RRR: ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం డీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థ ఎంపిక నేడు
ABN , Publish Date - Dec 28 , 2024 | 05:23 AM
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగం రహదారికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ప్రభుత్వానికి అందించే బాధ్యత ఏ సంస్థకు దక్కనుందనే విషయం శనివారం తేలనుంది.

మొదట టెక్నికల్ బిడ్‌ల పరిశీలన
అనంతరం తెరుచుకోనున్న ఫైనాన్స్ బిడ్‌లు
హైదరాబాద్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగం రహదారికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ప్రభుత్వానికి అందించే బాధ్యత ఏ సంస్థకు దక్కనుందనే విషయం శనివారం తేలనుంది. డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీ సంస్థ ఎంపిక కోసం ప్రభుత్వం నవంబరు 25న ‘ఇంటర్నేషనల్ కాంపిటీటివ్ బిడ్డింగ్’ విధానంలో టెండర్లను ఆహ్వానించింది. టెండర్ల దాఖలకు నిర్దేశించిన గడువు శుక్రవారం మధ్యాహ్నం 3గంటలతో ముగిసింది. నిబంధనల ప్రకారం శుక్రవారమే సంస్థ ఎంపిక తేలాల్సి ఉన్నప్పటికీ.. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతితో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది.
ఆ కారణంగా దాఖలైన టెండర్లను అధికారులు శనివారం ఉదయం తెరవనున్నారు. వీటిలో మొదటగా టెక్నికల్ బిడ్‌లను తెరుస్తారు. వాటిలో ఏమైనా సాంకేతిక సమస్యలు ఉన్నాయా అని పరిశీలిస్తారు. ఆ తరువాత టెండర్ పత్రాలను ‘టెక్నికల్ ఎవాల్యుయేషన్ కమిటీ’కి పంపుతారు. నిబంధనల ప్రకారమే టెండర్లు దాఖలు చేశారా? లేదా అని కమిటీ పరిశీలిస్తుంది. అనంతరం సక్రమంగా ఉన్న టెండర్లను ఖరారు చేసి, ఆ టెండర్ల ఫైనాన్స్ బిడ్‌లను తెరుస్తారు. ఫైనాన్స్ బిడ్‌లను తెరిచిన తరువాత వాటిలో డీపీఆర్ తయారీ కోసం ఏ సంస్థ తక్కువ ధరను వేసిందో పరిశీలించి, ఆ సంస్థ టెండర్‌ను ఖరారు చేయనున్నారు.