TG Govt: ఉపాధి హామీని వాడుకుంటేనే 12 వేలు ఆర్థిక భరోసా!
ABN , Publish Date - Dec 24 , 2024 | 03:49 AM
భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకానికి లబ్ధిదారుల ఎంపికకు ఉపాధి హామీ జాబ్ కార్డునే ప్రాతిపదికగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
భూమిలేని కూలీలకు సాయానికి ప్రాతిపదిక
100 రోజులు పూర్తి చేసిన వారికే తొలుత
28న ఖాతాల్లో డబ్బు వేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం
భూమిలేని పేదలకు ఇదే ప్రాతిపదిక
హైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకానికి లబ్ధిదారుల ఎంపికకు ఉపాధి హామీ జాబ్ కార్డునే ప్రాతిపదికగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలేవీ విడుదల కాకపోయినా క్షేత్ర స్థాయిలో ఇప్పటికే ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ’ పథకాన్ని ఉపయోగించుకున్న భూమిలేని పేదల సమాచారాన్ని ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి సేకరిస్తున్నారు. కాంగ్రెస్ వ్యవస్థాపక దినమైన ఈ నెల 28 తేదీనలబ్ధిదారుల ఖాతాల్లో తొలి విడత ఆరు వేల రూపాయలు వేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. తొలి విడతలో వంద రోజుల ఉపాధి హామీ పని పూర్తి చేసిన వారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. మార్గదర్శకాలేవీ విడుదల చేయకుండానే కసరత్తు చేస్తుండటంతో వ్యవసాయ కూలీలు, రైతు సంఘాల్లో కాస్త ఆందోళన నెలకొంది.
మూడింటి వడపోత
రాష్ట్రంలో వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఏదో ఒక పథకం ప్రభుత్వం నుంచి అందుతోంది. భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏ సాయమూ అందడం లేదు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉపాధి హామీ పథకంతో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు లబ్ధి పొందుతున్నారు. ప్రత్యేకంగా వ్యవసాయ కూలీలకు సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామని, అదీ రెండు విడతలుగా ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవలే ప్రకటించారు. రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకానికి రూ.1,200 కోట్లు కేటాయించారు కూడా. లబ్ధిదారుల ఎంపికను గ్రామీణాభివృద్ధి శాఖ చేపడుతోంది. ఉపాధి హామీ పథకంలో ఉన్న జాబ్ కార్డులు, ఆధార్ కార్డులు, పట్టాదారు పాస్ పుస్తకాలు... మూడింటిని కలిపి వడపోసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఉపాధి హామీ ఫీల్డు అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. మండల కంప్యూటర్ సెంటర్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. జాబ్ కార్డు నెంబర్ల వారీగా ఈ ఏడాది 100 రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న వారి వివరాలు తీస్తున్నారు.
వారిలో భూమి ఉన్నవాళ్లు ఎవరైనా ఉన్నారా? పరిశీలించి ఏరేస్తారు. గడిచిన ఆర్థిక సంవత్సరాల్లో కూడా 100 రోజులు పూర్తి చేశారా? లేదా? అనేది చూస్తారు. తొలి విడత బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయడానికి ఈ విధంగా వడపోత నిర్వహిస్తారు. ఇదే పద్ధతిలో 90 రోజులు, 80 రోజులు, 70 రోజులు... ఇలా అవరోహణ క్రమంలో ఎక్కువ పని దినాలు పూర్తి చేసిన వారి జాబితాలు విడివిడిగా రూపొందిస్తారు. విడతల వారీగా చెల్లింపులు చేస్తారు. 15 లక్షల మంది వ్యవసాయ కూలీలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని ఇటీవల రెవెన్యూ మంత్రి పొంగులేటి ప్రకటించారు. రూ.900 కోట్లు తొలి విడతలో విడుదల చేయనున్నారు. వారం రోజుల్లో అమలు చేయబోయే పథకానికి విధివిధానాలు ప్రకటించక పోవటంపై రైతు సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రకరకాల కారణాలతో 100 రోజుల పని దినాలు పూర్తి చేయని వారు ఉంటారని, వారిని ఎందుకు పరిగణనలోకి తీసుకోరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏ పథకానికీ నోచుకోని ఒంటరి మహిళలకు ఇందులో అవకాశం కల్పించాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. గుంట, రెండు గుంటల భూమి ఉన్న చిన్న రైతులకు రైతు భరోసాలో ఏమీ రాదని, అలాంటి వారిని కూడా వ్యవసాయ కూలీలుగా పరిగణించి ఆర్థిక భరోసా ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.