Share News

TG: ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన 5 గ్రామాలను తీసుకొస్తాం!

ABN , Publish Date - May 03 , 2024 | 04:28 AM

లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ.. తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించింది.

TG: ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన 5 గ్రామాలను తీసుకొస్తాం!

  • హైదరాబాద్‌లో సుప్రీం కోర్టు బెంచ్‌..

  • పాలమూరు, మేడారానికి జాతీయ హోదా..

  • తెలంగాణకు కాంగ్రెస్‌ ప్రత్యేక మేనిఫెస్టో

  • నేడు విడుదల చేయనున్న సీఎం రేవంత్‌

  • హైదరాబాద్‌లో సుప్రీం కోర్టు బెంచ్‌ ఏర్పాటు

  • తెలంగాణకు కాంగ్రెస్‌ ప్రత్యేక మేనిఫెస్టో

  • నేడు విడుదల చేయనున్న సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ.. తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించింది. వివిధ వర్గాల ప్రజల మద్దతును కూడగట్టేలా ఈ మేనిఫెస్టోను రూపొందించారు. ముఖ్యంగా ఏపీలోకి వెళ్లిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలోకి తీసుకురావడం, హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్‌ ఏర్పాటు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు, మేడారం జాతరకు జాతీయ హోదా, డ్రై పోర్టు, బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ వంటి అనేక హామీలను పొందుపరిచారని తెలిసింది.


మంత్రి శ్రీధర్‌ బాబు ఆధ్వర్యంలోని కమిటీ రూపొందించిన ఈ మేనిఫెస్టోను శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌ విడుదల చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ ఇప్పటికే జాతీయస్థాయిలో ‘పాంచ్‌ న్యాయ్‌, పచ్చీస్‌ గ్యారెంటీల’ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. అయితే తెలంగాణపై ప్రత్యేక ఫోక్‌సతో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ తాజా మేనిఫెస్టోను రూపొందించింది. దీనిలో అనేక అంశాలను పొందుపరిచింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించుకున్న ఐటీఐఆర్‌ను తిరిగి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌, హైదరాబాద్‌లో ఐఐఎం, హైదరాబాద్‌-విజయవాడ మధ్య రాపిడ్‌ రైల్వే, మైనింగ్‌ యూనివర్సిటీ ఏర్పాటు హామీలను పొందుపరిచారు. ఏపీలో కలిపేసిన ఎటపాక, గుండాల, పురుషోత్తంపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామాలను తిరిగి తెలంగాణలోకి తీసుకొస్తామని, పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా కల్పిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నీతి ఆయోగ్‌ రీజినల్‌ కార్యాలయం, రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టు, రామగుండం-మణుగూరు రైల్వే లైన్‌ నిర్మాణం వంటి అంశాలను చేర్చారు. విద్యా రంగానికి సంబంధించి 4 సైనిక్‌ స్కూళ్లు, నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, ఐఐఎ్‌సఈఆర్‌ ఏర్పాటు, కేంద్రీయ విద్యాలయాల పెంపు, నవోదయ విద్యాలయాల రెట్టింపు తదితర అంశాలను పొందుపరిచారు.


ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎ్‌ఫటీ), నేషనల్‌ ఏవియేషన్‌ యూనివర్సిటీ, జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌ఐ) క్యాంపస్‌, ఐసీఎంఆర్‌ పరిధిలో అడ్వాన్స్‌డ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటు హామీలను చేర్చారు. 73,74 రాజ్యాంగ సవరణల ఆధారంగా గ్రామ పంచాయతీలకు నేరుగా కేంద్ర గ్రాంటువచ్చేలా, ప్రతి ఇంటికీ సోలార్‌ ఆధారిత విద్యుత్‌కు అవకాశం కల్పించేలా చర్యలకు హామీ ఇచ్చారు. హైదరాబాద్‌-బెంగళూరు ఐటీ అండ్‌ ఇండస్ట్రీ కారిడార్‌, హైదరాబాద్‌-నాగ్‌పూర్‌, హైదరాబాద్‌-వరంగల్‌, హైదరాబాద్‌-మిర్యాలగూడ, సింగరేణి పారిశ్రామిక కారిడార్లు, అంతర్జాతీయ స్థాయిలో సాంస్కృతిక, వినోదాత్మక హబ్‌ ఏర్పాటు అంశాలను చేర్చారని సమాచారం.

Updated Date - May 03 , 2024 | 04:28 AM