KTR: జన్వాడ ఫామ్‌హౌస్‌కు అనుమతులే లేవు!
ABN , Publish Date - Aug 29 , 2024 | 03:53 AM
జన్వాడలో కేటీఆర్ ఫామ్‌హౌ్‌సకు సంబంధించి ఎలాంటి అనుమతులూ తీసుకోలేదని తెలిసింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని జన్వాడ ప్రాంతమంతా 111 జీవో పరిధిలో ఉంది.
అయినా.. ఇంటి నంబర్ కేటాయింపు.. పన్ను వసూళ్లు
111 జీవో నిబంధనలకు పూర్తి విరుద్ధంగా నిర్మాణం
రెండో రోజూ కొనసాగిన రెవెన్యూ అధికారుల సర్వే
ఫిరంగి కాలువలో, బఫర్ జోన్‌లో ఆక్రమణలపై ఆరా
ఒకటి, రెండు రోజుల్లో మరోసారి పరిశీలించే చాన్స్
పూర్తి వివరాలతో త్వరలోనే కలెక్టర్‌కు నివేదిక
శంకర్‌పల్లి, ఆగస్టు 28: జన్వాడలో కేటీఆర్ ఫామ్‌హౌ్‌సకు సంబంధించి ఎలాంటి అనుమతులూ తీసుకోలేదని తెలిసింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని జన్వాడ ప్రాంతమంతా 111 జీవో పరిధిలో ఉంది. ఇక్కడ 2013-14 మధ్య ఫామ్‌హౌ్‌సను నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించి అప్పటి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. కానీ, ఆ ఇంటికి నంబర్ కేటాయించి, ఏటా పన్ను వసూలు చేస్తుండడం గమనార్హం.
సర్వే నంబర్ 311-7లో 362 గజాల్లో ఇంటి నిర్మాణం ఉన్నట్లు పంచాయతీ రికార్డుల్లో ఉండగా.. ఫామ్‌హౌస్ 1,210 గజాల్లో ఉందని విశ్వసనీయ సమాచారం. 111 జీవో పరిధిలో కాంక్రీటుతో నిర్మాణాలు చేపట్టరాదనే నిబంధనలు ఉండగా.. అందుకు విరుద్ధంగా ఫామ్‌హౌ్‌సను మూడు అంతస్తుల్లో నిర్మించారు. మరోవైపు... జన్వాడ ఫామ్ హౌస్ వద్ద బుధవారం కూడా రెవెన్యూ అధికారుల సర్వే కొనసాగింది.
చేవెళ్ల రెవెన్యూ డివిజన్ సర్వే విభాగం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ రత్నాకర్‌రావు ఆధ్యర్యంలో శంకర్‌పల్లి ఆర్‌ఐ తేజ, సర్వేయర్ సాయితేజ, నీటి పారుదలశాఖ వర్క్ ఇన్‌స్పెక్టర్ లింగం తదితరులు మియాఖాన్‌గడ్డ నుంచి జన్వాడ ఫామ్‌హౌస్ మీదుగా శంకర్‌పల్లి మండల సరిహద్దు వరకు 500మీటర్ల మేర సర్వే చేపట్టారు. డిజిటల్ సర్వే (డీజీపీఎస్) మిషన్‌తో ఫిరంగి కాలువను పరిశీలించారు. కాలువతో, బఫర్ జోన్ ప్రాంతం ఏ మేరకు ఆక్రమణకు గురైందనే విషయాన్ని ఆరా తీశారు. ఒకటి రెండు రోజుల్లో మరో సారి సర్వే చేపట్టి, పూర్తి వివరాలతో కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని అధికారులు తెలిపారు.