Land Mortgage: రుణానికి భూ తనఖా?
ABN , Publish Date - Oct 20 , 2024 | 02:48 AM
ఆర్థిక వనరుల సమీకరణలో భాగంగా భూములను తాకట్టు పెట్టి, అప్పు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీజీఐఐసీ) ఆధీనంలోని భూములను తనఖా పెట్టనుంది.
రూ.10 వేల కోట్ల సమీకరణకు యత్నం
‘రుణ మాఫీ’కి అవసరమైన నిధుల కోసమే
టీజీఐఐసీ భూముల తాకట్టుకు ప్రతిపాదనలు
ఆడిటింగ్ కాకపోవడంపై ఆర్‌బీఐ అభ్యంతరం
వెనక్కొచ్చిన దస్త్రం.. ఆడిటింగ్‌పై సర్కారు దృష్టి
హైదరాబాద్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక వనరుల సమీకరణలో భాగంగా భూములను తాకట్టు పెట్టి, అప్పు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీజీఐఐసీ) ఆధీనంలోని భూములను తనఖా పెట్టనుంది. ఈ మేరకు ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ఇండియా(ఆర్‌బీఐ)కు ప్రతిపాదనలు పంపించింది. వాస్తవానికి రైతు రుణమాఫీ ఇప్పటికే ప్రభుత్వం రూ.18వేల కోట్లకు పైగా వ్యయం చేసింది.
ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలంటే... ఇంకా నిధుల అవసరం ఉంది. ఇందులో భాగంగానే టీజీఐఐసీ భూములను తనఖా పెట్టి రూ.10వేల కోట్లను అప్పుగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇటీవలే ఆర్‌బీఐకి ప్రతిపాదనను పంపించింది. టీజీఐఐసీ అధీనంలోని భూములను తనఖా పెట్టుకుని, ఆర్థిక సంస్థల నుంచి రూ.10వేల కోట్ల అప్పు తీసుకోవడానికి అనుమతించాలని కోరింది. టీజీఐఐసీ పేరిటే ఈ రుణాన్ని తీసుకుంటామని, దీనికి భరోసాగా భూములను తనఖా పెడతామని వివరించింది.
ఈ రుణాన్ని ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తీసుకోవద్దని, బడ్జెట్ రుణాలకు వెలుపల ఇచ్చిన రుణంగా పరిగణించాలని విజ్ఞప్తి చేసింది. అయితే, టీజీఐఐసీలో ఆడిటింగ్ పూర్తి కాలేదన్న కారణంతో ఈ ప్రతిపాదనను ఆర్‌బీఐ వెనక్కి పంపించింది. టీజీఐఐసీ అధీనంలో ఉన్న భూములు, ఆర్థిక వనరుల పరిస్థితి, తిరిగి చెల్లించే సామర్థ్యం తదితర వివరాలు పంపించాలని సూచించింది. ఈ వివరాలు అందిన తర్వాతే రుణం ఇప్పించే విషయాన్ని ఆలోచిస్తామని తెలిపినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం కూడా టీజీఐఐసీ ఆర్థిక కార్యకలాపాల ఆడిటింగ్‌పై దృష్టి పెట్టింది. సాధ్యమైనంత త్వరంగా ఆడిట్‌ను పూర్తి చేయించాలని టీజీఐఐసీ చైర్మన్, ఎండీలను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఆదేశించారు. ఈ ఆడిటింగ్ నివేదికతో మరోసారి ఆర్‌బీఐకి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపనుంది.