JAC: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌గా లచ్చిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
ABN , Publish Date - Aug 26 , 2024 | 04:26 AM
రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆవిర్భవించింది. 65 ఉద్యోగ సంఘాల భాగస్వామ్యంతో దీనిని ఏర్పాటు చేశారు.
65 ఉద్యోగ సంఘాల భాగస్వామ్యం
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: లచ్చిరెడ్డి
హైదరాబాద్/బర్కత్‌పుర, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆవిర్భవించింది. 65 ఉద్యోగ సంఘాల భాగస్వామ్యంతో దీనిని ఏర్పాటు చేశారు. నగరంలోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, సీపీఎస్, పెన్షన్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డిని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పెద్దలు ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, కార్మికుల హక్కులు హరించినా నాడు ఉన్న ఉద్యోగుల జేఏసీ నాయకులు నోరు మెదపలేదని ఆరోపించారు. ఉద్యోగ సంఘాలను, సంఘాల నేతలను ఉక్కుపాదంతో అణిచివేసినప్పుడు నాటి ఉద్యోగ నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేశారని, జీవో 317తో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని, అయినా గత జేఏసీ నాయకులు పట్టించుకోలేదని ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చాక ఒకటో తేదీనే జీతాలు పడుతున్నాయని, ఉద్యోగుల కష్టనష్టాల గురించి సీఎం రేవంత్ రెడ్డికి సంపూర్ణ అవగాహన ఉందని చెప్పారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆరోగ్యం, పదోన్నతుల క్యాలెండర్ అమలు, హౌసింగ్ పాలసీకి కృషి చేస్తానని చెప్పారు. గత ప్రభుత్వ పదేళ్ల పాలనాకాలంలో ఉద్యోగుల విషయంలో జరిగిన పొరపాట్లు, ఉద్యోగులకు జరిగిన అన్యాయాలు మళ్లీ పునరావృతం కావొద్దనే ఆలోచనతోనే ఏకతాటిపైకి వచ్చినట్టు చెప్పారు.
తాము ఆ సంఘాలకు పోటీగా ముందుకు రావడం లేదని, ఆ సంఘాల గుత్తాధిపత్యం రాచరికంలా ఉండొద్దని, ఉద్యోగుల సమస్య పరిష్కారానికి కృషి చేయడానికి వచ్చినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షురాలు నిర్మల, పీఆర్‌టీయూ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి, ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు అశ్వత్థామరెడి తదితరులు పాల్గొన్నారు.