Maoist victims: పౌరహక్కు నేతలపై మావోయిస్టు బాధిత కుటుంబాల భగ్గు
ABN , Publish Date - Dec 23 , 2024 | 03:27 AM
పౌరహక్కుల నేతల తీరుపై మావోయిస్టు బాధిత కుటుంబాలు భగ్గుమన్నాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక అడవుల్లో ఈ నెల 1న జరిగిన ఎన్‌కౌంటర్‌పై నిజనిర్ధారణకు వస్తున్నారని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఎన్‌కౌంటర్‌పై నిజనిర్ధారణకు వస్తున్నారని తెలిసి నిరసన
నక్సల్స్ తమ వారిని చంపినప్పుడు రాలేదెందుకని ఆగ్రహం
చల్పాక ఎన్‌కౌంటర్ బూటకం: పౌర హక్కుల సంఘం
ఏటూరునాగారం రూరల్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): పౌరహక్కుల నేతల తీరుపై మావోయిస్టు బాధిత కుటుంబాలు భగ్గుమన్నాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక అడవుల్లో ఈ నెల 1న జరిగిన ఎన్‌కౌంటర్‌పై నిజనిర్ధారణకు వస్తున్నారని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశాయి. మావోయిస్టులు తమ వారిని చంపినప్పుడు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తూ ఆదివారం ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేశాయి. ఈ సందర్భంగా మావోయిస్టు బాధిత కుటంబసభ్యులు కొందరు మాట్లాడుతూ, చెల్పాక అడవుల్లో ఎన్‌కౌంటర్‌కు ముందు వాజేడు మండలంలో మావోయిస్టుల చేతిలో తమ వారు ఊకే రమేశ్, అర్జున్ హత్యకు గురయ్యారని, ఆ సమయంలో నిజనిర్ధారణకు రాని పౌరహక్కుల నేతలు మావోయి స్టుల ఎన్‌కౌంటర్ జరిగిందని తెలిసి రావడం ఏమిటని ప్రశ్నించారు.
మావోయిస్టుల దుశ్చర్యల కారణంగా తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్‌ఫార్మర్ల నెపంతో తమ వారిని మావోయిస్టులు చంపినప్పుడు పౌర హక్కుల నాయకులకు తాము ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. పౌర హక్కుల సంఘాల తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొంటూ పౌరహక్కుల నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు. మరోవైపు ఆదివారం చల్పాక అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పౌర హక్కుల సంఘం నాయకులు పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఎన్‌కౌంటర్ బూటకమని, కోవర్టు వ్యవస్థ ద్వారా విషయ ప్రయోగం చేసి మావోయిస్టులను పోలీసులు కాల్చి చంపారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌పై తాము నిజనిర్ధాణ కోసం వస్తుంటే పోలీసులు అడుగుడుగునా ఆటంకాలు సృష్టించారని మండిపడ్డారు. ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని వారు డిమాండ్ చేశారు.