Revenue Issues: రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి
ABN , Publish Date - Aug 23 , 2024 | 04:46 AM
భూసమస్యల పరిష్కారానికి సర్కారు కొత్త ఆర్వోఆర్-2024 చట్టం తేవాలనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పేర్కొంది. ముసాయిదాలో పలు అంశాలను చేర్చాలని కోరింది.
ఆర్వోఆర్ ముసాయిదాపై తెలంగాణ రైతు సంఘం ప్రతిపాదన
హైదరాబాద్, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): భూసమస్యల పరిష్కారానికి సర్కారు కొత్త ఆర్వోఆర్-2024 చట్టం తేవాలనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పేర్కొంది. ముసాయిదాలో పలు అంశాలను చేర్చాలని కోరింది. గ్రామస్థాయిలో ఉన్న భూసమస్యలను రెవెన్యూ సదస్సులు నిర్వహించి బహిరంగంగా ప్రకటించాలని.. తమ భూమి కబ్జాకు గురైంది, దాన్ని రికార్డుల్లో ఎక్కించమని కోరితే తహసీల్దార్లు, లేదా ఆర్డీవో సెక్షన్ 4(6) ప్రకారం భూయాజమాన్య హక్కు కబ్జాలో ఉన్న వారిని ఆధారం చేసుకుని ఇవ్వాలని చెప్పే సెక్షన్‌లో మార్పు చేయాలని సూచించింది.
అలాగే దేవాదాయ శాఖ, వక్ఫ్ భూములకు ట్రైబ్యునళ్లు ఉన్నట్లే జిల్లా స్థాయిలో ట్రైబున్యల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఆర్వోఆర్-2024 ముసాయిదాకు పబ్లిక్ అండ్ విజబుల్-2024 అని పేరు మార్చాలని.. 2020 ఆర్వోఆర్‌లోని సెక్షన్ 14 ప్రకారం హక్కుల రికార్డును అక్రమంగా దిద్దినా, కుట్రతో ఆదేశాలు జారీ చేసినా రెవెన్యూ అధికారులపై క్రిమినల్ చర్యలతో పాటు సర్వీసు నుంచి తొలగించే నిబంధనను యథావిధిగా కొనసాగించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హేమంతరావు, ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ కోరారు. కాగా, ఆర్వోఆర్-2024 ముసాయిదాపై ఈనెల 2 నుంచి సర్కారు చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ శుక్రవారంతో ముగియనుంది. ఈనెల 24, 25 తేదీల్లో జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో వర్క్‌షా్‌పలు కూడా నిర్వహించనున్నారు.