Deputy CM Pawan Kalyan: గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారు
ABN , Publish Date - Dec 31 , 2024 | 03:32 AM
హైదరాబాద్‌లో సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 బెనిఫిట్‌షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరె్‌స్టపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మొదటిసారి స్పందించారు.

తొక్కిసలాట జరగడం బాధాకరం
అల్లు అర్జున్ తరఫున వెంటనే బాధితులను పరామర్శించాల్సింది
క్షమాపణలు చెప్పి ఉంటే బాగుండేది
సమస్య పెద్దది అయ్యేది కాదు
రేవంత్‌రెడ్డి కక్షసాధింపులకు పోలేదు
పరిష్కారంలో సినిమా టీమ్ ఫెయిల్
హీరోను ఒంటరి వ్యక్తిని చేశారు
సంధ్య థియేటర్ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు
అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 బెనిఫిట్‌షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరె్‌స్టపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మొదటిసారి స్పందించారు. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తీసుకువచ్చారని వ్యాఖ్యానించారు. చట్టం అందరికీ సమానమేనని అన్నారు. సంఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ తరఫున బాధితుల కుటుంబం వద్దకు వెళ్లి ఉంటే బాగుండేదన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైసీపీ విధానాల తరహాలో వ్యవహరించలేదన్నారు. రేవంత్ రెడ్డి గట్టి నాయకుడని, కిందిస్థాయి నుంచి ఎదిగారని ప్రశంసించారు. సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. ‘‘అల్లు అర్జున్ థియేటర్‌కు వెళ్లే ముందు తగిన ఏర్పాట్లు చేసుకుని ఉండాల్సింది.
హీరో అభివాదం చేయకపోతే పొగరని అనుకుంటారు. అభివాదం చేయడం ఎంజాయ్ చేయడం కాదు.. అభిమానులకు భరోసా కల్పించడం. తొక్కిసలాట ఘటన బాఽధాకరమైనది. అల్లు అర్జున్ థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు ఆయనకు సిబ్బంది చెప్పి ఉండాల్సింది. సంఘటన జరిగిన వెంటనే బాధితుల కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి వారిని ఓదార్చాల్సిన అవసరం ఉంది. హీరో తరఫున ఎవరో ఒకరు వెళ్లి ఉంటే సమస్య పెద్దది అయ్యేది కాదు. మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయిందని చెప్పి, క్షమాపణలు కోరాల్సింది. ఓదార్చే సమయంలో ఒక్కసారి మనం తిట్లు కూడా తినాల్సి వస్తుంది. సినిమా నిర్మాత, డైరెక్టర్ పరామర్శించ లేదు. అదే పెద్ద లోపంగా కనిపిస్తోంది. ఎక్కడో మానవతా దృక్పథం లోపించింది. సమస్య పరిష్కారంలో టీమ్ ఫెయిలైంది. కేవలం హీరోపై నిందలు వేయడం కూడా కరెక్టు కాదు. సినిమానే కాదు సమస్యనూ టీమ్‌గా తీసుకోవాలి. సమస్యను హీరోపై పెట్టి ఒంటరి వ్యక్తిని చేసేశారు. అది కరెక్టుగా అనిపించలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్‌ను ఎవరూ సరిగా గైడ్ చేయలేదు’’ అని పవన్ అన్నారు.
రేవంత్ కక్షసాధింపులకు పోలేదు
‘సినిమా చూడడానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం బాఽధాకరం. పోలీసులను మనం ప్రశ్నించలేం. అల్లు అర్జున్ విషయంలో ముందు, వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. నేను థియేటర్‌కు వెళ్లను. నా మూడో సినిమా నుంచి థియేటర్‌కు వెళ్లడం మానేశాను. చిరంజీవి కూడా ముసుగు వేసుకుని సినిమా థియేటర్‌కు వెళ్లేవారు. అభిమానులు భారీ వస్తారు కాబట్టి, హీరో థియేటర్‌కు వెళ్లే సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. చట్టం అమలులో ఒక్కొక్కరికి ఒకలా ఉండకూడదు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన తర్వాత సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించారు. అక్కడ ఎవరున్నా రేవంత్‌రెడ్డి అలానే చేసేవారు. ఆయన పేరు చెప్పలేదని అంటున్నారు. అది చాలా చిన్న రీజన్. రేవంత్ రెడ్డి ఆ సినిమాకు అన్ని రకాలుగా సహకరించారు. బెనిఫిట్ షోకు అవకాశం కల్పించారు. టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. జగన్‌లా నిలిపేసి, కక్షసాధింపు చేయలేదు. సంఘటన ఎవరి చేతుల్లో లేకుండా పోయింది. పోలీసుల నుంచి రేవంత్‌రెడ్డికి ప్రశ్నలు తలెత్తుతాయి. ఇప్పుడు ఉపేక్షిస్తే రేపు మాకు సమస్య వస్తుందని అంటారు. అల్లు అర్జున్ మామ కూడా కాంగ్రెస్ వ్యక్తి. అల్లు అర్జున్, రామ్‌చరణ్, రాణా.. వీరంతా రేవంత్‌రెడ్డి చుట్టుపక్కల తిరిగిన వారే. రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో మాకు తెలుసు. రేవంత్ వీరందరికి సూపర్ సీనియర్. ఇది అనుకోకుండా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కూడా సున్నితంగా వెళ్లి ఉండవచ్చునని కొందరు అనుకుంటారు’ అని పవన్ అన్నారు.
క్రమశిక్షణ ఉండాలి
‘సినిమా పరిశ్రమ పని విధానం మార్చుకోవాలి. క్రమశిక్షణ, స్థిరత్వం ఉండాలి. తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన కవుల గురించి ఎంతమందికి అవగాహన ఉంది? సినీ పరిశ్రమ వల్ల భారీ ఆదాయం వస్తుంది. ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంది. పర్యాటక శాఖకు పరిశ్రమ హోదా కల్పించాం. అలానే సినిమా పరిశ్రమకు హోదా రావాలంటే కొన్ని మార్పులు జరగాలి. దీనిపై అందరూ ఆలోచించాలి. మంచి సినిమాలు రావాలంటే మౌలిక సదుపాయాలు ఉండాలి. స్టోరీ, కల్చర్ గురించి చెప్పే సినీ పాఠశాలలు ఏపీలో ఏర్పాటు చేయాలి’ అని పవన్ అన్నారు.