National Highway: రాష్ట్రంలోని జాతీయ రహదారులపై.. కేంద్ర, రాష్ట్ర అధికారుల సమీక్ష నేడు..?
ABN , Publish Date - Jul 09 , 2024 | 04:38 AM
రాష్ట్రంలో వివిధ దశల్లో ఉన్న జాతీయ రహదారుల ప్రాజెక్టులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రహదారుల శాఖ అధికారులు మంగళవారం సమీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం. ఈ మేరకు కేంద్రం నుంచి తెలంగాణకు ప్రత్యేక అధికారుల బృందం రానున్నట్టు తెలిసింది.
8 ఆర్‌ఆర్‌ఆర్, హైదరాబాద్-విజయవాడ రోడ్డు విస్తరణ..
8 మరికొన్ని జాతీయ ప్రాజెక్టులపై చర్చించే అవకాశం
హైదరాబాద్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వివిధ దశల్లో ఉన్న జాతీయ రహదారుల ప్రాజెక్టులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రహదారుల శాఖ అధికారులు మంగళవారం సమీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం. ఈ మేరకు కేంద్రం నుంచి తెలంగాణకు ప్రత్యేక అధికారుల బృందం రానున్నట్టు తెలిసింది. సమావేశంలో ప్రధానంగా రీజినల్ రింగ్ రోడ్డు ప్రస్తుత పరిస్థితి.. ఈ రహదారికి నేషనల్ హైవే నంబర్ కేటాయింపు, నిర్మాణ ఖర్చు, భూసేకరణ, పరిహారం అంశాలపై చర్చ జరగనుంది. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగం నిర్మాణానికి అవసరమైన భూసేకరణ దాదాపు 90శాతం పూర్తయిన నేపథ్యంలో రహదారి నిర్మాణానికి టెండర్లకు వెళ్లే అంశంపై కూడా అధికారుల బృందం చర్చించనున్నట్టు తెలిసింది. ఇక దక్షిణ భాగాన్ని కూడా జాతీయ రహదారిగా గుర్తించడంతో పాటు, దాని నిర్మాణానికి అవసరమైన డీపీఆర్, నిర్మాణ వ్యయం, ఈ భాగానికి నేషనల్ హైవే నంబర్ కేటాయింపు సహా మరికొన్ని అంశాలపై చర్చించనున్నారు.
హైదరాబాద్-విజయవాడ (ఎన్‌హెచ్-65) రహదారి విస్తరణకు సంబంధించిన టెండర్ల ప్రక్రియపై కూడా చర్చ జరగనుంది. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయి దాదాపు 7 ఏళ్లు అవుతోంది. దాని నిర్మాణం కోసం కొత్తగా టెండ్లను ఆహ్వానించాలని ఇటీవల కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఆహ్వానించాల్సిన టెండర్ల అంశంపై అధికారుల బృందం చర్చించనుంది. కాగా, రాష్ట్రానికి ఇప్పటికే మంజూరైనవి, మంజూరై నిర్మాణంలో ఉన్నవి, త్వరలో మంజూరు కాబోయేవి, డీపీఆర్ స్థాయిలో ఉన్నవి కలిపి మొత్తం 32 జాతీయ రహదారులు ప్రాజెక్టులున్నాయి. వీటన్నింటిపై అఽధికారుల బృందం చర్చించే అవకాశం ఉంది.