Share News

Kamareddy: ఆత్మహత్యపై శ్రుతి, నిఖిల్‌ వాట్సాప్‌ చాటింగ్‌!

ABN , Publish Date - Dec 29 , 2024 | 04:27 AM

కామారెడ్డి జిల్లాలో భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌, బీబీపేట మహిళా కానిస్టేబుల్‌ శ్రుతి, బీబీపేట సొసైటీ కంప్యూటర్‌ ఆపరేటర్‌ నిఖిల్‌ మూకుమ్మడి ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Kamareddy: ఆత్మహత్యపై శ్రుతి, నిఖిల్‌  వాట్సాప్‌ చాటింగ్‌!

మూకుమ్మడి ఆత్మహత్యల కేసులో మృతుల కాల్‌ డేటా, వాట్సాప్‌లో కీలక విషయాలు!

  • ప్రేమ వ్యవహారమే కారణమని అంచనా

  • సాయికుమార్‌, నిఖిల్‌ కలిసి కామారెడ్డి బస్టాండ్‌కు..

  • శ్రుతిని పికప్‌ చేసుకుని చెరువు వద్దకు

  • ఘటనా స్థలం వద్ద సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌

కామారెడ్డి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లాలో భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌, బీబీపేట మహిళా కానిస్టేబుల్‌ శ్రుతి, బీబీపేట సొసైటీ కంప్యూటర్‌ ఆపరేటర్‌ నిఖిల్‌ మూకుమ్మడి ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మృతుల ఫోన్‌కాల్స్‌, వాట్సాప్‌ చాటింగ్‌ ద్వారా పోలీసులకు ప్రాథమికంగా లభ్యమైన కీలక అంశాల ఆధారంగా ఆత్మహత్యలపై శనివారం సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. ఘటనా స్థలమైన అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువును దర్యాప్తు బృందం పరిశీలించింది. చెరువు వద్దకు సాయికుమార్‌, శ్రుతి, నిఖిల్‌ ఏ సమయంలో చేరుకున్నారు? మొదట చెరువులోకి ఎవరు దూకారు? అనే దానిపై దర్యాప్తు బృందం సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసింది. చెరువు నుంచి నీటి నమూనాలు సేకరించింది. ఆ తర్వాత బీబీపేట, భిక్కనూరు పోలీస్‌ స్టేషన్లకు వెళ్లింది.


అక్కడి సిబ్బందిని విచారణ చేసింది. అక్కడా సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసింది. ఈ దర్యాప్తులో పలు కీలకాంశాలు తెలిసినట్లు సమాచారం. ఈ నెల 25న ఉదయం 11.45 గంటల సమయంలో సాయికుమార్‌ సొంత కారులో భిక్కనూరు టోల్‌గేట్‌ నుంచి కామారెడ్డి వైపు రావడాన్ని పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో కారులో అతను ఒక్కడే ఉన్నాడు. జంగంపల్లిలోని ఓ దాబా వద్ద కారు ఆపాడు. అదే ప్రాంతంలో నిఖిల్‌ బైక్‌ నిలిపి ఉన్నట్లు గుర్తించారు. వీరిద్దరూ కలిసి కారులో కామారెడ్డి బస్టాండ్‌కు వెళ్లి... శ్రుతిని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలను బస్టాండ్‌ సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీ నుంచి పోలీసులు సేకరించారని సమాచారం. వీరు ఆ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువుకు చేరుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.


ముగ్గురి కాల్‌ డేటా పరిశీలన

మృతుల ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని ఐటీ నిపుణుల సహాయంతో ఓపెన్‌ చేశారు. ముగ్గురు మృతుల కాల్‌డేటాను సేకరించి, సంభాషణను దర్యాప్తు బృందం పరిశీలించినట్లు తెలిసింది. ఆత్మహత్యకు ముందు కొన్ని రోజులుగా శ్రుతి, నిఖిల్‌ ఫోన్‌లో గంటల కొద్దీ మాట్లాడే క్రమంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యపై శ్రుతి, నిఖిల్‌ ముందుగానే వాట్సా్‌పలో చాటింగ్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. వీరి ఆత్మహత్యలకు ప్రేమ, పెళ్లి ప్రధాన కారణమని ఫోన్‌ కాల్స్‌, వాట్సాప్‌ చాటింగ్‌ ఆధారంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆత్మహత్యకు ముందే శ్రుతి, నిఖిల్‌ ఓ ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. ఇందులోకి ఎస్సైను కూడా లాగినట్లు ప్రచారం జరుగుతోంది.


అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువు వద్ద కారులో మాట్లాడుకుంటుండగానే నిఖిల్‌, శ్రుతి చెరువు గట్టువైపు వెళ్లి చెరువులో దూకారని, వారిని కాపాడే ప్రయత్నంలో సాయికుమార్‌ కూడా చెరువులో దూకాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. వీరు దూకిన చోట 15 మీటర్ల వరకు లోతు ఉండడం, పిచ్చిమొక్కలు, తీగల్లో ఇరుక్కుపోయి మృతిచెందారని పోలీసులు భావిస్తున్నారు. నిఖిల్‌ స్నేహితులను సైతం ఆరా తీశారు. వారితో నిఖిల్‌ ఎప్పుడైనా శ్రుతితో ప్రేమ వ్యవహారం, ఎస్సైతో ఉన్న సంబంధాలపై చర్చించాడా? అని విచారణ చేస్తున్నారు.

Updated Date - Dec 29 , 2024 | 04:27 AM