Share News

Forest: కాగితాలకే పరిమితమైన సర్కిళ్లు

ABN , Publish Date - May 20 , 2024 | 04:32 AM

పోలీస్‌ స్టేషన్ల మాదిరిగా అటవీ శాఖ పరిధిలో ఫారెస్ట్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్న అంశం అటకెక్కింది. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 30 ఫారెస్ట్‌ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అటవీశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ఆయుధాలు అందజేయాలని కోరింది. ఈ ప్రతిపాదనలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి.

Forest: కాగితాలకే పరిమితమైన సర్కిళ్లు

  • ఆయుధాలు ఇవ్వాలన్న ప్రతిపాదన గాలికే

హైదరాబాద్‌, మే 19(ఆంధ్రజ్యోతి): పోలీస్‌ స్టేషన్ల మాదిరిగా అటవీ శాఖ పరిధిలో ఫారెస్ట్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్న అంశం అటకెక్కింది. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 30 ఫారెస్ట్‌ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అటవీశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ఆయుధాలు అందజేయాలని కోరింది. ఈ ప్రతిపాదనలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. అటవీ సిబ్బందిపై దాడులు జరిగినప్పుడు ఉన్నతాధికారులు హడావుడి చేసి చేతులు దులుపుకొంటున్నారు. 2022 నవంబరు 22న కొత్తగూడెం జిల్లా ఎర్రబోడు అటవీ ప్రాంతంలో ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు దారుణ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత 30 ఫారెస్ట్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని, అధికారులకు ఆయుధాలు(గన్స్‌) ఇవ్వాలని అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అటవీ శాఖ ప్రతిపాదనలు పంపింది. తొలి దశలో 30 స్టేషన్లు, ఒక్కో చోట 18మంది సిబ్బందిని నియమించాలని సూచించింది. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయయూ తీసుకోలేదు. అటవీశాఖ సిబ్బందిపై దాడులు జరిగినప్పుడు ఆయుధాలు ఇవ్వాలని కోరడం.. తరువాత మరుగున పడిపోవడం పరిపాటిగా మారింది.


సర్కిళ్ల ఉత్తర్వుల జారీ అయినా..

అటవీశాఖలో సర్కిళ్లను, వాటికి సంబంధించిన ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేస్తూ 2023లో అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులిచ్చారు. భూపాలపల్లిలో కాళేశ్వరం సర్కిల్‌, నిర్మల్‌లో బాసర సర్కిల్‌, సిద్దిపేటలో రాజన్న సర్కిల్‌, వరంగల్‌లో భద్రాద్రి సర్కిల్‌, నల్లగొండలో యాదాద్రి సర్కిల్‌, హైదరాబాద్‌లో చార్మినార్‌ సర్కిల్‌, మహబూబ్‌నగర్‌లో జోగులాంబ సర్కిల్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.ప్రత్యేక సర్కిళ్లను ఏర్పాటు చేస్తామని ఉత్తర్వులిచ్చినా.. ఒక్కటీ ఏర్పాటు చేయలేదు.


సిబ్బందిపై తరచూ దాడులు

పోడు భూముల వ్యవహారంలో అటవీ అధికారులకు, గిరిజనులకు పెద్ద ఎత్తున వివాదాలు నెలకొంటున్నాయి. వన్యప్రాణులను కాపాడే క్రమంలో వేటగాళ్ల నుంచి ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. గత రెండేళ్లలో జరిగిన దాడులను పరిశీలిస్తే.. కొత్తగూడెం జిల్లాలోని చంద్రుగొండ మండలంలో చాలా చోట్ల తరచు గొడవలు జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లా కోయపోశగూడెంలో అటవీ భూమిలో సాగును అడ్డుకున్న అధికారులపై ఆదివాసీలు తిరగబడడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి సమీపంలో, ఆళ్లపల్లి మండలం ఆళ్లపల్లి, చింతకూద, రాయిపాడు, ముత్తాపురం, బర్లగూడెం గ్రామాల పరిధిలోని పోడు భూముల్లో 10 వేలకుపైగా మొక్కలు నాటేందుకు వెళ్లిన సిబ్బందితో గిరిజనులు ఘర్షణకు దిగారు. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రాసిగుట్ట తండాల్లో పోడు భూముల సర్వేకు వెళ్లిన అధికారులు, తండావాసుల మధ్య వివాదం నెలకొంది. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని చిత్రియాల, పెద్దమూల, నల్లచెలముల బుడ్డోని తండా పరిధిలో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటేందుకు ప్రయత్నించగా.. తండాలవాసులు అడ్డుకున్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావుడి చేస్తున్న ఉన్నతాధికారులు.. తర్వాత పట్టించుకోవడం లేదని సిబ్బంది వాపోతున్నారు.

Updated Date - May 20 , 2024 | 04:32 AM