Justice K. Sharath: చిన్నపిల్లల్లో మధుమేహంతో జాగ్రత్త
ABN , Publish Date - Dec 30 , 2024 | 04:17 AM
చిన్నపిల్లల్లో వచ్చే మధుమేహం విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, వైద్యుల సలహాలను తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే శరత్ సూచించారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే శరత్ సూచన
‘డయాబెటిక్ అండ్ యూ’ ఆధ్వర్యంలో చిన్నారులకు ఔషధాల పంపిణీ
మోతీనగర్, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): చిన్నపిల్లల్లో వచ్చే మధుమేహం విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, వైద్యుల సలహాలను తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే శరత్ సూచించారు. మధుమేహంతో బాధపడుతున్న చిన్నారుల కోసం డయాబెటిక్ అండ్ యూ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్, మాదాపూర్‌లోని క్యాప్‌స్టన్ డయాబెటిక్ సెంటర్‌లో ఆదివారం నిర్వహించిన వైద్య శిబిరానికి జస్టిస్ శరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మధుమేహంతో బాధపడుతున్న చిన్నారులతో ప్రత్యేకంగా మాట్లాడారు.
మధుమేహం వల్ల పిల్లలకు ఎదురయ్యే పరిస్థితులను తల్లిదండ్రులు, వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. మధుమేహంతో బాధపడే చిన్నారులకు ఔషధాలు, వైద్య పరికరాలను ఉచితంగా అందిస్తున్న డయాబెటిక్ అండ్ యూ సొసైటీ సేవలను ప్రశంసించారు. మధుమేహంతో బాధపడుతున్న పిల్లలకు సొసైటీ సమకూర్చిన మందులు, గ్లూకోమీటర్లను అందజేశారు. అనంతరం డయాబెటిక్ అండ్ యూ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ వసంత్ కుమార్ మాట్లాడుతూ.. మధుమేహంతో బాధపడుతున్న చిన్నారులకు తమ సంస్థ ద్వారా 20 ఏళ్లుగా సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొడాలి శ్రీకాంత్, కృష్ణా విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి వీ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.