Share News

Ponguleti: 4 సంవత్సరాల్లో 20లక్షల గృహాలు

ABN , Publish Date - Dec 27 , 2024 | 04:22 AM

రాబోయే 4 సంవత్సరాల్లో పేదలకు 20లక్షల గృహాలు మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.

Ponguleti: 4 సంవత్సరాల్లో 20లక్షల గృహాలు

  • ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు

  • 40లక్షల గృహాలు సర్వే చేసి రికార్డు చేశాం

  • సంక్రాంతికి 4.50 లక్షల ఇళ్లను మంజారు చేస్తాం

  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి

దమ్మపేట, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): రాబోయే 4 సంవత్సరాల్లో పేదలకు 20లక్షల గృహాలు మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 80లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలపరిషత్‌ కార్యాలయ ఆవరణలో నిర్మించనున్న ఇందిరమ్మ మోడల్‌ గృహానికి మంత్రి గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరతామన్నారు.ఇందిరమ్మ గృహాల కోసం రూపొందించిన ప్రత్యేక యాప్‌లో 10రోజులుగా సర్వే చేస్తున్నారని, ఇప్పటి వరకు సుమారుగా 40లక్షల గృహాలు యాప్‌ ద్వారా సర్వే చేసి రికార్డు చేశామన్నారు. సంక్రాంతి పర్వదినానికి తొలి విడతగా 4.50 లక్షల ఇళ్లను మంజారు చేస్తామని, ప్రతి నియోజకవర్గానికి 3500 గృహాలు కేటాయిస్తామని తెలిపారు. అంతకు ముందు నాచారం, గన్నేపల్లి గ్రామాలలో రూ. 20లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాలను ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం దమ్మపేట తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.


మహిళా కూలీలతో పొంగులేటి మాటామంతీ

అశ్వారావుపేట మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గురువారం కేశప్పగూడెం సమీపంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ములకలపల్లి వెళ్తుండగా మార్గమధ్యంలో వేరుశెనగచేనులో పనిచేస్తున్న కూలీలను చూసి వారి దగ్గరకు వెళ్లారు. ‘అక్కల్లారా చెల్లెమ్మల్లారా బాగున్నారా... మీకు సొంత ఇళ్లు ఉన్నాయా..’ అంటూ పలకరించారు. ‘ఇంతకీ నేనెవరో తెలుసా? మీ ఇంట్లో వాచీలో బొమ్మ ఉంటుంది గుర్తు పట్టారా...?’ అంటూ కూలీలను పకలరించారు. ఇందుకు వారు స్పందిస్తూ ‘తెలుసు, మీరు మంత్రి శ్రీనన్న..’ అని బదులిచ్చారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ‘గాజులు వేయించుకోండి...’ అంటూ వారికి కొంత నగదు ఇచ్చి ముందుకు కదిలారు.

Updated Date - Dec 27 , 2024 | 04:22 AM