Share News

Huzurnagar: 40 అడుగుల బావిలో.. 2 గంటల వేదన!

ABN , Publish Date - Jun 11 , 2024 | 04:05 AM

అసలే వయసు పైబడింది.. ఆపై కళ్లు సరిగా కనిపించవు.. రాత్రిపూట బయటికొచ్చిన ఓ వృద్ధురాలు ఇంటి ఆవరణలోని బావిలో పడిపోయింది. దాదాపు 2 గంటల పాటు నరకయాతన అనుభవించింది.

Huzurnagar: 40 అడుగుల బావిలో.. 2 గంటల వేదన!

  • కళ్లు కనపడక బావిలో పడిన వృద్ధురాలు

  • ప్రాణాలకు తెగించి కాపాడిన యువకుడు

హుజూర్‌నగర్‌, జూన్‌ 10: అసలే వయసు పైబడింది.. ఆపై కళ్లు సరిగా కనిపించవు.. రాత్రిపూట బయటికొచ్చిన ఓ వృద్ధురాలు ఇంటి ఆవరణలోని బావిలో పడిపోయింది. దాదాపు 2 గంటల పాటు నరకయాతన అనుభవించింది. ఆమెను బయటకు తీసేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో.. చివరికి ఓ యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడాడు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గౌరిపెద్ది కనకదుర్గ (70) గాంధీ పార్కు సెంటర్‌లో నివాసముంటోంది. భర్త ప్రసాద్‌ ఆరేళ్ల క్రితం మృతి చెందగా, వారికి పిల్లలు లేరు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న కనకదుర్గ ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఇంటి ఆవరణలో ఉన్న 40 అడుగుల లోతున్న నీళ్లు లేని బావిలో పడి కేకలు వేసింది.


చుట్టుపక్కల వారు అది విని 108కి ఫోన్‌ చేశారు. పోలీసులు ఆగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం అందించడంతోఅంతా అక్కడికి చేరుకున్నారు. అయితే, బావిలోని కనకదుర్గను బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గోవిందపురం కాలనీకి చెందిన గోపి సాహసం చేసి వృద్ధురాలిని కాపాడేందుకు బావిలోకి దిగాడు. పోలీసులు ఒక కుర్చీకి తాడు కట్టి బావిలోకి వేయగా కనకదుర్గను కుర్చీ మీద కుర్చోబెట్టి రెండువైపులా తాళ్లు కట్టి క్షేమంగా బయటికి తీశారు. వృద్ధురాలిని కాపాడిన గోపిని స్థానికులు అభినందించారు.

Updated Date - Jun 11 , 2024 | 04:05 AM