Share News

Justice Sudarshan Reddy: గొప్ప మానవతావాది హరగోపాల్..

ABN , Publish Date - Jul 28 , 2024 | 04:32 AM

ప్రొఫెసర్‌ హరగోపాల్‌ గొప్ప మానవతావాది, ప్రతీ సమస్యను మానవీయ కోణంలో చూడగలిగిన ప్రజా మేధావి అని సుప్రీంకోర్టు విశ్రాంత జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి అభివర్ణించారు.

Justice Sudarshan Reddy: గొప్ప మానవతావాది హరగోపాల్..

హైదరాబాద్‌ సిటీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : ప్రొఫెసర్‌ హరగోపాల్‌ గొప్ప మానవతావాది, ప్రతీ సమస్యను మానవీయ కోణంలో చూడగలిగిన ప్రజా మేధావి అని సుప్రీంకోర్టు విశ్రాంత జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి అభివర్ణించారు. తెలంగాణ మలిదశ ఉద్యమకాలం నుంచి దేశ, రాష్ట్ర పరిస్థితులపై ప్రొఫెసర్‌ హరగోపాల్‌ రాసిన వ్యాసాలతో పాటు పలు పుస్తకాలకు ఆయన రాసిన ముందు మాటలు కలిపి విడుదల చేసిన ఆరు పుస్తకాలపై వెలువడిన సమీక్షను ‘సామాజిక చలనం- ప్రజాస్వామిక ప్రతిస్పందన’ సంపుటిగా పాలమూరు అధ్యయన వేదిక ప్రచురించింది. దీన్ని శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి ఆవిష్కరించారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాజిక మార్పు కోసం ఉద్యమిస్తున్నవారంతా తప్పనిసరిగా రాజ్యాంగాన్ని ఆసరాగా తీసుకోవాలని సూచించారు. హెచ్‌సీయూ ప్రొఫెసర్‌ కె.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తన ప్రజాస్వామిక ఆలోచనలు, ఆచరణతో ఎంతోమందిని ప్రభావితం చేసిన మానవతావాది హరగోపాల్‌ అని కొనియాడారు. ‘‘ఆపరేషన్‌ కగార్‌ వంటి అమానుష ఘటనల మీద నిరసన గళాన్ని వినిపిస్తున్న అతి కొద్దిమందిలో హరగోపాల్‌ నాయకత్వ స్థానంలో ఉన్నారు’’ అని ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌ ప్రశంసించారు. కార్యక్రమంలో అర్విణి రాజేంద్రబాబు, రాఘవాచారి, ప్రొఫెసర్‌ హరగోపాల్‌ జీవిత సహచరి డా.వనమాల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 04:32 AM