Share News

Court Contempt: కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిన ఎస్సైకి వారం జైలు.. 2 వేల జరిమానా

ABN , Publish Date - Dec 28 , 2024 | 03:54 AM

న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించిన పోలీసు ఎస్సైకి హైకోర్టు శుక్రవారం జైలు శిక్ష, జరిమానా విధించింది.

Court Contempt: కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిన ఎస్సైకి వారం జైలు.. 2 వేల జరిమానా

హైదరాబాద్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించిన పోలీసు ఎస్సైకి హైకోర్టు శుక్రవారం జైలు శిక్ష, జరిమానా విధించింది. ఏడేళ్ల కంటే తక్కువ జైలుశిక్ష పడే ఓ చిన్న కేసులో గొలుసు నర్సయ్య అనే వ్యక్తిని అరెస్ట్‌ చేయరాదని, సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసు ఇవ్వాలని స్పష్టంగా హైకోర్టు ఆదేశించినప్పటికీ వాటిని ధిక్కరించిన వరంగల్‌ జిల్లా తరిగొప్పుల ఎస్సై నరేశ్‌ యాదవ్‌కు ఈ శిక్షలు వేసింది. ఉద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కరణకు పాల్పడి నిందితుడిని అరెస్టు చేయడాన్ని తప్పు పట్టింది.


వారం రోజుల పాటు జైలుశిక్ష అనుభవించాలని, రూ. 2 వేలు జరిమానా చెల్లించాలని జస్టిస్‌ కె. సురేందర్‌ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. బాధితుడికి ఎస్‌.ఐ. సొంత జేబు నుంచి రూ. 50 వేలు పరిహారం చెల్లించాలని స్పష్టంచేసింది. చట్టాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ ఉద్యోగి.. తన హోదాను దుర్వినియోగం చేయడం క్షమార్హం కాదని పేర్కొంది. అరెస్ట్‌ చేయకుండా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిసి కూడా తనకు ఉత్తర్వులు అందలేదని తప్పించుకునే యత్నం చేశారని తెలిపింది. ఇలాంటి తప్పుదోవ పట్టించే చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించింది.

Updated Date - Dec 28 , 2024 | 03:54 AM