Hyderabad: అర్ధశతాబ్ది నగర తెలుగు సాంస్కృతికమూర్తి కేఎస్ మూర్తి కన్నుమూత
ABN , Publish Date - Jun 28 , 2024 | 03:16 AM
అర్ధశతాబ్ది నగర తెలుగు సాంస్కృతికమూర్తిగా పేరుగాంచిన కేఎస్ మూర్తి(77) ఇకలేరు. సోమవారం అమెరికాలో ఆయన తుది శ్వాస విడిచారు.
చిక్కడపల్లి, హైదరాబాద్, జూన్ 27(ఆంధ్రజ్యోతి): అర్ధశతాబ్ది నగర తెలుగు సాంస్కృతికమూర్తిగా పేరుగాంచిన కేఎస్ మూర్తి(77) ఇకలేరు. సోమవారం అమెరికాలో ఆయన తుది శ్వాస విడిచారు. దశాబ్దకాలంగా అమెరికాలో ఉంటున్న కేఎస్ మూర్తి హైదరాబాద్‌లో దాదాపు అయిదు దశాబ్దాల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే నాటకాలలో, దూరదర్శన్ ఆనందోబ్రహ్మ సీరియల్‌లో నటించారు. అమెరికా వెళ్లాక అక్కడ ఉన్న భారతీయ సీనియర్ సిటిజన్లతో కలిసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలతో పాటు మన దేశభక్తిని, దేశ సమగ్రతను తెలియజేసేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి వ్యక్తిగా పేరొందారు.
ఆయన అంతర్జాతీయ తెలుగు సాంస్కృతిక సంఘం, ఫాస్ ఫిలిం సంస్థల అమెరికా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. వంశీ ఆర్ట్ థియేటర్స్ వ్యవస్థాపక సభ్యులైన ఆయన స్టేట్‌బ్యాంకు మూర్తిగా అందరికీ పరిచయస్థులు. కేఎస్ మూర్తి మరణం పట ఇట్‌క్లా, ఫాస్, ఇట్ మా సంస్థల ముఖ్యులు సంస్కృతిరత్న డా. ధర్మారావు, సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, సినీ నిర్మాత రామ సత్యనారాయణ తదితరులు సంతాపం ప్రకటించారు.