Farmers: అన్నదాతకు పెద్దపీట
ABN , Publish Date - Nov 28 , 2024 | 04:00 AM
కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిలో అన్నదాతకు పెద్దపీట వేసింది. వ్యవసాయరంగంపై ప్రత్యేక దృష్టిసారించిన సర్కారు.. రైతుల సంక్షేమానికి సుమారుగా రూ.55 వేల కోట్లు ఖర్చు చేసింది.

తొలి ఏడాదిలో రైతుల సంక్షేమానికి రూ.55 వేల కోట్లు!
22.22 లక్షల మంది రైతుల రుణమాఫీకి రూ.17,870 కోట్లు
ఉచిత విద్యుత్ సబ్సిడీకి 10,444 కోట్లు
ఏడాది పాలనలో వ్యవసాయరంగంపై సీఎంవో ప్రకటన
హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిలో అన్నదాతకు పెద్దపీట వేసింది. వ్యవసాయరంగంపై ప్రత్యేక దృష్టిసారించిన సర్కారు.. రైతుల సంక్షేమానికి సుమారుగా రూ.55 వేల కోట్లు ఖర్చు చేసింది. కీలకమైన రుణమాఫీతోపాటు రైతుభరోసా, ఉచిత విద్యుత్తు, రైతుబీమా పథకాలకు పెద్దఎత్తున నిధుల కేటాయింపులు చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తెలంగాణ రైతులను దేశానికే తల మానికంగా నిలపాలనే ఉద్దేశంతో రైతుల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం తొలి ఏడాదిలోనే భారీగా నిధులు ఖర్చు చేసినట్లు పేర్కొంది. ఏడాదిలో రూ.54,280 కోట్లతో వివిధ పథకాలను అమలు చేసినట్లు ప్రకటించింది. దేశంలోనే వరి సాగు విస్తీర్ణంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని, 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా గతంలో ఎన్నడూ లేని విధంగా 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందని పేర్కొంది. ‘దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతులకు ఒకేసారి రూ.2 లక్షల వరకు పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. కేవలం 27 రోజుల్లోనే దాదాపు 22.22 లక్షల మంది రైతుల కుటుంబాలకు దాదాపు రూ.17,870 కోట్ల రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఇటీవలే వేములవాడ సభలో సీఎం రేవంత్ ప్రకటించారు.
అధికారం చేపట్టిన వెంటనే రైతుల బాగుకు కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేసింది. ఉచిత విద్యుత్తు పథకాన్ని నిరాటంకంగా ప్రజా ప్రభుత్వం మళ్లీ తీసుకు వచ్చింది. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తుకు ఈ ఏడాది రూ.10,444 కోట్లు సబ్సిడీగా చెల్లించినట్లు’ సీఎంవో వెల్లడించింది. ‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తొలి మూడు నెలల్లోనే ప్రభుత్వం రైతు భరోసా నిధులను పంపిణీ చేసింది. యాసంగి సాగుకు పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.5వేల చొప్పున రైతు భరోసా నిధులను రైతులందరి ఖాతాలో జమ చేసింది. మొత్తం 1,57,51,000 ఎకరాలకు రూ.7,625 కోట్లు విడుదల చేసింది. మొత్తం 69,86,519 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులు జమ చేసింది. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా రైతు భరోసా నిధులను మే నెల మొదటి వారంలోనే జమ చేసినట్లు’ సీఎంవో ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలోని రైతుల తరఫున పంటల బీమా ప్రీమియం చెల్లించేందుకు రూ.1,300 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. రైతు కుటుంబాలు ధీమాగా ఉండేలా రైతు బీమాను అమలు చేసిందని, ఎవరైనా రైతులు ఏ కారణంతో మరణించినా రూ.5 లక్షల బీమా పరిహారం బాధిత కుటుంబానికి అందిస్తోందని పేర్కొంది. రైతు బీమా పథకం ప్రీమియంగా రూ.1,455 కోట్లు చెల్లించినట్లు వెల్లడించింది.
గతం కన్నా ఎక్కువ కొనుగోలు కేంద్రాలు
‘రైతులు దళారుల చేతిలో మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను కట్టుదిట్టంగా నిర్వహించింది. గతంలో కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు నెలకొల్పింది. రైతులు నెలల కొద్దీ ఎదురు చూడకుండా డబ్బులను వేగంగా చెల్లించి రికార్డు నెలకొల్పింది. రబీ సీజన్‌కు సంబంధించి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు కేవలం మూడు రోజుల్లోనే డబ్బులు చెల్లించింది. రాష్ట్రంలో దాదాపు 9 లక్షల మంది రైతుల నుంచి రూ.10,547 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసింది. వానాకాలం సీజన్ నుంచి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు రూ.500 బోనస్ ప్రకటించింది. కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లు అమ్మిన రైతులకు బోనస్ చెల్లించింది. దీంతో రాష్ట్రంలో సన్నరకాల వరిసాగు విస్తీర్ణం పెరిగింది. అన్ని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను అమర్చనుంది. తొలి విడతగా 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,601 రైతు వేదికల నుంచి రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే ఏర్పాట్లు చేసింది.