Share News

Kameshwar Rao: ప్రముఖ కవి సుమనశ్రీ కన్నుమూత

ABN , Publish Date - Oct 03 , 2024 | 04:54 AM

ప్రముఖ కవి, విమర్శకుడు, కథకుడు, తెలుగు సాహిత్యలోకానికి సుమనశ్రీగా సుపరిచితుడైన చెళ్ళపిళ్ళ కామేశ్వరరావు (77) కన్నుమూశారు.

Kameshwar Rao: ప్రముఖ కవి సుమనశ్రీ కన్నుమూత

  • మరణ వార్త ఆలస్యంగా వెలుగులోకి సాహిత్య లోకానికి భావకవిగా పరిచయం

  • మెకానికల్‌ ఇంజనీరింగ్‌లోనూ విశిష్ట సేవలు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రముఖ కవి, విమర్శకుడు, కథకుడు, తెలుగు సాహిత్యలోకానికి సుమనశ్రీగా సుపరిచితుడైన చెళ్ళపిళ్ళ కామేశ్వరరావు (77) కన్నుమూశారు. ఏపీలోని విశాఖలో స్థిరపడిన ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతూ సెప్టెంబరు 12న తుదిశ్వాస విడిచారు. సాహిత్య లోకంతో సుమనశ్రీ కుటుంబానికి పెద్దగా పరిచయం లేకపోవడంతో ఆయన మరణవార్త ఆలస్యంగా బుధవారం తెలిసింది. సుమనశ్రీ స్వస్థలం నరసరావుపేట. అక్కడే డిగ్రీ వరకు, తర్వాత అనంతపురంలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ (బీఈ) చదివారు. అదే సబ్జెక్టులో ఆంధ్రా యూనివర్సిటీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, పీహెచ్‌డీ చేశారు. తాను చదివిన విశ్వవిద్యాలయంలో ఏడేళ్లు అధ్యాపకుడిగా పనిచేశారు. హైదరాబాద్‌ బీహెచ్‌ఈఎల్‌లో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా 2003లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్నారు.


ఆనాటి నుంచి పలు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రొఫెసర్‌గా 2018 వరకు సేవలందించారు. కెనడాలోని అట్టావా వర్సిటీలోనూ విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా మూడేళ్లు పనిచేశారు. సాహిత్య జీవితానికొస్తే, సుమనశ్రీ తండ్రి పద్యకవి బంగారేశ్వరశర్మ ప్రోత్సాహంతో 1965 నుంచి కలం పట్టారు. ‘గీతం పునీతమౌతుంది’, ‘రెప్పల మధ్య ఆకాశం’, ‘రక్తనేత్రోదయం’, ‘మహాస్వప్నం’, ‘నేత్రం నా సంకేతం’ తదితర కవితా సంపుటాలు, మరికొన్ని కథలు పుస్తకాలుగా వెలువడ్డాయి. అజంతా కవిత్వంపై విశ్లేషణాత్మక వ్యాసాలు ‘అజంతా లిపి’, ఆధునిక కవిత్వంపై వ్యాసాలు ‘కవిత్వం ఒక ఆత్మఘోష’ ప్రచురితమయ్యాయి. సుమనశ్రీకి భార్య రమణశ్రీ, ఇద్దరు కుమారులు హేమచంద్రకుమార్‌, సురేశ్‌బాబు ఉన్నారు. కుమారులు అమెరికాలో స్థిరపడ్డారు. విశాఖలోని అక్కయ్యపాలెం శ్మశానవాటికలో సెప్టెంబరు 15న సుమనశ్రీ అంత్యక్రియలు ముగిశాయి. పలువురు కవులు, రచయితలు ఆయన మృతికి సంతాపం తెలిపారు.

Updated Date - Oct 03 , 2024 | 04:54 AM