Share News

Hyderabad: ఆగని ప్రీ లాంచ్‌ దందా..

ABN , Publish Date - May 25 , 2024 | 05:26 AM

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రీ లాంచ్‌ దందాలు ఆగట్లేదు. కొన్ని సంస్థలు ‘ప్రీలాంచ్‌’ పేరిట ఆకర్షణీయమైన ఆఫర్లతో వల వేసి.. సొంతింటి కలగనేవారిని నిలువునా మోసం చేస్తున్నాయి. ఈ మోసాలకు మధ్యతరగతివారే ఎక్కువగా సమిధలవుతున్నారు. పైసా పైసా పోగు చేసి కూడబెట్టిన సొమ్మును.. రియల్‌ ఎస్టేట్‌ సంస్థల చేతుల్లో పోసి నట్టేట మునుగుతున్నారు.

Hyderabad: ఆగని ప్రీ లాంచ్‌ దందా..

  • నమ్మించి వంచిస్తున్న రియల్‌ సంస్థలు

  • రూ.కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తేస్తున్న వైనం

  • భూముల కొనుగోలులోనూ గొలుసు కట్టు స్కీంలు

  • మరిన్ని రాయితీలు ఇస్తామని ఆకర్షించే యత్నాలు

  • నమ్మి సమిధలవుతున్న మధ్యతరగతి కుటుంబాలు

  • రెరా వచ్చినా.. గత ఏడేళ్లలోకఠిన చర్యలు కరువు

  • ప్రజలు మోసపోయాక తీరిగ్గా కేసులు.. అరెస్టులు

  • నెల, రెండు నెలల్లోగా.. అక్రమార్కులు బయటకు!

  • బాధితులు నిలదీస్తే కోర్టులో తేల్చుకోవాలని సలహా

(హైదరాబాద్‌ సిటీ- ఆంధ్రజ్యోతి)

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రీ లాంచ్‌ దందాలు ఆగట్లేదు. కొన్ని సంస్థలు ‘ప్రీలాంచ్‌’ పేరిట ఆకర్షణీయమైన ఆఫర్లతో వల వేసి.. సొంతింటి కలగనేవారిని నిలువునా మోసం చేస్తున్నాయి. ఈ మోసాలకు మధ్యతరగతివారే ఎక్కువగా సమిధలవుతున్నారు. పైసా పైసా పోగు చేసి కూడబెట్టిన సొమ్మును.. రియల్‌ ఎస్టేట్‌ సంస్థల చేతుల్లో పోసి నట్టేట మునుగుతున్నారు. పలు సంస్థలు ఇలా కోట్లాది రూపాయలు దండుకుని ఆనక బిచాణా ఎత్తేస్తున్నాయి. స్థిరాస్తి రంగంలో మోసాలను అరికట్టేందుకుగాను.. ‘రియల్‌ ఎస్టేట్‌ యాక్ట్‌-2016’కు అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం 2017లో రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేషన్‌ ఆథారిటీ (రెరా) నిబంధనలతో ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకూ రెరా ఆధ్వర్యంలో చేపట్టిన చర్యలు అరకొరగానే ఉన్నాయి. తక్కువ ధరకే ఫ్లాట్‌ అంటూ ఇటీవల మధ్య తరగతి కుటుంబాల నుంచి రూ.60 కోట్ల మేర వసూళ్లు చేసి బిచాణా ఎత్తేసిన ‘భారతి బిల్డర్స్‌’ రెరా దృష్టిలో పడకపోవడం గమనార్హం.


కరోనా తర్వాత..

కరోనా సమయంలో నగరాలు, పట్టణాల్లో అద్దె ఇళ్లల్లో నివసించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనా సోకితే ఇంటి యజమానులు వారిని నిర్దాక్షిణ్యంగా గెంటేసిన ఘటనలూ జరిగాయి. దీంతో.. చాలామంది మధ్యతరగతివారు సొంతింటి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎక్కడ తక్కువ ధరకు దొరికితే అక్కడ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. ధర తక్కువగా పెడితే సామాన్య, మధ్యతరగతి ప్రజలు అడ్వాన్సులు ఇస్తారనే విషయం అనేకమంది రియల్టర్లకు అర్థమైంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ఇతర రంగాలకు చెందినవారు సైతం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. పలువురు స్థల యజమానులు సైతం డెవలపర్లుగా అవతారమెత్తారు. తమ దగ్గర ఉన్న స్థలాన్ని చూపించి భారీ ప్రాజెక్టును తీసుకొస్తున్నామని ఆఫర్లు ప్రకటించారు. సోషల్‌ మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేశారు. కోట్లాది రూపాయలు ప్రజల నుంచి ముందుగా వసూలు చేసి ఆపై చేతులెత్తేశారు. ఉదాహరణకు.. హైదరాబాద్‌ శివారులో అమీన్‌పూర్‌ దగ్గర 23 ఎకరాల్లో భారీ ప్రాజెక్టు అంటూ ‘సాహితీ ఇన్ర్ఫా’ కంపెనీ విస్తృతంగా ప్రచారం చేసింది. ఆరు టవర్లు.. పది టవర్లు నిర్మిస్తామంటూ ఆకర్షణీయమైన ప్రకటనలు చేసింది. భారీ ఎత్తున ప్లాటన్లు విక్రయించింది. ప్రీ లాంచ్‌లో 1200 మందికి పైగా కస్టమర్లు ఫ్లాట్‌ కొనుగోలు చేశారు. 2023 మార్చినాటికి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన సాహితీ ఇన్ర్ఫా.. ఇప్పటికీ ప్రాజెక్టును ప్రారంభించనేలేదు.


అసలు నిర్మాణమే చేపట్టకపోగా.. భూమిని సైతం అమ్మేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంతో బాధితులు పోలీ్‌సస్టేషన్‌ మెట్లు ఎక్కారు. దాంతో సాహితీ ఇన్ర్ఫాటెక్‌ ఎండీ లక్ష్మీనారాయణ జైలుకెళ్లారు. కానీ పైసా పైసా పొగు చేసి డబ్బులు చెల్లించిన మధ్య తరగతి కుటుంబాలు మాత్రం రోడ్డున పడ్డాయి. మరో ఉదాహరణ చూస్తే.. ఏపీలోని రేణిగుంటకు చెందిన ఓబిలి హౌసింగ్‌ అనే సంస్థ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపురం గ్రామంలో హైవే ప్యారడైజ్‌ పేరుతో ప్రీలాంచ్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద గజం వెయ్యి రూపాయలకే ఇస్తామంటూ బ్రోచర్లను పంచిపెట్టింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలో, ఐఐటీ కందికి చేరువలోనే ప్రాజెక్టు అంటూ ఊదరగొట్టింది. తక్కువ ధరకే ఓపెన్‌ ప్లాట్‌ వస్తుండడంతో పలువురు పెద్దఎత్తున కొనుగోలు చేశారు. ఇలా దాదాపు 50 మంది నుంచి రూ.15 కోట్ల వరకు వసూలు చేసిన ఓబిలి సంస్థ.. ప్లాట్ల కేటాయింపులు చేయలేదు. బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఓబిలి హౌసింగ్‌ ఎండీ పాపన్నగారి రామచంద్రారెడ్డిని సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ పోలీసులు 15 రోజుల క్రితం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే.. నగరంలోని హఫీజ్‌పేట్‌ సర్వే నెంబర్‌ 80 పరిధిలోని భూములు వివాదంలో ఉన్నాయి. ఈ భూములపై ప్రభుత్వానికి, కొందరు ప్రైవేటు వ్యక్తుల మధ్య సుప్రీం కోర్టులో కేసు ఉంది. ఈ విషయం అక్కడి నివాసితులకు, అధికారులకు, రాజకీయ నాయకులకు మాత్రమే తెలుసు. చాలా మందికి వివాద భూములని తెలియకపోవడంతో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ.. అక్కడ 35 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నట్టు బ్రోచర్‌ విడుదల చేసింది. ప్రీలాంచ్‌ ఆఫర్‌ కింద చదరపుటడుగు ధర కేవలం రూ.4500గా పెట్టింది. రెండు వారాల్లో వంద శాతం సొమ్ము చెల్లిస్తేనే ఆఫర్‌ వర్తిస్తుందని షరతు కూడా విధించింది. ఆ భూమి న్యాయపరమైన చిక్కుల్లో ఉందనే విషయం తెలుసుకోకుండా.. కొందరు దాంట్లో పెట్టుబడి పెడుతుండడం గమనార్హం.


గొలుసుకట్టు స్కీములు..

కొన్ని సంస్థలైతే ప్రీలాంచ్‌ ఆఫర్ల పేరుతో గొలుసుకట్టు స్కీములను ప్రొత్సహిస్తున్నాయి. ప్రధానంగా.. యాదాద్రి, సంగారెడ్డి, షాద్‌నగర్‌ ప్రాంతాల్లో.. నిరుద్యోగులకు ఉపాధి కల్పన పేరుతో భారీ దందాలు చేస్తున్నాయి. చదరపు గజం రూ.10వేలు పలికే ప్రాంతంలో రూ.6666, రూ.5999లకే చదరపు గజం అని, 120 చదరపు గజాలు కేవలం రూ.6 లక్షలకే అని.. ఆకర్షిస్తూ ప్రకటనలు చేస్తున్నాయి. ప్రీలాంచ్‌ పేరుతో వంద శాతం పేమెంట్‌ జరపాలనే షరతులు విధిస్తున్నాయి. ఒక్కసారి మొత్తాన్ని చెల్లిస్తే ఆఫర్‌ వర్తిస్తుందని చెబుతున్నాయి. అంతేకాక.. తమతో పాటు మరొకరిద్దరితో కొనుగోలు చేయిస్తే రాయితీలు ఇస్తామంటూ ఆకర్షిస్తున్నాయి. ఆ ఆఫర్లను చూసి పేద, మధ్య తరగతి కుటుంబాలవారు తమ బంధుమిత్రులను కూడా కొనుగోళ్లకు ప్రేరేపిస్తున్నారు.


రెరా కఠిన చర్యలు చేపడితేనే..

రెరా ఏర్పడి ఏడేళ్లు గడుస్తున్నా.. ప్రీలాంచ్‌ దందా చేస్తున్న సంస్థలపై తీసుకున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, డెవలపర్లు యథేచ్ఛగా అక్రమ దందాలు నిర్వహిస్తున్నా.. రెరా ఉలుకూపలుకూ లేకుండా నిద్రమత్తులో తూగుతోంది. దీనిపై విమర్శలు రావడంతో.. ఏడాదిన్నర క్రితం పూర్తిస్థాయిలో ఓ ఐఏఎస్‌ అధికారి, ఇద్దరు సభ్యులతో రెరా కమిటీ ఏర్పాటు చేసినా.. అదిగత ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా పని చేసిందనే ఆరోపణలున్నాయి. అయితే.. ఎన్నికలకు ముందు రెరా ఒక్కసారిగా 13 రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు, ప్రముఖ సంస్థలో పని చేసే రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లకు నోటీసులివ్వడం చర్చనీయాంశమైంది. నోటీసులు అందుకున్న సంస్థల్లో కొత్త రియల్‌ కంపెనీలతోపాటు బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ వంటి సంస్థలు ఉండటం గమనార్హం. నీమ్స్‌ బోరో గ్రూప్‌, ఎక్సలెన్స్‌ ప్రాపర్టీస్‌, సనాలి గ్రూప్‌, అర్బన్‌ యార్డ్స్‌, హ్యాపీ డ్రీమ్‌ హోమ్స్‌, విరతా డెవలపర్స్‌, రి వెండల్‌ ఫామ్స్‌, కావూరి హిల్స్‌, సెవెన్‌ హిల్స్‌, బిల్డాక్స్‌ రియల్‌ ఎస్టేట్స్‌, సుమధుర ఇన్ర్ఫా ప్రాజెక్ట్‌.. ఇలా పలు సంస్థలు నోటీసులు అందుకున్నాయి.


కానీ.. ఇటీవల మధ్య తరగతి కుటుంబాలను దాదాపు రూ.60 కోట్ల మేర ముంచేసిన భారతి బిల్డర్స్‌ అనే సంస్థ ఎలాంటి నోటీసూ అందుకోకపోవడం గమనార్హం. ఆ సంస్థ కొంపల్లిలో 6.23ఎకరాల్లో ‘భారతి లేక్‌ వ్యూ’ పేరుతో ప్రాజెక్టును ప్రకటించి చదరపు అడుగుకు రూ.5వేలకు పైగా పలికేచోట కేవలం రూ.3200లకే చ.అడుగు అంటూ బురిడీ కొట్టించింది. కాగా.. ప్రీలాంచ్‌ ఆఫర్లతో మోసం చేసేవారిని పోలీసులు అరెస్ట్‌ చేసి, చీటింగ్‌ కేసు నమోదు చేసి జైలుకు పంపినా.. నెల, రెండు నెలలకు వారు తమ పలుకుబడితో బయటకు వస్తున్నారు. బాధితులకు మాత్రం సొమ్ము తిరిగిరావట్లేదు. తమ డబ్బు తమకు ఇవ్వాలని వారు ఆయా సంస్థల నిర్వాహకులను కోరితే.. వారు కోర్టులో తేల్చుకుందామంటున్నారు. తమ దగ్గరకు రావొద్దని కరాఖండిగా చెబుతున్నారు. దీంతో... కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక, ఆర్థిక సామర్థ్యం లేని మధ్యతరగతి జీవులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రీలాంచ్‌ల పేరుతో మోసం చేసిన సంస్థలు, ఏజెంట్ల నుంచి బాధితుల సొమ్మును రాబట్టే విధంగా రెరా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


కఠినంగా వ్యవహరించాలి

ఇల్లు లేదా ఫ్లాట్‌ కొనాలనుకునేవారు రెరా రిజిస్ట్రేషన్‌ కలిగిన ప్రాజెక్టులోనే కొనాలి. ప్రీలాంచ్‌ ఆఫర్లను నమ్మి.. రెరా రిజిస్ట్రేషన్‌ లేని ప్రాజెక్టుల్లో కొనకూడదని ఎంతగా చెప్పినా చాలా మంది వినియోగదారులు పట్టించుకోవట్లేదు. తక్కువ ధరకు వస్తుందనగానే వెనుకా ముందూ చూడకుండా డబ్బులు చెల్లిస్తున్నారు. కనీసం ఆ సంస్థ నేపథ్యం గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. కాబట్టి.. ఇలాంటి దందాలను అరికట్టాలంటే ప్రీలాంచ్‌ పేరుతో మోసం చేసే సంస్థల పట్ల ప్రభుత్వం, రెరానే కఠినంగా వ్యవహరించాలి.

- రాజశేఖర్‌ రెడ్డి,

క్రెడాయ్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు


ఆఫర్లను చూసి మోసపోవద్దు

ప్రీలాంచ్‌ ఆఫర్లను చూసి ప్రజలు మోసపోకూడదు. రెరా అనుమతులు పొందిన ప్రాజెక్టుల్లోనే కొనుగోలు చేయాలి. రియల్‌ ఏస్టేట్‌ వ్యాపారంలో పారదర్శకత ఉండాలి.

- ఎం.విజయసాయి, నారెడ్కో అధ్యక్షుడు


భూముల విలువ తెలుసుకొనేందుకు క్షేత్ర స్థాయి పర్యటనలు

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో స్థిరాస్తుల మార్కెట్‌ విలువలను పెంచే దిశగా ఒక అడుగు ముందుకు పడింది. పెంపు మార్గదర్శకాలను రూపొందించడానికి కేంద్రీయ విలువల సలహా మండలి సమావేశమైంది. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ అధ్యక్షతన ఈ కమిటీ సమావేశం జరిగింది. పట్టణాల సమీపంలోని గ్రామీణ ప్రాంతాలు, అవుటర్‌ రింగ్‌రోడ్డు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు, నివాసాలు, వ్యాపార సముదాయాలు తదితర స్థిరాస్తుల విలువలను పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని కమిటీ నిర్ణయించింది.


రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో పేర్కొనే మార్కెట్‌ విలువలకు బహిరంగ మార్కెట్‌ విలువలకు మధ్య వ్యత్యాసం తెలుసుకొనేందుకు క్షేత్ర పర్యటనలు తప్పనిసరి అని అభిప్రాయపడింది. 2013 తర్వాత కేంద్రీయ కమిటీ సమావేశం కావడం ఇదే ప్రథమం. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2021 జులై, 2022 ఫిబ్రవరిలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ మార్కెట్‌ విలువను సవరించినపుడు క్షేత్రస్థాయి పర్యటనలు చేయలేదు. పాత విలువలను పరిగణనలోకి తీసుకొని పైన కొంతశాతం చేర్చి పెంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈసారి శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌ విలువ భారీగా ఉండి, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో పేర్కొనే మార్కెట్‌ విలువ బాగా తక్కువగా ఉంటే ఆ వ్యత్యాసాన్ని తొలగిస్తారు. ఈ క్రమంలో సబ్‌ రిజిస్ట్రార్‌ పరిధిలోకమిటీల అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటారు.

Updated Date - May 25 , 2024 | 05:26 AM