Nalgonda: నా భర్త పట్టించుకోవడం లేదు.. మమ్మల్ని చావనివ్వండి
ABN , Publish Date - Dec 31 , 2024 | 04:32 AM
ఆమె ఓ ఎస్సై భార్య. తన భర్తకు ఓ మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం ఉందని, దీనిపై ప్రశ్నిస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడని, ఇద్దరు పిల్లలతో కారుణ్య మరణానానికి అనుమతించాలంటూ రోడ్డు మీద ఫ్లెక్సీ పట్టుకొని పిల్లలతో కలిసి నిరసన వ్యక్తం చేసింది.

పిల్లలతో కలిసి టాస్క్‌ఫోర్స్ ఎస్సై భార్య నిరసన
నన్ను 2014లో పెళ్లి చేసుకున్నాడు : రెండోభార్య
నల్లగొండ క్రైం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆమె ఓ ఎస్సై భార్య. తన భర్తకు ఓ మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం ఉందని, దీనిపై ప్రశ్నిస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడని, ఇద్దరు పిల్లలతో కారుణ్య మరణానానికి అనుమతించాలంటూ రోడ్డు మీద ఫ్లెక్సీ పట్టుకొని పిల్లలతో కలిసి నిరసన వ్యక్తం చేసింది. ఆ ఎస్పై నల్లగొండ జిల్లా టాస్క్‌పోర్స్‌లో పనిచేస్తున్న జాల మహేందర్. ఆయన భార్య పేరు జ్యోతి. ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా కానిస్టేబుల్ పేరు సరిత. తన భర్తకు సరితతో వివాహేతర సంబంధం ఉందని, తమను పట్టించుకోవడం లేదని, తమను చనిపోయేందుకు అనుమతించాలని కోరుతూ సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ వద్ద ఫ్లెక్సీతో జ్యోతి నిరసన వ్యక్తం చేసింది. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్‌లను కలిసి తన భర్త వివాహేతర సంబంధంపై ఫిర్యాదు చేసింది.
తన స్వస్థలం నార్కట్‌పల్లి అని, తనకు, మహేందర్‌కు 2010లో పెళ్లయిందని.. తమకు కవలలు బాబు, పాప ఉన్నారని చెప్పింది. నాలుగేళ్ల క్రితం నుంచి భర్త తమను పట్టించుకోవడం లేదని, ఇంటికి కూడా రావడం లేదని వెల్లడించింది. తన ఆస్తులను ఆయన, సరిత పేరిట రాసిచ్చాడని ఇద్దరూ కలిసి తనను, తన పిల్లలను చంపుతామని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, న్యాయం చేస్తారనే ఆశతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానని జ్యోతి పేర్కొం ది. కాగా, సరిత.. సోమవారం ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి నల్లగొండలో విలేకరులతో మాట్లాడింది. భర్తతో విడాకులు తీసుకొని ఎస్సై మహేందర్‌ను 2014 ఏప్రిల్ 12న పెళ్లి చేసుకున్నానని చెప్పింది. జ్యోతి, ఆమె సోదరి రేవతి, కుటుంబ సభ్యులు కులం పేరుతో దూషించారని.. పలుమార్లు రౌడీలతో బెదిరింపులకు కూడా పాల్పడ్డారని ఆరోపించింది.