Illegal Mining: ‘హద్దు’ మీరకుండా జియోఫెన్సింగ్..
ABN , Publish Date - Jul 25 , 2024 | 03:22 AM
మైనింగ్ అక్రమాలకు అడ్డుకట్ట వేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ, పట్టా, అటవీ భూముల్లో మైనింగ్ లీజు పొందిన కొందరు తమకు కేటాయించిన భూముల హద్దుల దాటి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని సర్కారు గుర్తించింది.
మైనింగ్ అక్రమాల అడ్డుకట్టకు ప్రభుత్వ చర్య
హైదరాబాద్, జూలై 24(ఆంధ్రజ్యోతి): మైనింగ్ అక్రమాలకు అడ్డుకట్ట వేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ, పట్టా, అటవీ భూముల్లో మైనింగ్ లీజు పొందిన కొందరు తమకు కేటాయించిన భూముల హద్దుల దాటి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని సర్కారు గుర్తించింది. అక్రమ మైనింగ్ గురించి తెలిసినా క్షేత్రస్థాయి అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఈ నేపథ్యంలో లీజుదారులు హద్దులు మీరి అక్రమ మైనింగ్‌కు పాల్పడకుండా చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.
మైనింగ్ లీజుకిచ్చిన భూముల హద్దులను జియోఫెన్సింగ్ చేయాలని నిర్ణయించింది. మూడు నెలల్లోగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 72516.5745 హెక్టార్ల భూమిని మైనింగ్‌కు ఇచ్చారు. లీజుకు ఇచ్చిన వాటిలో 36979.12 హెక్టార్ల ప్రభుత్వ భూములు, 22,943.90 హెక్టార్ల పట్టా భూములు, 12,593.55 హెక్టార్ల అటవీ భూములు ఉన్నాయి.