Share News

TG: అమిత్‌ షా ఫేక్‌ వీడియో కేసు టీ కాంగ్రెస్‌ ఐటీ సెల్‌ ఇన్‌చార్జి మన్నె సతీశ్‌ అదుపులోకి

ABN , Publish Date - May 03 , 2024 | 04:36 AM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఫేక్‌ వీడియో కేసులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

TG: అమిత్‌ షా ఫేక్‌ వీడియో కేసు టీ కాంగ్రెస్‌ ఐటీ సెల్‌ ఇన్‌చార్జి మన్నె సతీశ్‌ అదుపులోకి

  • అరెస్టు చేసిన సీసీఎస్‌ బృందం మరోసారి గాంధీభవన్‌కు ఢిల్లీ పోలీసులు

  • పోలీసుల అదుపులో మన్నె సతీశ్‌

  • అమిత్‌షా ఫేక్‌ వీడియో కేసు..

  • టీ కాంగ్రెస్‌ ఐటీ సెల్‌ ఇన్‌చార్జి సహా సభ్యులను అదుపులోకి తీసుకున్న సీసీఎస్‌ పోలీసులు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, మే 2 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఫేక్‌ వీడియో కేసులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కోసం ఓ వైపు ఢిల్లీ పోలీసులు గాలిస్తుంటే.. అదే కేసులో హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు తెలంగాణ కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి మన్నె సతీశ్‌తోపాటు మరికొందరిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసిన వారిలో సతీశ్‌ కూడా ఉన్నారు.


అమిత్‌ షా ఫేక్‌ వీడియో కేసులో ఢిల్లీ పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో అదే కేసుకు సంబంధించి స్థానిక బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ పోలీసులు కీలక వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమిత్‌ షా ఫేక్‌ వీడియోపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడానికి ముందే బీజేపీ నేత ప్రేమేందర్‌ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఏప్రిల్‌ 27న సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి సతీశ్‌తోపాటు సభ్యులు నవీన్‌, శివ, గీత, తస్లీమా, విష్ణును అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేత ప్రేమేందర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్‌ ఐటీ సెల్‌పై పోలీసులు ఐపీసీ 469, 505(1) (సీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


గాంధీభవన్‌కు ఢిల్లీ పోలీసులు..

మరోవైపు, ఇదే కేసులో ఢిల్లీ పోలీసులు గురువారం మరోసారి గాంధీభవన్‌కు వచ్చారు. ఇన్‌స్పెక్టర్‌ రామ్‌ నివాస్‌ నేతృత్వంలో ప్రత్యేక బృంధం గాంధీభవన్‌కు వచ్చింది. కేసు దర్యాప్తులో భాగంగా వివరాలు సేకరించి, నోటీసులు ఇచ్చేందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్‌ పోలీసులు గాంధీభవన్‌కు చేరుకుని ఢిల్లీ పోలీసులతో మాట్లాడారు. ఢిల్లీ పోలీసులు వచ్చిన సమయంలో కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ ఇన్‌చార్జి రాంచంద్రారెడ్డి అందుబాటులో లేకపోవడంతో వారు వెనుదిరిగారు. కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు గత నెల 29న తెలంగాణకు వచ్చారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసుల ఎదుట మే 1న విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్‌ రెడ్డికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే..

Updated Date - May 03 , 2024 | 04:36 AM