Kishan Reddy: 10 లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకున్నాం
ABN , Publish Date - Dec 24 , 2024 | 04:22 AM
దేశంలోని 10 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకున్నదని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అన్నారు.
రోజ్‌గార్ మేళాలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్
అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత
బిట్స్‌పిలానీ, చార్మినార్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): దేశంలోని 10 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకున్నదని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అన్నారు. సోమవారం రోజ్‌గార్ మేళా (ఉద్యోగ ఉపాధి) 14వ ఎడిషన్‌లో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొని మాట్లాడారు. పాతబస్తీ చాంద్రాయణగుట్టలోని సీఆర్‌పీఎఫ్ గ్రూప్‌సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఉద్యోగ నియమక పత్రాల అందజేత కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగం, కుటుంబంతో పాటు దేశ సేవలో యువత నీతి నీజాయితితో విధులు నిర్వహించాలన్నారు. అప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. మోదీ సూచన మేరకు 2020 అక్టోబరు నుంచి ప్రారంభించిన రోజ్‌గార్ మేళాలో, నేటి వరకు దాదాపు పది లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పించామని తెలిపారు.
ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 526 మంది యువతకు ఆయన నియమక పత్రాలను అందించారు. జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని హకీంపేట్‌లోని సీఐఎ్‌సఎఫ్ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు. మరో 75 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తే తమ లక్ష్యం పూర్తవుతుందన్నారు. ఇవే కాకుండా యువత స్వయం శక్తితో ఎదిగే విధంగా ప్రభుత్వ రుణాలను అందిస్తూ వారిని పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. 2028 నాటికి ప్రపంచ దేశాలలో మన దేశం ఆర్థికంగా మూడో స్థానానికి చేరుతుందని వివరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందిన 348 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు.