెలిపింది.

Updated Date - Aug 15 , 2024 | 04:03 AM