Road Maintenance: రోడ్ల మరమ్మతులకు నిధులు!
ABN , Publish Date - Oct 21 , 2024 | 05:00 AM
రహదారుల మరమ్మతులు, అవసరమైన చోట కొత్త రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ, ప్రధానమైన రహదారులన్నీ పంచాయతీరాజ్, రహదారులు భవనాల శాఖల పరిధిలో ఉన్నాయి.
నియోజకవర్గానికి రూ.30-40 కోట్లు.. మొత్తం రూ.3,570-4,760 కోట్లు
రోడ్లు, భవనాల శాఖ అంచనాలు
పంచాయతీరాజ్ పరిధిలో రోడ్ల మరమ్మతులకు రూ.1,377 కోట్లు
దశల వారీగా విడుదల చేసే ఛాన్స్
ఆయా పనులకు త్వరలో టెండర్లు
హైదరాబాద్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): రహదారుల మరమ్మతులు, అవసరమైన చోట కొత్త రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ, ప్రధానమైన రహదారులన్నీ పంచాయతీరాజ్, రహదారులు భవనాల శాఖల పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఈ రెండు శాఖల ఆధ్వర్యంలో రోడ్ల మరమ్మతులకు నిధులు ఏ మేరకు అవసరం అన్నదానిపై అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రహదారులు ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్నాయని, వాటి రిపేర్లకు నిధులను మంజూరు చేయాలంటూ పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖల మంత్రులకు లేఖల రూపంలో విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మరమ్మతులకు అవసరమైన నిధులను అంచనా వేసి, పనులు ప్రారంభించే దిశగా ఇరు శాఖలు చర్యలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,320 కి.మీ.ల మేర 641 చోట్ల రహదారులకు మరమ్మతులు చేయాల్సి ఉందని, రూ.1,375 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ నిధులను నియోజకవ ర్గాలవారీగా పలు దఫాలుగా మంజూరు చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఆయా పనులకు టెండర్లను ఆహ్వానించనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆర్ అండ్ బీ శాఖ కూడా నియోజకవర్గాల వారీగా రోడ్ల మరమ్మతులకు ప్రాథమికంగా ఎన్ని నిధులు అవసరమవుతాయనే అంచనాలను సిద్ధం చేసింది.
దాని ప్రకారం రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గానికి రూ.30-40 కోట్ల చొప్పున 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు రూ.3,570-4,760 కోట్ల నిధులు అవసరమవుతాయని తేల్చినట్టు సమాచారం. ఆర్ అండ్ బీ పరిఽధిలో రహదారులకు చేపట్టాల్సిన మరమ్మతులు, కొత్త రోడ్ల ప్రతిపాదనలకు సంబంధించి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఏ నియోజకవర్గంలో ఎన్ని రోడ్లకు మరమ్మతులు చేయాల్సి ఉందన్న జాబితాలను సిద్ధం చేస్తున్నారు. తొలుత అత్యవసరమైన రోడ్లకు నిధులను మంజూరు చేయాలని, అనంతరం మిగిలిన నియోజకవర్గాల్లోని రోడ్ల రిపేర్లకు నిధులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. నిధుల సర్దుబాటు పూర్తికాగానే పనుల కోసం టెండర్లను ఆహ్వానించనున్నారు.
గతేడాది పనులతోనే ఇప్పుడు భారం
గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు కొంతకాలం ముందు రాష్ట్రవ్యాప్తంగా రూ.2,888.34 కోట్లతో రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలకు మరమ్మతులు చేయాలని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయించి, అందుకు సంబంధించి నిధులను కూడా ఆర్ అండ్ బీకి మంజూరు చేసింది. కానీ ఆశించిన స్థాయిలో ఆ పనులు జరగలేదు. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న రోడ్ల మరమ్మతుల పనులు ప్రస్తుత ప్రభుత్వానికి భారంగా మారాయని ఆర్ అండ్ బీలో చర్చ జరుగుతోంది.
వర్షాలతో 2,555 కి.మీ.ల రహదారులకు నష్టం
రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కలిపి ఆర్ అండ్ బీ పరిధిలో దాదాపు 2,555 కి.మీ.ల మేర రోడ్లు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. వీటిలో కొన్నింటికి మరమ్మతులు చేపట్టగా కొన్ని నియోజకవర్గాల్లో పనులు నిర్వహించలేదు. ఆ నియోజకవర్గాలను గుర్తించి, వాటికి నిధులను మంజూరు చేయటంపై కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు సుమారు రూ.2,500 కోట్ల నిధులు అవసరమవుతాయని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన నివేదికలో పేర్కొంది. ఆ మేరకు కేంద్రం సహాయాన్ని కూడా కోరే అవకాశం ఉంది.