Share News

Hyderabad: 74 ట్రామా కేర్‌ కేంద్రాలు

ABN , Publish Date - Aug 26 , 2024 | 04:09 AM

తెలంగాణ వ్యాప్తంగా జాతీయ రహదారుల వెంట 74 ట్రామా కేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు దశల్లో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్న సర్కారు.. వచ్చే నెల నుంచే మొదటి దశ కేంద్రాల ఏర్పాటుకు సన్నద్ధమైంది.

Hyderabad: 74 ట్రామా కేర్‌ కేంద్రాలు

  • రాష్ట్ర వ్యాప్తంగా హైవేలపై ఏర్పాటు

  • వీటికి తల్లి లేదా టెల్‌మీ పేరు?

  • తొలి విడతలో 24 కేంద్రాలు

  • ఒక్కో కేంద్రంలో 73 మంది సిబ్బంది

  • అంచనా వ్యయం 1,116 కోట్లు

హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వ్యాప్తంగా జాతీయ రహదారుల వెంట 74 ట్రామా కేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు దశల్లో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్న సర్కారు.. వచ్చే నెల నుంచే మొదటి దశ కేంద్రాల ఏర్పాటుకు సన్నద్ధమైంది. వీటికి తెలంగాణ హైవే యాక్సిడెంట్‌ లైఫ్‌ లైన్‌ ఇనీషియేటివ్‌(తల్లి), తెలంగాణ లైఫ్‌ లైన్‌ ఫర్‌ మెడికల్‌ ఎమర్జెన్సీ (టెల్‌మీ) పేర్లలో ఒక దాన్ని పెట్టే అవకాశం ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం తెలంగాణలో 9 జాతీయ రహదారులు, ఒక రాష్ట్ర రహదారి ఉంది.


ఇప్పటికే ఎన్‌హెచ్‌ 65(హైదరాబాద్‌- విజయవాడ)పై ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొర్లపాడు టోల్‌ ప్లాజా వద్ద ఓ ప్రైవేటు సంస్థ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ట్రామాకేర్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. కాగా ప్రస్తుతం జాతీయ, రాష్ట్ర రహదారులపై నెలకు సగటున 12 వేలకు పైగా ట్రామా కేసులొస్తున్నాయి. రోజుకు సగటున 425 కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ మధ్య 51,405 కేసులు నమోదయినట్లు వైద్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో రెండు రకాల ఎమర్జెన్సీలున్నాయి. ఒకటి నాన్‌ వెహిక్యులర్‌ ట్రామా, రెండోది వెహిక్యులర్‌ ట్రామా.


నాన్‌ వెహిక్యులర్‌ ట్రామాలో కాలిన గాయాలు, ఆత్మహత్యాయత్నాలు, రేప్‌ కేసులు, కత్తిపోట్లు, గన్‌షాట్స్‌, కరెంటు షాక్‌లు, నీళ్లలో మునిగిపోవడం లాంటివి వస్తాయి. వెహిక్యులర్‌ ట్రామాలో రోడ్డు, రైలు ప్రమాదాలు వస్తాయి. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో నాన్‌ వెహిక్యులర్‌ కేసులు ఎక్కువగా వస్తున్నట్లు వెద్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో గ్రామీణ ప్రాంతాల్లో 11,178, పట్టణ ప్రాంతాల్లో 8,377, గిరిజన ప్రాంతాల్లో 1,697 నాన్‌ వెహిక్యులర్‌ కేసులొచ్చాయి. వెహిక్యులర్‌ కేసులు కూడా సుమారుగా ఇదే నిష్పత్తిలో నమోదయ్యాయి.


  • మూడు దశల్లో ఏర్పాటు..

వచ్చే నెల నుంచి మొదటి దశ ట్రామా కేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా వైద్య ఆరోగ్య శాఖ కసరత్తులు చేస్తోంది. మొత్తంగా మూడు దశల్లో వీటిని పూర్తి చేయనుంది. మొదటి, రెండో దశల్లో 24 చొప్పున, మూడో దశలో 26 చొప్పున 74 ట్రామాకేర్‌ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. జాతీయ రహదారులకు సమీపంలో ఉన్న తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రులకు(వంద పడకలకు పైగా ఉన్నవి) అనుసంధానంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన రహదారికి పక్కనే కాకుండా లోపలికి సుమారు ఒకటి రెండు కి.మీ. దూరంలో వీటిని తీసుకువస్తామని వైద్యవర్గాలు వెల్లడించాయి. రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారు గోల్డెన్‌ అవర్‌ మిస్‌ అవుతున్నారు. సర్కారీ దవాఖానాలకు వస్తే వెంటనే వారికి వైద్యం అందడం లేదు.


కొన్నిసార్లు కనీస వైద్య సేవలందించలేని పరిస్థితి ఉంటోంది. స్పెషాలిటీ వైద్యులు లేకపోవడంతో ఇతర ఆస్పత్రులకు పంపిస్తున్నారు. దాంతో పెద్దాస్పత్రులపై భారం పడుతోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ట్రామా కేర్‌ కేంద్రాలను భారీగా ఏర్పాటు చేస్తోంది. ఇవి ఐదంచెల వ్యవస్థలో పనిచేస్తాయి. మొదట ప్రమాదం జరగ్గానే క్షతగాత్రులను అంబులెన్స్‌ ద్వారా ఆస్పత్రికి తరలిస్తారు. రెండో అంచెలో బాఽధితులను అత్యవసర విభాగంలో ఉంచి, వైద్య సేవలందిస్తారు. మూడో దశలో డ్యామేజ్‌ కంట్రోల్‌ సర్జరీలు, నాలుగో దశలో కచ్చితమైన సంరక్షణ, ఐదో దశలో రిహాబిటేషన్‌ ఉంటుంది. మొదటి మూడు దశల్లో ట్రామా కేర్‌ కేంద్రాల్లో వైద్య సేవలందుతాయి. నాలుగు, ఐదు దశలో రిఫరల్‌ ఆస్పత్రులకు పంపుతూ, ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్య సేవలందిస్తారు.


  • ట్రామాకేర్‌ కేంద్రాల్లో ఎవరెవరు ఉంటారంటే..

ఒక్కో ట్రామా కేర్‌ కేంద్రంలో 73 మంది వైద్య సిబ్బంది ఉంటారు. ఇందులో ఇద్దరి చొప్పున ఆర్థోపెడిక్‌ సర్జన్‌, జనరల్‌ సర్జన్‌, అనస్తీషియలిస్ట్‌, రేడియోగ్రాఫర్‌, సీ.టీ టెక్నీషియన్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, పైలట్‌ డ్రైవర్‌.. ఆరుగురు చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్లు, 24 మంది స్టాఫ్‌నర్సులు, ఆరుగురి చొప్పున ఏఎన్‌ఎమ్‌లు, ఓటీ టెక్నీషియన్లు ఉంటారు. అలాగే ఎమర్జెన్సీ రూమ్‌ టెక్నీషియన్లు నలుగురు, ఒక బయోమెడికల్‌ టెక్నీషియన్‌, మరో 12 మంది సహాయక సిబ్బంది ఉంటారు. మొదటి దశలో ఏర్పాటయ్యే ట్రామా కేర్‌ కేంద్రాల్లో పని చేసే వీరందరి జీత భత్యాలకు నెలకు రూ.21.36 కోట్లు అవుతుందని వైద్య శాఖ అంచనా వేసింది.


  • ట్రామా కేర్‌ కేంద్రాల బలోపేతానికి రూ.1,116 కోట్లు

వచ్చే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 74 ట్రామాకేర్‌ కేంద్రాల కోసం రూ.1,116 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఆ కేంద్రాలను మరింత బలోపేతం చేయడంతో పాటు యంత్ర పరికరాల కొనుగోలు, వైద్య సిబ్బంది జీత భత్యాలు, అంబులెన్స్‌ల నిర్వహణ, బ్లడ్‌ బ్యాంకుల ఏర్పాటు, టెలీ మెడిసిన్‌ కేంద్రాలు, ఇతరత్రా ఖర్చులన్నీ కలిపి అంత అవుతుందని అంచనా వేశారు. తొలి ఏడాది రూ.138 కోట్లు, రెండో ఏడాది రూ.206 కోట్లు, మూడో ఏడాది రూ.303 కోట్లు నాలుగో ఏడాది రూ. 220 కోట్లు, ఐదో ఏడాది రూ. 248 కోట్లు అవుతుందని వైద్య శాఖ అంచనా వేసింది.

Updated Date - Aug 26 , 2024 | 04:09 AM