సెక్షన్-3, సెక్షన్-89పై వాదనలు ఏకకాలంలో వినాలి
ABN , Publish Date - Dec 28 , 2024 | 05:36 AM
కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్-89, అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం-1956లోని సెక్షన్-3లపై ఏకకాలంలో వాదనలు వినాలని తెలంగాణ రాష్ట్రం బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్‌ను కోరింది.

ఏపీ కోరినట్లుగా విడిగా వాదనలు వద్దు
అలాగైతే ముందుగా రెండు రాష్ట్రాలకు నీటిని సమానంగా పంపిణీ చేయండి
కృష్ణా ట్రైబ్యునల్‌లో తెలంగాణ కౌంటర్ పిటిషన్
హైదరాబాద్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్-89, అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం-1956లోని సెక్షన్-3లపై ఏకకాలంలో వాదనలు వినాలని తెలంగాణ రాష్ట్రం బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్‌ను కోరింది. ఈ రెండు సెక్షన్లలోని అంశాలకు సారూప్యత ఉందని గుర్తు చేసింది. సెక్షన్-3, సెక్షన్-89 ఒకటి కాదని, రెండు సెక్షన్లలోని అంశాలపై వేర్వేరుగా వాదనలు వినాలంటూ బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్ వద్ద ఆంధ్రప్రదేశ్ ఇటీవల ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేసిన నేపథ్యంలో దానికి కౌంటర్‌గా తెలంగాణ శుక్రవారం రీజాయిండర్ దాఖలు చేసింది. రెండు అంశాల్లో వేర్వేరుగా వాదనలు వినాలనుకుంటే.. తొలుత సెక్షన్-3 కింద వాదనలు విని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గంపగుత్తగా కేటాయించిన 811 టీఎంసీలను రెండు తెలుగు రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేయాలని కోరింది.
ఆ తర్వాత సెక్షన్-89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయింపులపై వాదనలు వినాలని పేర్కొంది. 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ట్రైబ్యునల్ విచారణకు ప్రతిబంధకం కావని తెలిపింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీకి 34 టీఎంసీల (తెలుగుగంగకు 15 టీఎంసీలు, ఎస్‌ఆర్‌బీసీకి 19 టీఎంసీలు) కేటాయింపులు మాత్రమే ఉండగా.. ఆ రాష్ట్రం ఏటా 200 టీఎంసీలకు పైగా నీటిని (72 శాతానికి పైగా) తరలిస్తోందరి తెలంగాణ ఆక్షేపించింది. పైగా.. నీటి కేటాయింపులపై ట్రైబ్యునల్‌లో విచారణ జరుగుతున్నందున.. ఈ అంశంలో అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోజాలదంటూ కేంద్ర జలశక్తి శాఖ ఇటీవల తేల్చిచెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. నీటి పంపిణీకి సంబంధించి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయబోమంటూ కేంద్ర జలశక్తి శాఖ 2023 అక్టోబరు 20న లేఖ రాసిందని తెలిపింది. విచారణ ప్రక్రియలో జాప్యం చేసి, కృష్ణా జలాలను బేసిన్ వెలుపలికి తరలించే ప్రయత్నం ఏపీ చేస్తోందని, సెక్షన్-89 కింద తొలుత వాదనలు వినాలనే వాదన దీనికి నిదర్శమని గుర్తు చేసింది.