Share News

Mahbubabad: ఫుడ్‌ పాయిజన్‌ వెనుక బీఆర్‌ఎస్‌ కుట్ర :సీతక్క

ABN , Publish Date - Nov 30 , 2024 | 03:37 AM

ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఆహార కల్తీ వెనుక పెద్దకుట్ర జరుగుతోందని, రాజకీయం కోసం విద్యార్థులను బలి తీసుకునేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు.

Mahbubabad: ఫుడ్‌ పాయిజన్‌ వెనుక బీఆర్‌ఎస్‌ కుట్ర :సీతక్క

  • ఎక్కడో ఓ చోట జరిగితే... రాద్ధాంతమా: మంత్రి పొన్నం

కొత్తగూడ, కొండపాక, ములుగు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఆహార కల్తీ వెనుక పెద్దకుట్ర జరుగుతోందని, రాజకీయం కోసం విద్యార్థులను బలి తీసుకునేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడలో ఆమె మాట్లాడారు. విద్యార్థులకు మంచి ఆహారం అందించాలనే ప్రభుత్వం మెస్‌ చార్జీలు పెంచిందన్నారు. మెస్‌చార్జీలు పెంచినప్పట్నుంచి ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు జరుగుతున్నాయన్నారు. తప్పుడు ప్రచారంతో బీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి బీఆర్‌ఎస్‌ నాయకులకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.


రాజకీయ ఉనికి కోసం విద్యార్థులను బలి తీసుకునేందుకు ఆ పార్టీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కల్తీ ఆహార ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఎక్కడో ఓ చోట ఫుడ్‌ పాయిజనింగ్‌ జరిగితే దానిని రాద్ధాతం చేయడం సరికాదని ప్రతిపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. విద్యార్థులకు సంబంధించిన ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Updated Date - Nov 30 , 2024 | 03:37 AM